ఏం రాజకీయం గురూ

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుతో రెండు రాష్ట్రాలకు జరిగిన అన్యాయాన్ని కేంద్రంలోని బిజెపి గుర్తించింది. దేశ అత్యున్నత సభల్లో పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న మోడీ సర్కార్ రెండు [more]

Update: 2019-08-06 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుతో రెండు రాష్ట్రాలకు జరిగిన అన్యాయాన్ని కేంద్రంలోని బిజెపి గుర్తించింది. దేశ అత్యున్నత సభల్లో పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న మోడీ సర్కార్ రెండు తెలుగు రాష్ట్రాలు విభజన ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలకు మాత్రం మొండి చేయి చూపిస్తుంది. ప్రధాని మోడీ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్ వరకు అంతా తలుపులు మూసి కెమెరాలు బంద్ చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ బిల్లు ను ఆమోదించిందనే అంశం లేవనెత్తుతున్నారు. అయితే బిల్లు ఆమోదంలో తమ మద్దతు కూడా ఆనాడు ఉందని తమ సహకారం దీనికి తోడైందన్న అంశాన్ని పక్కన పెట్టి హస్తం పార్టీ వ్యవహారాన్ని కడిగేస్తూ మీరలా చేసినప్పుడు మేమెలా చేస్తే తప్పేంటనే లాజిక్ ను కీలకమైన చర్చల్లో ప్రయోగిస్తూ విపక్షాన్ని ఇరుకున పెడుతున్నారు.

కాశ్మీర్ అంశం పై చర్చలోనూ …

కాశ్మీర్ లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 ఎ అధికరణలను కేంద్రప్రభుత్వం రద్దు చేస్తూ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యుడు మాజీ కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ అడుగడుగునా అడ్డు తగులుతుంటే అమిత్ షా కు చిర్రెత్తుకొచ్చింది. మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఎలా ప్రవేశపెట్టారో గుర్తు చేసుకోవాలని చురకలు అంటించారు. చత్తిస్ ఘడ్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాల విభజన సందర్భంగా బిజెపి ఎలా వ్యవహరించింది కాంగ్రెస్ ఎపి విభజన ఎంత దారుణంగా చేసింది అంటూ నాటి సంఘటనలు మరోసారి గుర్తు చేశారు. అయితే తాము అన్ని పార్టీలను సంప్రదించే విభజన బిల్లు ఆమోదించామంటూ గులాంనబీ సమర్ధించుకున్నా షా వాదన ముందు వీగిపోయారు. గతంలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలోనూ ప్రధాని మోడీ ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. తలుపులు మూసి, కెమెరాలు ఆపి కాంగ్రెస్ చేసిన నిర్వాకం దేశప్రజలంతా చూశారంటూ ఎదురుదాడి చేసి హస్తం పార్టీని కడిగేశారు. మరో మంత్రి రాజ్ నాధ్ ఇదే అంశంపై అటు పార్లమెంట్ ఇంటా బయట కాంగ్రెస్ తీరును విమర్శలు గుప్పిస్తూ చాలాకాలంగా వస్తున్నారు.

తప్పు జరిగిందని తెలిసినా సరిచేయరా ….?

దేశంలో అత్యున్నత చట్ట సభలో కౌరవ సభ మాదిరి అన్యాయం జరిగితే అది గుర్తించిన నాటి విపక్షం నేడు అధికారంలో వున్నా సరిచేసేందుకు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు. లోపాలు ఏమిటి ఎలా చేస్తే ఇరు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందో తెలిసినా తరువాత అధికారంలోకి వచ్చిన పాలకులు రాజకీయ అవసరాలకు ఆ అంశాన్ని వాడుకుంటున్నారు తప్ప ఇతరత్రా ప్రయోజనానికి సంకల్పించింది ఏది ? ఇది ఇప్పుడు సగటు తెలుగు రాష్ట్రాల వారిని వేధిస్తున్న ప్రశ్న. తల్లిని చంపి బిడ్డను కాపాడినట్లు గతంలో ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్ర మోడీ ఎపి, తెలంగాణలపై ఎంతో ప్రేమ వలకబోసి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమన్యాయం చేస్తామని చెప్పి మాటమరిచారు.

కర్రు కాల్చి వాత పెట్టినా …

ఇది గుర్తించే తెలుగు రాష్ట్రాల్లో జనం బిజెపి ని దూరం పెట్టారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే నోటా కన్నా తక్కువ ఓట్లతో కమలనాథులకు హెచ్చరికలు పంపారు. అయినా కానీ ఎపి వాసుల ఆగ్రహాన్ని మోడీ సర్కార్ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు సరికదా తాజా బడ్జెట్ లో సైతం మొండిచేయి చూపించి వెక్కిరించింది. మరోపక్క అన్ని పార్టీల్లో వారికి కాషాయ కండువా కప్పుతూ తాము బలపడుతున్నామని వచ్చే ఎన్నికల్లో తామే అధికారపార్టీతో పోరాడేది అంటూ బీరాలు పోతుంది. ఇదేమి వ్యూహంలో అర్ధం కాక ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క కాంగ్రెస్ చేసింది దగా అనే సర్టిఫికెట్ ఇస్తూ తాము నష్టపోయిన రాష్ట్రాలకు ఏమి చేయకుండా కమలం ఆడుతున్న ఆట తెలుగు రాష్ట్రాల్లో వింతగా విచిత్రంగా ఉండటం విశేషం.

Tags:    

Similar News