ఇద్దరూ..ఇద్దరే మధ్యలో కమలం

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ,… రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను శాసించాలనుకుంటున్న పార్టీ.. భిన్నవైఖరితో అమరావతిపై సందిగ్ధ చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది. చట్ట పరమైన, రాజ్యాంగ పరమైన అధికారాలు [more]

Update: 2020-01-01 05:00 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ,… రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను శాసించాలనుకుంటున్న పార్టీ.. భిన్నవైఖరితో అమరావతిపై సందిగ్ధ చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది. చట్ట పరమైన, రాజ్యాంగ పరమైన అధికారాలు వేరు. కేంద్రం రాజకీయ, నైతిక బాధ్యత వేరు. ఒకవేళ బీజేపీ అగ్రనాయకులు స్పష్టమైన వైఖరి, నిర్ణయం తీసుకుంటే రాష్ట్రప్రభుత్వానికి దిశానిర్దేశం చేయగల రనడంలో ఎటువంటి సందేహం లేదు. ఢిల్లీ కేంద్రంగా వ్యవహారాలు నడిపే జాతీయ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ రాష్ట్ర నాయకత్వానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నారు.

కమలంలో కస్సుబుస్సులు…

’రాజధాని అంగుళం కూడా కదలదు. కేంద్రం ఈవిషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదం‘టూ కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి అమరావతి రైతులకు స్పష్టమైన భరోసా ఇచ్చారు. ‘పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెబుతున్నాను. అమరావతి రాజధాని వ్యవహారం మాకు సంబంధించింది కాదు. అది రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోనిది. మా జోక్యం ఉండేందుకు అవకాశం లేదం’టూ మరో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తేల్చి చెప్పేశారు. దాంతో బీజేపీలోని శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. ఈ ఇద్దరూ కేంద్ర పెద్దలకు సన్నిహితంగా మెలుగుతుంటారు. ఎన్నికల సందర్భంలో పార్టీకి జీవీఎల్ అందించిన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యత్వంతో పాటు అధికారప్రతినిధి హోదానిచ్చింది. అదే విధంగా తెలుగుదేశం నుంచి వచ్చి బీజేపీలో చేరిన కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరిని పార్టీ ప్రత్యేక దృష్టితో చూస్తోంది. రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు ఆకర్షించే బాధ్యతను ఆయనకు అప్పగించినట్లుగా ప్రచారం సాగుతోంది. వీరిరువురూ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడంలో ప్రత్యేక వ్యూహం దాగి ఉందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ద్వంద్వ విధానం పార్టీకి దీర్ఘకాలంలో చెరుపు తెస్తుంది.

ఉప్పు నిప్పులు…

పునర్విభజన చట్టం అమలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంతర్గత అంశాలను హోంశాఖ పర్యవేక్షిస్తూ ఉంటుంది. సంబంధిత మంత్రి అమిత్ షా ను నేరుగా సంప్రతించి గడచిన 15 రోజులుగా రగులుతున్న అమరావతి అంశంపై స్పష్టత తీసుకునే వెసులుబాటు ఈ ఇద్దరికీ ఉంది. ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర బీజేపీ శాఖలో తొలి దశలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు రాష్ట్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని పార్టీలో ఏకాభిప్రాయాన్ని సాధించింది. కానీ ఈ ఇద్దరు నాయకులు పార్టీలో గందరగోళానికి మళ్లీ తెర తీస్తున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వయంగా అమరావతి రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఉండే రాజ్యసభ సభ్యులు ఈ విషయంలో అత్యంత చొరవ చూపడం వివాదానికి తావిస్తోంది. ఒకరు టీడీపీకి సన్నిహితంగా ఆ పార్టీ వైఖరినే సమర్థిస్తారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరొకరు వైసీపీ వైఖరిని సమర్థిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ద్వంద్వ విధానాలు…

ఒకే పార్టీలో ద్వంద్వ విధానాలకు ఈ ఇద్దరు నాయకులు ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉండటం జాతీయ పార్టీగా బీజేపీ ప్రతిష్ఠను మసకబారుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ , రాజధాని విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించగల సామర్థ్యం ఉన్నపార్టీలో ఇలా రెండు పోకడలు కనిపించడం గమనార్హం. హైకోర్టు తరలించాలన్నా, అధికారికంగా రాజధానిని నోటిఫై చేయాలన్నా కేంద్రం చొరవ అవసరం. అటువంటి కీలక పార్టీలో ద్వంద్వ పద్దతి ఎటువంటి సంకేతాలకు నిదర్శనం? రెండు రకాల అభిప్రాయాలను రాజ్యసభ సభ్యుల ద్వారా ప్రజల్లోకి పంపడం ఎంతమేరకు పార్టీకి, రాష్ట్రానికి శ్రేయస్కరం అన్న ప్రశ్నలు లెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాలతో నేరుగా సంబంధం లేని నేతలు తామే కేంద్రానికి, పార్టీకి ప్రతినిధులుగా ప్రవర్తిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ క్రమశిక్షణకు, విధానాలకు కూడా ఇది విరుద్దమే. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వంగా మనసులోని మాటను బయటపెట్టకపోయినా బీజేపీ ఒక పార్టీగా తన విధానం, నిర్ణయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రాంతీయ పార్టీలు ప్రాంతానికో విధానం, రోజుకో ప్రకటనతో గోడమీద పిల్లులుగా ఓట్ల రాజకీయం నడిపినా ఫర్వాలేదు కానీ జాతీయ సమగ్రత, ఇతర రాష్ట్రాలపై ప్రభావం పడకుండా ఉండాలంటే ఇప్పటికైనా బీజేపీ ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. ఇది రాజ్యాంగ బాధ్యత కాదు…రాజకీయ బాధ్యత.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News