తెలంగాణలోనూ త్రిపుర తరహా వ్యూహం

తెలంగాణాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. కర్ణాటక తర్వాత దక్షిణాదిన తెలంగాణ మాత్రమే బీజేపీకి ఆశాజనకంగా కన్పిస్తుంది. కొంచెం కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి [more]

Update: 2020-12-16 00:30 GMT

తెలంగాణాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. కర్ణాటక తర్వాత దక్షిణాదిన తెలంగాణ మాత్రమే బీజేపీకి ఆశాజనకంగా కన్పిస్తుంది. కొంచెం కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి రావడం సులువని గ్రహించింది. దీనికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే. దీంతో ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారు.

మూడేళ్ల సమయం ఉన్నా…

తెలంగాణలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అయినా సరే ఇప్పటి నుంచే గ్రామ గ్రామాన పార్టీని విస్తరించేలా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే కొందరు సంఘ్ సేవక్ లను ఎంపిక చేసి వారిని తెలంగాణకు పంపే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీరంతా తమకు కేటాయించిన గ్రామాల్లోనే ఉంటూ అక్కడ పార్టీని పటిష్టం చేయనున్నారు.

సంఘ్ పరివార్ తో…..

త్రిపురలో ఇదే తరహా వ్యూహంతో బీజేపీ వెళ్లి అక్కడ విజయం సాధించింది. అందుకే తెలంగాణలోనూ త్రిపుర ఫార్ములాతో వెళ్లాలని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే కొందరు ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు తెలంగాణకు వచ్చినట్లు చెబుతున్నారు. వీరంతా స్థానిక ఆర్ఎస్ఎస్ నేతలతో సమావేశం కూడా నిర్వహించారంటున్నారు. వీరంతా కలసి మండలాల వారీగా విడిపోయి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడతారంటున్నారు. పార్టీ కార్యక్రమాలే కాకుండా వీరు సామాజిక సేవ కూడా చేయనున్నారు.

విస్తరణలోనూ…..

దీంతో పాటు త్వరలో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డితో పాటు మరొకరికి ఇవ్వాలని గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీ కేంద్ర నాయకత్వం డిసైడ్ చేసినట్లు సమాచారం. మొత్తం మీద తెలంగాణ మీద బీజేపీ అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News