గడ్డం బ్యాచ్ ను దించాలంటే మరో తమిళనాడు కావాల్సిందే…?

తమిళనాడు రాష్ట్రం నుంచి చాలా విషయాలను ఏపీ ప్రజలే కాదు రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి. తమిళనాడు తమ కట్టు బొట్టు, కట్టుబాట్లకు ఎంతో గౌరవం ఇస్తుంది. [more]

Update: 2021-02-12 00:30 GMT

తమిళనాడు రాష్ట్రం నుంచి చాలా విషయాలను ఏపీ ప్రజలే కాదు రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాలి. తమిళనాడు తమ కట్టు బొట్టు, కట్టుబాట్లకు ఎంతో గౌరవం ఇస్తుంది. ఢిల్లీ వెళ్ళినా తమిళంలోనే అక్కడి నేతలు పార్లమెంట్ లో మాట్లాడుతారు. ఇక తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం ఎందాకైనా వెళ్ళిన సంగతీ తెలిసిందే. తమకు కేంద్రం నుంచి న్యాయంగా దక్కాల్సింది రాకపోతే ఆకాశం భూమిని ఏకం చేయగల శక్తి సామర్ధ్యం వారికి ఉన్నాయి. కానీ రాజకీయ కక్షలు కార్పణ్యాల విషయంలోనే వారిని ఆదర్శంగా తీసుకుంటున్న ఏపీ నేతలు అభివృద్ధి విషయంలో వారి పోరాట స్పూర్తిని మాత్రం కనీసమాత్రంగా కూడా పరిశీలించడంలేదు.

ఏడేళ్ళుగా అవమానం…

దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఏపీకి జరిగినా జరుగుతున్న అన్యాయం మాత్రం మరి దేనికీ లేదనే చెప్పాలి. అడ్డగోలు విభజన చేసి అయిదు కోట్ల మంది అంధ్రులు కోరుకోని విధంగా ముక్కలు చేశారు. ఇక అప్పుల కుప్పతో ఏర్పడిన ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు గాలికి కొట్టుకుపోయాయి. ఈ ఏడేళ్ళలోనూ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. కనీసం ఒక్కదాన్ని అయినా సవ్యంగా చేసి ఏపీ జనాలకు చూపించలేకపోయింది. ప్యాకేజీ పేరు చెప్పి ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కారు. ఇపుడు ప్యాకేజీ కూడా లేకుండా పోయింది. విశాఖ రైల్వే జోన్ ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా ఉంది. పోలవరం నిధుల విషయంలో ఎన్నో కొర్రీలు పెడుతూ వచ్చారు. మరి ఇన్ని చేసినా కూడా ఏపీలోని రాజకీయ పార్టీలకు మాత్రం తమ స్వార్ధమే ముఖ్యమైపోయింది అని జనం విమర్శిస్తున్నారు.

కలసి నడిస్తేనే…..

ఏపీలో రాజకీయమే బీజేపీ ప్రభుత్వం చేత ఇలా చేయిస్తోందని విశ్లేషణలు ఉన్నాయి. ఒక ప్రాంతీయ పార్టీని తమ చెంగున కట్టేసుకుని మిగిలిన రెండు ప్రాంతీయ పార్టీల మధ్య నిత్యం జరుగుతున్న కయ్యాలను కేంద్రం చోద్యంగా చూస్తోంది. ఆ విధంగా కేంద్రం తన బాధ్యతలను తప్పించుకుంటోంది. ఏపీ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా కేంద్రం నుంచి రాబట్టాల్సిన వాటి విషయంలోనైనా అధికార వైసీపీ విపక్ష టీడీపీ కలసి నడిస్తేనే తప్ప ఢిల్లీ పాలకులు దిగిరారు అన్నది అర్ధమవుతున్న సత్యం. కానీ ఈ రెండు పార్టీలు తమలో తాము కలహించుకుని కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా కాలం నెట్టుకువస్తున్నాయి.

ప్రజా ఉద్యమమేనా…?

ఏపీలో రాజకీయ పార్టీలకు సోయె లేకపోతే జనాల్లో నుంచే ఉద్యమం రావాలని కూడా మేధావులు అంటున్నారు. ఏపీ ప్రయోజనాలకు కేంద్రం పాతర వేస్తూ దేశంలో కనీసం ఒక రాష్ట్రమని కూడా కనికరం చూపించకుండా పోతోంది. ఇది ఇలాగే సాగితే ఏపీ నిండా మునిగిపోవడం ఖాయం. రాజకీయ పార్టీలు దారికి రాకపోతే ప్రజలే ఉద్యమించి ప్రత్యేక హొదాతో మొదలుపెట్టి అన్ని విభజన హామీల విషయంలో గళెమెత్తాల్సి ఉంది. ఈ విషయంలో తమిళనాడుని ఆదర్శంగా తీసుకుని ప్రజలు కదలాలి. లేకపోతే భావితరాలు మాట దేముడెరుగు ఇప్పటితరాలే దారుణంగా నష్టపోవడం ఖాయం.

Tags:    

Similar News