ఈసారి ఆ తప్పు చేయరట

ఢిల్లీ ఎన్నికలను సుదీర్ఘకాలం తర్వాత చేజిక్చించుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ గతంలో చేసిన తప్పులు చేయకూడదని నిర్ణయించుకుంది. ఢిల్లీ పరిధిలో అనేక మంది బీజేపీ సీనియర్ [more]

Update: 2020-01-12 17:30 GMT

ఢిల్లీ ఎన్నికలను సుదీర్ఘకాలం తర్వాత చేజిక్చించుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ గతంలో చేసిన తప్పులు చేయకూడదని నిర్ణయించుకుంది. ఢిల్లీ పరిధిలో అనేక మంది బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు. వారెవ్వరికీ పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించకూడదని అధిష్టానం నిర్ణయించుకుందని తెలుస్తోంది. అదే జరిగితే ముఖ్యమంత్రి పదవి ఆ నేతకే దక్కుతుందన్న ప్రచారం జరుగుతుందని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది.

రెండుసార్లు అంతే….

2013లో హర్షవర్థన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి దెబ్బతినింది. 2015 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన, సీనియర్ మాజీ పోలీస్ అధికారిణి కిరణ్ బేడీని ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా దెబ్బతినింది. డెబ్భయి స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆ ఎన్నికల్లో బీజేపీకి దక్కింది కేవలం మూడు స్థానాలు మాత్రమే. ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది.

ఈసారి మాత్రం….

అందుకే ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించకూడదని బీజేపీ భావిస్తుంది. దానివల్ల లేనిపోని సమస్యలే తప్ప రాజకీయంగా కూడా ప్రయోజనం లేదని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తే మనోజ్ తివారీ ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటికీ ఆయనే ఢిల్లీ సీఎం అవుతారని పార్టీ వర్గాలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.

మనోజ్ తివారీ పేరు…..

కానీ నేరుగా సీఎం అభ్యర్థిని ప్రకటించేది లేదని మాత్రం బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. తమ ప్రధాని నరేంద్ర మోడీని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని బీజేపీనేతలు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో సీఎం అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అజయ్ మాకెన్ చూస్తున్నా ఆయన పేరును కాంగ్రెస్ ప్రకటించలేదు. దీంతో బీజేపీ కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంలో ఉంది. మొత్తం మీద గత ఎన్నికల్లో చేసిన తప్పులను ఈసారి చేయకూడదని బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News