వాటిని బీజేపీ మింగేస్తుందా…!!

ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా బీజేపీ సిధ్ధాంతకర్తలు తీర్మానించేశారు. వారికి జాతీయ భావం ఉండదు, ప్రాంతీయ భావం అంతకంటే ఉండదు, ఉన్నదల్లా జాతి భావమేనని కూడా నిర్ధారించేశారు. [more]

Update: 2019-08-22 17:30 GMT

ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా బీజేపీ సిధ్ధాంతకర్తలు తీర్మానించేశారు. వారికి జాతీయ భావం ఉండదు, ప్రాంతీయ భావం అంతకంటే ఉండదు, ఉన్నదల్లా జాతి భావమేనని కూడా నిర్ధారించేశారు. ఈ నినాదంతోనే ఉత్తరాది నుంచి నరుక్కువస్తున్న బీజేపీకి ఇపుడు దక్షిణాది పెను సవాల్ విసురుతోంది. ఇక్కడ ఉన్నవి చాలా మటుకు ప్రాంతీయ పార్టీలే. అందుకే మరింత శ్రధ్ధగా బీజేపీ తన నినాదానికి పదును పెడుతోంది. జనంలో ఆ పార్టీల మీద ఏహ్య భావం కలగాలంటే దానికి తగిన సరంజామా సిధ్ధం చేయాలి కదా. ఇపుడు బీజేపీ అదే చేస్తోంది. దక్షిణాదిన నూటాపాతిక దాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. అందుకే బీజేపీ సౌత్ సరాగం అందుకుంటోంది.

తండ్రీ కొడుకుల పార్టీలు…

తెలంగాణాలో పాగా వేద్దామని హైదరాబద్ వచ్చిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కొత్త నినాదం జనం ముందుకు తెచ్చారు. ప్రాంతీయ పార్టీలన్నీ తండ్రీ కొడుకుల పార్టీలని ఆయన డైరెక్ట్ గానే బాణాలు వేశారు. అది తగలాల్సిన చోట టీఆర్ఎస్ కి బాగానే తగిలింది. అక్కడ కేసీయార్, కేటీయార్ మాత్రమే నాయకులు. వారి మాటే చెల్లుతుంది. తండ్రికి వారసుడు కేటీయార్ తప్ప జనానికి కాడని కూడా బీజేపీ నేతలు బాగానే ఎస్ట్లాబ్లిష్ చేస్తున్నారు. అదే సమాయంలో కర్ణాటకలో చూసుకుంటే దేవెగౌడ ఆయన కొడుకు కుమారస్వామిల పార్టీ జేడీఎస్ ఉంది. ఇక్కడ తమిళనాడుకు వెళ్తే నిన్నటి వరకూ జీవించి ఉన్న కరుణానిధి, ఆయన రాజకీయ వారసుడు స్టాలిన్ ఉన్నారు. ఇపుడు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ రెడీ అయ్యారు. ఇలా చూస్తే ఇవన్నీ తండ్రీ కొడుకుల పార్టీలుగానే చెప్పాలి. ఏపీకి వస్తే చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పార్టీలనే సర్వస్వం. ఇలా ఆ ప్రాంతీయ పార్టీకి కూడా బీజేపీ బాణం బాగానే తగిలింది. ఇంకో వైపు అధికారంలో ఉన్న‌ వైసీపీలో జగన్ అధినేత అయినా ఆయన పార్టీ పేరే తండ్రి వైఎస్సార్ ది అంటే తండ్రి పేరు చెప్పుకుని పవర్లోకి వచ్చినట్లేనని బీజేపీ సూత్రీకరిస్తోంది.

జనం నాడి పట్టుకుంటారా?

ప్రాంతీయ పార్టీలు, ఆకాంక్షలు ఎందుకు పుడతాయో అందరికీ తెలిసిందే. దేశంలో సరైన నాయకత్వం లేకపోయిన వేళ‌. ఆ నాయకత్వం మీద విసుగు పుట్టినపుడు, తమపైన వివక్ష చూపుతున్నారని జనం భావించినపుడు ప్రాతీయ పార్టీలు పుట్టుకొస్తాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధి కుమారుడిగా హైదరాబాద్ వచ్చిన రాజీవ్ గాంధి బేగంపేట విమానాశ్రయంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్యని అవమానించకపోయి ఉంటే టీడీపీ పుట్టి ఉండేది కాదు. అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రులను బానిసలుగా చూసి ఉండకపోతే ఏ ప్రాంతీయ ఆకాంక్షకు అంత బలం వచ్చి ఉండేది కాదు. ఇపుడు పరిస్థితిలో మార్పు వచ్చిందని రాజకీయ పండితులు కూడా భావిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే దేశంలోని ప్రాంతీయ వాదం మెల్లగా వీగిపోతూంటే జాతీయ వాదం క్రమంగా బలపడుతోంది. దేశంలోని అనేక మంది ప్రాంతీయ నాయకుల కంటే కూడా మోడీకి ఎంతో పొలిటికల్ గ్లామర్ ఉంది. అదే ఆయన్ని బంపర్ మెజారిటీతో రెండవమారు అధికారంలో కూర్చోబెట్టింది. అందువల్ల ప్రాతీయ పార్టీలు ప్రజల అభిమతానికి తగిన విధంగా పాలించకపోతే మింగేయడానికి బీజేపీ రెడీగా ఉంది. ఆ కసరత్తు కాషాయం పార్టీలో ఇప్పటికే జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News