ఇక్కడ నెగ్గితే చాలు పరువు దక్కుతుందట

నాలుగు రాష్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ ఒకటికాగా, రెండోది కేరళలోని [more]

Update: 2021-04-12 16:30 GMT

నాలుగు రాష్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ ఒకటికాగా, రెండోది కేరళలోని నెమామ్. నందిగ్రామ్ లో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయి, రాష్రంలో పార్టీ గెలిచినా మమత పరాజయం పాలైనట్లే. ఒకవేళ ఆమె గెలిచి, రాష్రంలో పార్టీ ఓడినా ఆమెకే నష్టం. ఇక కేరళలోని నెమామ్ లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. గత ఎన్నికల్లో గెలిచిన ఈ ఏకైక స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దీనిని కాపాడుకోవడంతోపాటు మెట్రో శ్రీధరన్ పోటీచేస్తున్న కొట్టాయం, మరికొన్ని నియోజకవర్గాల్లోనూ పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

బీజేపీ ఓడించడం ద్వారా…..

అయితే నెమామ్ లో బీజేపీని ఓడించడం ద్వారా కేరళలో కాషాయపార్టీకి చోటు లేకుండా చేయాలని సీపీఎం, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఇందుకోసం ఈ రెండు పార్టీలు అంతర్గతంగా ఒక అవగాహనకు వచ్చాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో నెమామ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తిరువనంతపురం జిల్లాలోని నెమామ్ స్థానం నుంచి 2016లో భాజపా తరఫున ఒ.రాజగోపాల్ విజయ కేతనం ఎగురవేశారు. అప్పట్లో ఆయనకు 67,813 ఓట్లు రాగా, వామపక్ష కూటమి అభ్యర్థి శివకుట్టికి 59,142, యూడీఎఫ్ అభ్యర్థి సురేంద్రన్ పిళ్లైకి 13,860 ఓట్లు లభించాయి. 2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో కాషాయ పార్టీకి 58,513, కాంగ్రెస్ కు 46,472, సీపీఐ కి 33,921 ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాల నేపథ్యంలో ఈసారి మరింత బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే సిట్టింగ్ శాసనభ్యుడు రాజగోపాల్ బదులు సీనియర్ నాయకడు కుమ్మనం రాజశేఖరన్ ను బరిలోకి దింపింది.

గవర్నర్ గా పనిచేసి…..

రాజశేఖరన్ 2018-19 ప్రాంతంలో ఈశాన్య రాష్ర్టమైన మిజోరాం గవర్నర్ గా పనిచేశారు. కొంతకాలం కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తరవాత రోజుల్లో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. క్రమంగా బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. పార్టీ కేరళ శాఖకు పెద్ద దిక్కుగా మారారు. నెమామ్ సీటును నిలబెట్టుకోవడం ద్వారా పార్టీ పట్టు తగ్గలేదని నిరూపించుకోవడానికి కార్యకర్తలు శ్రమిస్తున్నారు. నెమామ్ నియోజకవర్గంలో హిందువులు అత్యధికులు. దీంతో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) హిందువైన కె.మురళీధరన్ ను రంగంలోకి దించింది. ఈయన దివంగత మాజీ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్ తనయుడు. కరుణాకరన్ తరచూ పాల్ఘాట్ లోని శ్రీక్రిష్ణుడి దేవాలనయాన్ని సందర్శించేవారు. అక్కడినుంచే కీలక రాజకీయ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టేవారు. ఇప్పుడు హిందువుల ఓట్లను ఆకట్టుకునేందుకే మురళీధరన్ ను ఓటర్ల ముందుంచింది. మురళీధరన్ గతంలో పీసీసీ చీఫ్ గా, రాష్ర్ట మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వటకర ఎంపీగా కొనసాగుతున్నారు. హిందువుల ఓట్ల పై కన్నేసిన సీపీఎం సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వి.శివకుట్టిని తమ అభ్యర్థిగా నిలిపింది. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది.

త్రిముఖ పోటీ…..

పేరుకు ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ఉమ్మడి శత్రువైన బీజేపీని ఓడించేందుకు సీపీఎం, కాంగ్రెస్ ఒక అవగాహనకు వచ్చాయన్న వాదన రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. తొలి నుంచీ రెండో స్థానంలో నిలుస్తున్న కాంగ్రెస్ కు అనుకూలంగా ఇతర పార్టీలు పని చేసే అవకాశాలను తోసిపుచ్చలేమన్న వాదన వ్యక్తమవుతోంది. నెమామ్ తమ కంచుకోటని ఇక్కడ తమను ఓడించడం అసాధ్యమని, రాహుల్ గాంధీ నిలబడినా మాపై గెలవలేరని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.సురేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు. నెమామ్ ను కేరళలోని గుజరాత్ గా ఆయన అభివర్ణించారు. నెమామ్ ఎప్పటికీ తమదేనని, ఇక్కడ మరొకరు కాలు పెట్టడానికి అవకాశం ఇవ్వ బోమని సురేంద్రన్ వాదన. ఈ నేపథ్యంలో నెమామ్ లో నెగ్గేదెవరన్నది తేలాలంటే మే 2వరకు వేచి చూడక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News