ప్లాన్ బి రెడీ చేశారా?

ఏపీ రాజకీయాల్లో తన బలాన్ని చాటాలని కమలకుతూహలం యమ జోరుగా ఉంది. ఏపీలో బీజేపీకి బలముందా అంటే లేదు అనే చెబుతారు ఎవరైనా. మరి ఎలా అధికారం [more]

Update: 2019-11-30 11:00 GMT

ఏపీ రాజకీయాల్లో తన బలాన్ని చాటాలని కమలకుతూహలం యమ జోరుగా ఉంది. ఏపీలో బీజేపీకి బలముందా అంటే లేదు అనే చెబుతారు ఎవరైనా. మరి ఎలా అధికారం సంపాదిస్తారు అంటే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి అందరినీ లాగేస్తారట. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఇప్పటికిపుడు ఏపీలో బీజేపీలో ఏ ఎమ్మెల్యే అయినా చేరాలనుకున్న వారికి లభించేది అధికారం కాదు, కేవలం ప్రతిపక్ష హోదా మాత్రమే. ఆ మాత్రం సౌభాగ్యానికి బీజేపీ పంచన చేరి బావుకున్నదేంటి. అంటే సమీప భవిష్యత్తులో అధికారంలోకి వస్తామని చెప్పగలగాలి. కానీ ఏపీలో బలంగా వైసీపీ ఉంది. యువ నాయకుడు జగన్ సీఎం గా ఉన్నారు. మరో వైపు టీడీపీకి సీట్లు తగ్గినా ఓట్లపరంగా చూస్తే వైసీపీ తరువాత స్థానంలో ఉంది. క్యాడర్ వరకూ ఆ పార్టీకి లోటు లేదు. ఎంతమంది లీడర్లు వెళ్ళిపోయినా మేము తయారుచేసుకోగలం, మాది నాయకులను తయారు చేసే కర్మాగారం అంటున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు. ఇక బీజేపీది అలా కాదు కదా రెడీ మేడ్ గా నేతలు రావడం కష్టమైతే క్యాడర్ ఎలా వస్తుంది. అందుకే కమలానికి ఆరాటం ఎక్కువ, అవకాశం తక్కువ అన్నట్లుగా ఏపీలో ఉంది.

పవన్ చేతులు కలిపినా….?

ఇక బీజేపీ దగ్గర ప్లాన్ బీ కూడా రెడీగా ఉంది. అదేంటి అంటే జనాకర్షణ కలిగిన నాయకులు ఆ పార్టీలో లేరు. పవన్ కళ్యాణ్ కి సినీ గ్లామర్ ఉంది. పైగా గోదావరి జిల్లాల్లో బలమైన కాపు సామాజికవర్గం ఉంది. దాంతో ఆయన్ని చేరదీయాలని కమలం పార్టీ అలోచిస్తోందని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్ అనుకోవడం వరకూ ఒకే కానీ ఆయనది కేవల సినిమా ఇమేజ్ మాత్రమే. అది రాజకీయంగా ఓట్ల రూపంలో టర్న్ అయ్యేది కాద‌ని సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం అయినపుడే చాలా వరకూ అర్ధమైంది. దానికి పవన్ కానీ బీజేపీ కానీ చెప్పే విశ్లేషణ ఏంటి అంటే పవన్ కి బీజేపీ లాంటి పార్టీ తోడు అయితే అద్భుతాలు జరుగుతాయి అని. కానీ బీజేపీది కూడా ఏపీలో దాదాపుగా జనసేన లాంటి కధే. అయితే బీజేపీకి మొదటి నుంచి అంటిపెట్టుకున్న కొంత వర్గం బలం ఉంది. ఇక హిందూ కార్డు తీయాలనుకున్నా ఏపీలాంటి చోట్ల అది అసలు సాధ్యమవదు. అందువల్ల పవన్, బీజేపీ కలిస్తే కొంతవరకూ బెటర్ గా ఉంటుందనుకున్నా అధికారం సాధించేడం అంటే అతి కష్టమైన విషయంగానె చెప్పాలి

టీడీపీ తోడు…

దీని మీద మరో చర్చ కూడా ముందుకువస్తోంది. పవన్, కమలం పార్టీలు కలసినా కుదరకపోతే ఎన్నికల వేళ టీడీపీని కూడా దోస్తీకి పిలిచి మరీ కూటమి కట్టడం. అయితే ఇది కొత్త ప్రయోగం ఏమీ కాదు. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేశాయి. అప్పట్లో మోడీ ఇమేజ్ ఆకాశమంత ఎత్తు ఉంది. చంద్రబాబు వంటి అనుభవశాలి విభజన వల్ల విడిపోయి ముక్కలైన ఏపీకి నాయకుడు అయితే బాగుంటుందని జనంలో కొంత భావన ఉంది. దాంతో వైసీపీని ఢీ కొట్టి అధికారంలోకి వచ్చాయి. అయినా సరే కేవలం అయిదు లక్షల ఓట్ల తేడా మాత్రమే వైసీపీకి, కూటమికి మధ్య ఉంది.

తాాజా ఎన్నికల్లో…..

ఇక 2019 ఎన్నికల్లో అన్ని పార్టీలు విడిగా పోటీ చేశాయి. కానీ ప్రతిపక్ష ఓట్లు చీలలేదు. జగన్ అధికారంలోకి బంపర్ మెజారిటీతో వచ్చారు. ఇక మరో వైపు చూసుంటే ఇపుడు జగన్ చేతిలో అధికారం ఉంది. ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు, అమరావతి విషయంలో క్లారిటీ ఇచ్చారు. పోలవరం పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఏపీలో అభివ్రుధ్ధిని అంతటా పంచాలనుకుంటున్నారు. ఇందులో ఏ కొన్ని పనులు జరిగినా కూడా జగన్ ని ఢీ కొట్టడం ఈసారి కూటమికి కష్టం కావచ్చునని విశ్లేషణలు మరో వైపు ఉన్నాయి. అయితే ఒంటరిగా బరిలోకి దిగడం కంటే కలసి కట్టుగా రావడంలో ఏమైనా ఫలితం ఉంటుందేమోనన్న ఆలోచనే బీజేపీతో కరచాలనానికి ఏపీలోని విపక్ష పార్టీలను ఆరాటపెడుతోందని అంటున్నారు.

Tags:    

Similar News