ముగ్గురూ ముంచేశారుగా?

ఉమ్మడి ఏపీని అడ్డంగా విడదీసి దాదాపుగా అరేళ్ళు కావస్తోంది. నాటి యూపీయేకి వత్తాసు పలికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల లిస్ట్ రాయించిన బీజేపీ గద్దెనెక్కింది. [more]

Update: 2019-11-24 02:00 GMT

ఉమ్మడి ఏపీని అడ్డంగా విడదీసి దాదాపుగా అరేళ్ళు కావస్తోంది. నాటి యూపీయేకి వత్తాసు పలికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల లిస్ట్ రాయించిన బీజేపీ గద్దెనెక్కింది. యూపీయే తాంబూలాలు ఇచ్చేసింది. ఇక ప్రధానిగా వచ్చిన మోడీకి యూపీయే హామీలు గుర్తు లేవు. గుర్తు చేయాల్సిన వారు బీజేపీలో మౌనం దాల్చారు. మరో వైపు మిత్ర ధర్మమో మరే కారణమో నాలుగేళ్ళ పాటు ఏపీలో చంద్రబాబు బీజేపీని ఏమీ అనలేదు. ఏది ఇచ్చిన్నా పుణ్యం అనుకున్నారు. చివరి ఏడాది ఎన్నికల స్టంట్ చేస్తే ఓడిపోయారు. దాంతో బీజేపీతో అనవసర వైరం పెట్టుకున్నానని చంద్రబాబు తెగ కుములుతున్నారు. మరో వైపు ప్రజల కోసం పాచిపోయిన లడ్డులు అంటూ ప్యాకేజి అనేసి కేంద్రం పెద్దలకు చెడ్డ అయిపోయానని జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ లాంగ్ మార్చ్ సాక్షిగా వాపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసిన జగన్ హోదా, విభజన హామీల గురించి గళమెత్తమని కోరారు. ఇదీ శీతకాల పార్లమెంట్ సమావేశాల ముందు ఏపీలో రాజకీయ ముఖ చిత్రం.

ఇంగ్లీష్ లొల్లి తప్ప….

దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ వాటికి తగినట్లుగా ప్రభుత్వాలు విద్యా విధానాలు మార్చుకుంటున్నాయి. ఏపీలోనూ అదే జరిగింది. ఆంగ్ల బోధన అవసరమని జగన్ సర్కార్ భావించి అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీని మీద అల్లరి చేస్తున్న టీడీపీ జనసేన అసలు సమస్యలు వదిలేసాయి. ఇక టీడీపీ ఎంపీలు ఇంగ్లీష్ విషయం పెద్ద సమస్య అయినట్లుగా పార్లమెంటులో గొంతెత్తి అరిచారు. మరో వైపు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఇపుడు తెలుగు భాష అంటూ కలవరిస్తోంది. మాతృ భాషకు ద్రోహం చేస్తున్నారు, తెలుగును మృత భాషగా మారుస్తున్నారని తెగ బాధపడుతున్నారు. మరి అదే చేత్తో ప్రత్యేక హోదా సంగతి ఏం చేశారు, విభజన హామీల కధ ఎంతవరకూ వచ్చిందని ప్రధాని మోడీకి కూడా ట్వీట్ చేస్తే బాగుండేది కదా అని జనం కోరుకుంటున్నారు. మరి పవన్ కేంద్రాన్ని ప్రశ్నిస్తారా, ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇపుడు ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాలని ఎందుకు అడగరని కూడా అంటున్నారు.

అనాధగా హామీలు…..

నిజమే మరి.. చెల్లిస్తేనే మాటకు విలువ. తీరిస్తేనే హామీలకు గౌరవం. ఎవరో చెప్పారు, మేమెందుకు చేయాలన్నది బీజేపీ పెద్దల ఆలోచన. పైగా ఇపుడు ఏపీలో వాతావరణం కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది. చంద్రబాబు ఎన్నికల ముందు ధర్మ పన్నాగాలు వల్లించారు. పోరాట దీక్షలు అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని గర్జించారు. కానీ ఇపుడు మాత్రం మౌనంగా ఉంటున్నారు. పవన్ ఎటూ బీజేపీ పట్ల సానుకూలంగా ఉంటున్నట్లుగా సంకేతాలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. హోదా అడిగితే ఏదో విషయంలో ఇరుకున పెడతారన్న బెంగ ఆయనకు కూడా ఉందేమో. మొత్తానికి ఏపీకి సంబంధించిన విభజన హామీలు అనాధలయ్యాయి. ఇతర రాష్ట్రాల వారు గట్టిగా గొంతెత్తి పార్లమెంట్ లో వారి హక్కుల కోసం నినదిస్తూంటే అన్నీ రకాలుగా మోసపోయి నిజమైన బాధిత రాష్ట్రంగా ఏపీ మిగిలి ఉంటే పట్టించుకునే నాధుడు లేడుగా.

Tags:    

Similar News