నష్టమా? లాభమా?

ఢిల్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. సామాజిక వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే [more]

Update: 2020-01-25 17:30 GMT

ఢిల్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. సామాజిక వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే బీజేపీ తన భాగస్వామ్య పక్షాల విషయంలో మాత్రం కొంత ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే అకాలీదళ్ ఢిల్లీలో పోటీ చేయబోమని ప్రకటించింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ పౌరసత్వ చట్ట సవరణపై బీజేపీతో వ్యతిరేకిస్తుంది.

అకాలీదళ్ పక్కకు తప్పుకుని….

ఢిల్లీలో సిక్కు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తమకు ఎక్కువ స్థానాలను కావాలని శిరోమణి అకాలీదళ్ కోరింది. అయితే బీజేపీ అధిష్టానం ఇందుకు సమ్మతించలేదు. దీంతో తాము పోటీకి దూరంగా ఉంటున్నట్లు అకాలీదళ్ ప్రకటించింది. అకాలీదళ్ వ్యతిరేకించడంతో ఆ ప్రభావం సిక్కు ఓటర్లపై పడుతుందన్న ఆందోళనలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇందుకు ప్రత్యేకంగా ఆ వర్గానికి చెందిన నేతలను ప్రచారంలోకి దించుతోంది.

జేజేపీ సయితం….

ఇక మరో మిత్రపక్షమైన జననాయక్ జనతా పార్టీ సయితం పోటీకి దూరమని ప్రకటించింది. ఇటీవల హర్యానా ఎన్నికల్లో బీజేపీ, జేజేపీలు కలసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశాయి. జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. జేజేపీకి హర్యానాలో కేటాయించిన గుర్తును ఢిల్లీలో కేటాయించకపోవడం వల్లనే తాము పోటీ చేయడం లేదని ప్రకటించారు. హర్యానా పక్కనే ఉన్న ఢిల్లీలో జేజేపీ కూడా కొంత ప్రభావం చూపే అవకాశముంది. జాట్ సామాజికవర్గం కూడా ఢిల్లీ పరిధిలోనే ఎక్కువగా ఉంది.

నష్టమేనంటున్న……

అయితే పోటీ చేయకపోయినా దుష్యంత్ చౌతాలాతో ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే హర్యానా ప్రభుత్వంలో దుష్యంత్ చౌతాలా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిత్రపక్షాలు పోటీ చేయకపోవడం తమకు లాభమేనని బీజేపీ చెబుతోంది. ఓట్లు చీలిపోకుండా తమ వైపే నిలుస్తాయని బీజేపీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఇలా మొత్తం మీద మిత్రపక్షాలు పోటీకి దిగకపోవడం లాభమని బీజేపీ అంటుంటే… నష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News