కమలనాథులకు కనువిప్పు

Update: 2018-05-04 15:30 GMT

తిమ్మిని బమ్మిని చేసి తిరకాసుగా మార్చేసి ఓట్లు కొట్టేయాలనుకుంటున్న నాయకులకు ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ చెంపపెట్టులాంటి మాట చెప్పారు. తన సొంతపార్టీ బీజేపీని ఉద్దేశించే ఆయన వ్యాఖ్యలు చేసినా అన్ని పార్టీలూ అనుసరించదగ్గ మంచి బాట చూపారు. ఓటు బ్యాంకు రాజకీయాలు రాజ్యం చేస్తున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ కులం, మతం ఓట్లే ప్రధాన ప్రాతిపదికగా ప్రచారం చేస్తున్నారు. పర్యటనలు తలపెడుతున్నారు. ఆయా కులాల ఓట్లను గంపగుత్తగా కొట్టేసేందుకు ప్రదక్షిణలకూ శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా షెడ్యూల్డు కులాలు, తెగలు , మైనారిటీల ఓట్లు అంటే పార్టీలకు బహుముచ్చట. చీలికల్లేకుండా ఏకమొత్తంగా వీరి ఓట్లు తమకే పడతాయనే ఆశతో వారిని రకరకాల ప్రలోభాలకు గురి చేస్తుంటారు. ఇందులో సహపంక్తి భోజనాలు ఒక పెద్ద ముచ్చటగా మారుతోంది. దళిత వాడలను సందర్శించి వారి ఇళ్లల్లో భోజనం చేయడం మరొక ప్రహసనం. చిత్తం దళితుల మీద, భక్తి ఓట్ల మీద అన్నట్లుగా తయారైంది నాయకుల తంతు.

కాంగ్రెసుదే మొదటి పాచిక...

దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ 15 నుంచి 25 శాతం వరకూ షెడ్యూల్డుకులాలు, తెగల ఓట్లు ఉన్నాయి. ఈశాన్యరాష్ట్రాల వంటి చోట్ల అయితే ఇది ఇంకా పెరుగుతోంది. మొదట్నుంచీ ఆయా వర్గాలను ఆకర్షించే లక్ష్యంతో కాంగ్రెసు అనేక పథకాలు చేపట్టింది. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి తగ్గుముఖం పట్టిన తర్వాత మద్యతరగతి, విద్యాధిక వర్గాలు కాంగ్రెసుకు దూరం కావడం మొదలైంది. దీంతో అధికార పరిరక్షణకు ఒక స్థిరమైన కొత్త ఓటు బ్యాంకును సృష్టించుకోవాల్సిన అవసరం కాంగ్రెసుకు ఏర్పడింది. ఇందిరాగాంధీ ఈ విషయంలో తనదైన శైలిలో చర్యలు తీసుకుంటూ వీరికోసం అనేక పథకాలు చేపట్టి ఇందిరమ్మగా వారి మనస్సుల్లో ముద్ర వేసుకున్నారు . శాశ్వతమైన ఓటు బ్యాంకుగా వారిని మలచుకున్నారు. కాన్సీరామ్ వంటివారు బహుజన సమాజ్ రూపంలో ప్రవేశించే వరకూ దళిత ఓటు బ్యాంకు విషయంలో కాంగ్రెసుకు తిరుగులేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత కాలక్రమంలో మార్పులు వచ్చినా రాష్ట్రాల వారీ గెలుపు అవకాశాలను బట్టి దళితులు వివిధ పార్టీలకు విధేయులుగా మారుతూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ బీఎస్పీ ప్రధాన పక్షంగా లేని అనేక రాష్ట్రాల్లో దళితులు కాంగ్రెసు పార్టీకే మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఈ ఓటు బ్యాంకును వివిధ రాష్ట్రాల్లో చీల్చడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ లో సోషల్ ఇంజినీరింగ్ పేరిట అక్కడ దళితుల్లోనే చీలిక తేగలిగింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి కి వ్యతిరేకంగా జాతవేతర దళితులు బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేసుకోగలిగింది. ఈ యత్నాన్ని ఇప్పుడు విస్తరించే చర్యలలో భాగంగా నాటకీయ కార్యక్రమాలకు తెర తీస్తోంది. మోహన్ భగవత్ ఇటువంటి విన్యాసాలనుద్దేశించే ఘాటైన విమర్శ చేశారు.

అమాయకత్వమే ఆసరా...

విద్య,ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో దయనీయమైన పరిస్థితుల్లో ఉండటంతో షెడ్యూల్డు కులాలు, తెగలు శతాబ్దాలుగా సామాజిక వెనకబాటు తనానికి గురయ్యాయి. ఇతర వర్గాలు అభివృద్ధి చెందిన రీతిలో వారిలో ముందడుగు పడలేదు. అమాయకత్వం ఇప్పటికీ ఆయా వర్గాల్లో తొంగి చూస్తోంది. అంతేకాకుండా తమకు మేలు చేస్తారని తెలిసినవారిని, మేలు చేసిన వారిని పూర్తిగా విశ్వసిస్తారు. శషభిషలు ఉండవు. రాజకీయ ప్రయోజనాలకోసం మచ్చిక చేసుకున్నప్పటికీ తమకు ఎంతోకొంత మంచి జరిగితే వారి వెన్నంటి ఉంటారు. ఇది బలమూ, బలహీనత కూడా. దీనిని ఆసరా చేసుకునే వారి ఓట్లను గంపగుత్తగా క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాయి పార్టీలు. ముఖ్యంగా ఓట్ల కొనుగోలుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలుచేస్తున్న పార్టీలు దళిత వర్గాలకు సొమ్ములు వెచ్చిస్తే కచ్చితంగా వారి ఓట్లు పడతాయనే భరోసాతో ఉంటాయి. అమాయకత్వము, మాటకు కట్టుబడి ఉండటమూ అనే లక్షణాల కారణంగా వారిని నమ్మకమైన ఓటు బ్యాంకులుగా భావిస్తూ ఆకట్టుకునేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ చాలాకాలంగా దూరంగా ఉంది. మోడీ, షా ల నాయకత్వం వచ్చిన తర్వాత దీనిపై పెద్ద కసరత్తు మొదలుపెట్టారు. దళితుల్లోనే చీలిక తేవడం, ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ఒక నాటకీయ పక్కీతో ప్రచారం పొందడం మొదలైంది. షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన వారి ఇళ్లకు వెళ్లి అక్కడే భోజనాలు చేయడమనే కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున చేపట్టేలా మోడీ, అమిత్ షా దిశానిర్దేశం చేశారు. అప్పట్నుంచి హడావిడి మొదలైంది.

మాటల తూటాలు...

మొక్కుబడిగా దళితుల ఇళ్లల్లో భోజనం చేసినంతమాత్రాన ఇదో పెద్ద సంస్కరణ కాదు. వారితో కలిసి నడవాలి.నిత్యం సంప్రతింపుల్లో ఉండాలి. వాళ్ల ఇళ్లకు వెళ్లడం కాదు. మీ ఇళ్లకు పిలిచి భోజనం పెట్టగలిగినపుడే మార్పు నకు సంకేతం అంటూ భగవత్ సీరియస్ గానే బీజేపీ నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ తామేదో గొప్ప కార్యం చేస్తున్నామని ఉప్పొంగిపోతున్న నాయకులకు ఈ మాటలు కనువిప్పు లాంటివి. అయినా 21 వ శతాబ్దంలో సైతం ఈ తేడాలను గురించి ఆలోచించాల్సి రావడం దురద్రుష్టకరం. ఏడెనిమిది వందల ఏళ్ల క్రితమే పల్నాడులో బ్రహ్మనాయుడు గుడిలోనే అందరికీ సహపంక్తి భోజనాలు పెట్టించారు. అంతటి సంస్కర్తలు పుట్టిన భారత గడ్డపై ఇంకా ఇలాంటి ప్రదర్శనా విన్యాసాలు ప్రహసనాలుగానే చెప్పుకోవాలి. ఓట్ల కోసం వెంపర్లాట మాని నిజంగానే దళితుల జీవితాల్లో వెలుగుపూలు పూయించేందుకు రాజకీయ పార్టీలు కార్యాచరణ మొదలుపెడితే ప్రయోజనం సమకూరుతుంది. సగటు మనిషి జీవితం మెరుగుపడితే ఓట్లు వాటంతటవే వస్తాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News