అసలు లోపమేంటో ఇప్పటికైనా తెలిసిందా?

ఏ పార్టీ ఏ రాష్ర్టంలో అధికారంలోకి రావాలన్నా దానికి బలమైన స్థానిక నాయకత్వం అవసరం. ప్రజలను ఆకట్టుకునే, వారిపై బలమైన ప్రభావాన్ని చూపగల సత్తా ఉన్న నాయకుడు [more]

Update: 2021-05-25 16:30 GMT

ఏ పార్టీ ఏ రాష్ర్టంలో అధికారంలోకి రావాలన్నా దానికి బలమైన స్థానిక నాయకత్వం అవసరం. ప్రజలను ఆకట్టుకునే, వారిపై బలమైన ప్రభావాన్ని చూపగల సత్తా ఉన్న నాయకుడు తప్పనిసరి. ఇలాంటి పటిష్ట పునాదులు లేకుండా ఎంత హడావిడి, ఆర్భాటం చేసినా ఫలితం పూజ్యమే. కేవలం కేంద్ర నాయకులు, వలస వచ్చిన ఛోటామోటా నాయకులు, కార్యకర్తలు పార్టీని విజయ తీరాలకు చేర్చలేరు. రాష్ర్ట భౌగోళిక, రాజకీయ పరిస్థితులు తెలియని ఇతర ప్రాంతాల నాయకులు పటిష్టమైన వ్యూహరచన చేయగలరు. అంతే తప్ప ప్రజలపై ఎంతమాత్రం ప్రభావం చూపలేరు. బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఈ విషయం బాగానే అర్థమైంది. ఫలితాల అనంతరం జరిగిన పోస్టుమార్టంలో ఈ విషయం మరింత స్పష్టంగా తేటతెల్లమైంది.

పూర్తిగా బెంగాల్ పైనే..?

ఇటీవలి అయిదు రాష్ర్టల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా బెంగాల్ పైనే దష్టి కేంద్రీకరించింది. తమిళనాడు, కేరళల్లో పరిస్థితి ముందుగానే తెలుసు. అసోంలో విజయంపై అంతగా ఆందోళన పడలేదు. పుదుచ్చేరిలో దానిది ఎటూ ద్వితీయపాత్రే. అందువల్ల బెంగాల్ పై బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. దీనికి ప్రత్యేక కారణం ఉంది. యూపీ తరవాత 294 అసెంబ్లీ, 42 పార్లమెంటు సీట్లతో దేశంలో రెండో అతిపెద్ద రాష్రం బెంగాల్. ఎనిమిది రాష్రాల ఈశాన్య భారతానికి బెంగాల్ ముఖద్వారం. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్య మంత్రి మమత మాదిరిగా మోదీని సవాల్ చేస్తున్న నాయకులు ఎవరూ లేరు. దీంతో 2019లో 18 పార్లమెంటు సీట్లు సాధించిన ఊపుతో అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఆట కట్టించాలని కమలనాధులు కలలుగన్నారు. కాషాయజెండా ఎగరవేయాలనుకున్నారు.

కీలక అంశాలను….?

కానీ ఈ ప్రయత్నంలో కొన్ని కీలక అంశాలను విస్మరించారు. ముందుగా రాష్ర్టవ్యాప్తంగా జనాకర్షణ లేకపోవడం పార్టీకి పెద్ద లోటుగామారింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు , మెదినీపూర్ ఎంపీ అయిన దిలీప్ ఘోష కు గల ప్రజాదరణ అంతంత మాత్రమే. పార్టీకి గల 18 మంది ఎంపీల్లో పట్టుమని పదివేల మంది జనాన్ని సభలకు సమీకరించే ఒక్కరికీ సామర్థ్యం లేదు. అసన్సోల్, రాయ గంజ్ నుంచి గెలిచి కేంద్రమంత్రులైన బాబుల్ సుప్రియో, దేబశ్రీ రాయ్ లకు గల ప్రజాదరణ అంతంత మాత్రమే. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయమంత్రి సుప్రియో టోలీగంజ్ లో, లోక్ సభ సభ్యురాలు లాకెట్ ఛటర్జీ చున్ చురాలో, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా తారాకేశ్వర్ లో ఓడి పోవడం ఇందుకు నిదర్శనం. గుప్తా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బరిలోకి దిగడం గమనార్హం. లోక్సభ సభ్యుడు నిషిత్ ప్రామాణిక్ మాత్రం దిన్ హటా సీటు నుంచి గెలిచారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిని…?

కాస్తోకూస్తో ప్రజల్లో బలం ఉన్న సువెందు అధికారి సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్ లో నేరుగా ముఖ్యమంత్రి మమత పోటీచేయడంతో ఆయనకు ఇతర ప్రాంతాలపై దష్టి సారించే అవకాశం లేకుండా పోయింది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ప్రకటించకపోవడం ఒక లోపం. దీంతో ఎవరికి వారు తమ ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఫలితంగా ప్రచార భారమంతా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లపై పడింది. వారి సభలకు జనాన్ని సమీకరించడానికే స్థానిక నాయకులకు సరిపోయింది. ఇక దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్య నాధ్ వంటి నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల మేలుకన్నా కీడే ఎక్కువ జరిగింది. ఇంతమంది నాయకులు ఒక్క మహిళ లక్ష్యంగా పనిచేస్తున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడింది. మతపరమైన చీలికలతో ఓట్లను కొల్ల గొట్టే ప్రయత్నం బెడిసి కొట్టింది. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల అంశం పనిచేయలేదు. అంతిమంగా ఇవన్నీ కోల్ కతా పీఠాన్ని అధష్టించాలన్న బీజేపీ ఆశను అడియాశ చేసింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News