ఇంతోటి దానికి అంత అవసరమా?

తెలంగాణ పార్టీ విషయంలో కేంద్ర నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక్కడ పార్టీ అధ్యక్షుడిని మార్చాలని భావించినా అందుకు అనువైన వాతావరణం లేదని గ్రహించింది. అందుకోసమే నేతల [more]

Update: 2020-02-25 18:29 GMT

తెలంగాణ పార్టీ విషయంలో కేంద్ర నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక్కడ పార్టీ అధ్యక్షుడిని మార్చాలని భావించినా అందుకు అనువైన వాతావరణం లేదని గ్రహించింది. అందుకోసమే నేతల అభిప్రాయాలను సేకరించింది. నిజానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను మారుస్తారన్న ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ఏపీ, తెలంగాణకు కొత్త అధ్యక్షులు వస్తారని చెప్పడంతో దీనికి మరింత ఊతమిచ్చినట్లయింది.

అధ్యక్షుడి ఎంపికపై…..

అయితే ఇప్పుడు అధ్యక్షుడి మార్పు పార్టీకి ఏ మేరకు కలసి వస్తుందన్న ఆలోచనలో అధిష్టానం పడింది. ఇప్పటికే పార్టీలో గ్రూపు విభేదాలున్నట్లు పార్టీ హైకమాండ్ గుర్తించింది. అధ్యక్ష మార్పు జరిగితే మరింతగా అవి పెరిగే అవకాశమున్నట్లు కూడా కేంద్ర నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. అందుకే అభిప్రాయ సేకరణ చేసి అధ్యక్షుడి పేరును ఖరారు చేయాలని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేసింది.

సభ్యుల అభిప్రాయాలను…..

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్, ఉపాధ్యక్షుడు జయంత్ జయ పాండేలు హైదరాబాద్ వచ్చి నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీ కాలం ముగియడంతో కొత్త వారిని నియమించాలా? లేక లక్ష్మణ్ నే కొనసాగించాలా? అన్న దానిపైనే ఎక్కువగా వీరు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నేతలను ఒక్కొక్కరిగా పిలిచి అభిప్రాయాలను సేకరించింది. కొత్త వారిని నియమిస్తే ఎవరి పేరైతే బాగుంటుంది? ఎవరైతే అందరినీ కలుపుకుని పోతారు? వంటి ప్రశ్నలకు నేతల నుంచి సమాధానాలను రాబట్టినట్లు తెలుస్తోంది.

ముగ్గురే బరిలో…..

వీరిద్దరూ మొత్తం 40 మంది సభ్యులను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో సహా వీరు అభిప్రాయాలను సేకరించారు. అయితే ఈ నలభై మందిలో ఆశ్చర్యకరంగా 12 మంది తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలను సేకరించిన సభ్యులు కేంద్ర నాయకత్వానికి నివేదిక అందించనున్నారు. అయితే ముగ్గురి పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ పేర్లు ఎక్కువ మంది నుంచి విన్పించినట్లు చెబుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం లక్ష్మణ్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Tags:    

Similar News