తిరుగులేదనుకుంటున్నా….!!!

బీహార్ దేశంలో వెనకబడిన రాష్ట్రంలో ఒకటి. పేదరికానికి మారుపేరుగా నిలిచింది. అయినప్పటికీ రాజకీయంగా అత్యంత కీలకమైంది. అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే దేశంలో నాలుగో అతిపెద్ద రాష్ట్రం. [more]

Update: 2019-06-08 16:30 GMT

బీహార్ దేశంలో వెనకబడిన రాష్ట్రంలో ఒకటి. పేదరికానికి మారుపేరుగా నిలిచింది. అయినప్పటికీ రాజకీయంగా అత్యంత కీలకమైంది. అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే దేశంలో నాలుగో అతిపెద్ద రాష్ట్రం. 400 స్థానాలతో యూపీ దేశంలో అతిపెద్ద రాష్ట్రం. 294 స్థానాలతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది. 288 స్థానాలతో మహారాష్ట్ర, 243 స్థానాలతో బీహార్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అందువల్ల సహజంగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని కలిగిస్తాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది అక్టోబరులో మహారాష్ట్ర, ఆఖరులో హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబరు, నవంబరులో అత్యంత కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. బీహార్ రాజకీయంగా చూస్తే అత్యంత బలమైన రాష్ట్రం.

గత శాసనసభ ఎన్నికల్లో…..

బీహార్ లో 2015 అక్టోబరు, నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆమేరకు వచ్చే ఏడాది అక్బోటరు నెలలో శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. సాధారణంగా చూస్తే ఏడాది కాలం ఉన్నందున పెద్దగా హడావిడి పడాల్సిన అవసరం లేదు. బీజేపీ, జనతాదళ్ యు, లోక్ జనశక్తి పార్టీ కూటమి ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మళ్లీ ఇదే కూటమి రంగంలోకి దిగనుంది. లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ కలసి పోటీ చేసే అవకాశముంది. వాస్తవానికి గత ఎన్నికల నాటికి ఇప్పటికీ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారింది. అప్పట్లో ఆర్జేడీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యు, కాంగ్రెస్ కలసి పోటీ చేసి ఘన విజయం సాధించాయి. 101 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ 80 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. 101 స్థానాల్లో పోటీ చేసిన జనతాదళ్ యు 71 స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. 41 స్థానాల్లో పోటీ చేసిన హస్తం పార్టీ 27 స్థానాలను సాధించింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన బీజేపీకి భంగపాటు ఎదురైంది. కేవలం 53 స్థానాలను సాధించి తృతీయ స్థానాలకు పరిమితమైంది. 40 స్థానాల్లో పోటీ చేసిన రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ కేవలం రెండు స్థానాలే సాధించింది. ఆర్జేడీ అత్యధిక స్థానాలను సాధించినప్పటికీ ఒప్పందంలో భాగంగా నితీష్ కుమార్ కే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. అనంతర కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నితీష్ కుమార్ బీజేపీ వైపు మొగ్గు చూపారు. అప్పటి వరకూ లాలూ పార్టీతో ఉన్న పొత్తును తెగదెంపులు చేసుకుని బీజేపీ పంచన చేరారు. పార్టీ మద్దతుతో ఇప్పటివరకూ ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చారు. ఈ నాలుగేళ్లలో రెండు పార్టీల మధ్య సయోధ్య కొనసాగింది.

లాలూ పార్టీకి చేదు అనుభవం….

తాజా సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య బంధం మరింత బలపడింది. రెండు పార్టీల కూటమి లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలకు గాను 39 స్థానాలను కూటమి ఖాతాలో పడ్డాయి. ఒకే ఒక స్థానం కిషన్ గంజ్ లో కాంగ్రెస్ గెలుపొందింది. ఒక్క బీజేపీనే 17 స్థానాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 16 స్థానాలతో జనతాదళ్ యు ద్వితీయ స్థానంలో నిలిచింది. రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జన్ శక్తి 6 స్థానాల్లో విజయం సాధించింది. గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్జేడీ చేదు అనుభవాలను చవిచూసింది. ఒక్క స్థానాన్ని కూడా గెలవలేదు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థిితి లేదు. అవినీతి కేసుల్లో లాలూ జైల్లో ఉండటం, కుటుంబ కలతలు, బీజేపీ, జనతాదళ్ యులు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో ఫలితాలు ఈ విధంగా వచ్చాయి. ఆర్జేడీకి కాంగ్రెస్ తప్ప మరోబలమైన మిత్రపక్షం లేదు. లాలూ కుమార్తె మీసా భారతి స్వయంగా పాటలీ పుత్ర నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. సీపీఐకి మంచి పట్టున్న బెగసురాయ్ స్థానంలో ఓటమి తప్పలేదు. ఢిల్లీలోని జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ ను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఓడించారు.

నిలువరించడం కష్టమే…..

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, జనతాదళ్ యు, ఎల్జీపీ కూటమిని ఎదుర్కొనడం కష్టమే. ప్రతిపక్షమైన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ అంతర్గత సమ్యలతో సతమతమవుతోంది. లాలూ కుమారుల మధ్య సయోధ్య కొరవడటం పెద్ద సమస్యగా మారింది. ముస్లింలు, యాదవుల మద్దతుతో మనుగడ సాగిస్తున్న పార్టీ ప్రస్తుతం అధికార కూటమిని ఎదుర్కొనే పరిస్థితి లేదు. వందేళ్ల చరిత్ర కలిగిన హస్తం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక అధికార కూటమిలో కూడా పరిస్థిితి అంత సవ్యంగా లేదు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో పదవులు పంపిణీపై విభేదాలొచ్చాయి. జనతాదళ్ యుకు ఒక్క మంత్రి పదవి ఇస్తామన్న ప్రతిపాదనతో ఆ పార్టీ తిరస్కరించింది. ఇది తమను అవమానించడంగానే ఆ పార్టీ భావించింది. పైకి అంతా సజావుగా ఉన్నట్లు చెబుతున్నప్పటికీ రెండు పార్టీల మధ్య లుకలుకలకు బీజం పడిందని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థిితిని చూస్తే బీజేపీ, జేడీయూ కూటమికి తిరుగులేదని చెప్పొచ్చు. ఏదైనా అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప దాని విజయాన్ని నిలువరించే శక్తి ఆర్జేడీకి లేదనడం అతిశయోక్తి కాదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News