క్రమంగా పట్టు బిగిస్తున్నారే?

బీహార్ ఎన్నికల సమరం ముగియడంతో భాజపా ఇప్పుడు తూర్పు రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ పై దృష్టి సారించింది. వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో [more]

Update: 2020-11-25 16:30 GMT

బీహార్ ఎన్నికల సమరం ముగియడంతో భాజపా ఇప్పుడు తూర్పు రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ పై దృష్టి సారించింది. వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న రాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో విజయ సాధనకు అవసరమైన వ్యూహరచనలో పార్టీ నిమగ్నమైంది. కోల్ కతా రైటర్స్ బిల్డింగ్ (సచివాలయం)లో పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. వచ్చే ఏడాది బెంగాల్ తోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఒక్క అసోం లోనే పార్టీ అధికారంలో ఉంది. జాతీయ పౌర పట్టిక గొడవల నేపథ్యంలో అసోం లో మళ్లీ కమలం పార్టీ పాగా వేయడం కష్టమే. ఇక బెంగాల్ పైనే ఆశలు ఉన్నాయి. మిగతా చోట్ల విజయావకాశాలు శూన్యం.

ఒక్కో రాష్ట్రాన్ని……

మోదీ 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వరసగా ఒక్కో రాష్రాన్ని కమలం ఖాతాలో వేసుకుంటూ వచ్చారు. 2014 కన్నా 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ పాత హవాను కొనసాగించలేక పోతున్నారు. 2019 తరవాత జరిగిన మహారాష్ర, దిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఒక్క హర్యానాలో మాత్రం చావుతప్పి కన్నులొట్టబోయిన చందం మాదిరిగా జన జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా మద్దతుతో సర్కారును ఏర్పాటు చేసింది. ఈ పూర్వరంగంలో బెంగాల్లో పాగా వేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది.

ప్రచారం ప్రారంభమయింది……

ఇందులో భాగంగానే ప్రచార శంఖాన్ని పూరించింది. దసరా ఉత్సవాల సందర్భంగా రంగప్రవేశం చేసింది. ప్రధాని మోదీ దిల్లీ నుంచి నేరుగా ఆన్ లైన్ ద్వారా కోల్ కతాలో శరన్నవ రాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. మోదీ ప్రసంగాన్ని వినేందుకు కార్యకర్తలు టీవీలు, ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. 78వేల బూత్ ల్లో మోదీ ప్రసంగం ప్రసారమైంది. ఇది అంకురార్పణ మాత్రమే. మున్ముందు మరిన్ని కార్యక్రమాలతో వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కమలం దూకుడుకు కారణం లేకపోలేదు. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్లోని మొత్తం 42 స్థానాలకు 18 స్థానాలను చేజిక్కించుకుని మమత బెనర్జీకి ముచ్చెమటలు పట్టించింది. 2014లో కేవలం రెండు సీట్లకు పరిమితమైన పార్టీ 18 స్థాలనకు ఎదగడంతో ఎక్కడలేని ధీమా వచ్చింది. బీజేపీకి సీట్లు పెరగడంతో పాటు ఒకప్పుడు మూడు పదులకు పైగా సీట్లను గెలుచుకున్న మమత పార్టీ గత ఎన్నికల్లో 22, కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమయ్యాయి. దీంతో మమతను ఇంటిదారి పట్టించడానికి ఇంతకు మించిన అవకాశం ఉండదన్నది కమలం పార్టీ భావన.

వ్యూహాలు మారుతున్నాయి…..

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, సీపీఎం ముస్లిములు, హిందూయేతరుల ఓట్లపై ఆధారపడ్డాయి. మమత ఓటుబ్యాంకు కూడా ఈ వర్గాలే. దీంతో గంపగుత్తగా హిందువుల ఓట్లు తమకు వస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది. బంగ్లాదేశ్ వలసదారులు సహజంగానే బీజేపీకి వ్యతిరేకం. బెంగాల్లో ముస్లిములు కూడా గణనీయంగానే ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ 221, కాంగ్రెస్ 24, సీపీఎం 20, బీజేపీ 16 గెలుచుకున్నాయి. లోక్ సభ ఎన్నికల ప్రతిపదికగా చూస్తే అధికారానికి చేరువలో ఉండగలమన్నది కమలం అంచనా. అందుకే అంతగా హడావిడి చేస్తోంది. ముఖ్యమంత్రి మమతకూడా మౌనంగా ఏమీ లేరు. కమలాన్ని కట్టడి చేసేందుకు పావులు కదిపారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ కోసం పోరాటం చేస్తున్న గూర్ఖా జనముక్తి మోర్చా అధినేత బిమల్ గురుంగ్ ను తన వైపునకు తిప్పుకున్నారు. ఇప్పటివరకు ఆయన కమలం నీడలో ఉన్నారు. ప్రత్యేక రాష్ర ఏర్పాటును బీజేపీ విస్మరించడంతో మమతకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. కేసుల కారణంగా మూడేళ్లుగా కనురుగైన గురుంగ్ హఠాత్తుగా ప్రత్యక్షమై మమత గెలుపు ధ్యేయంగా పని చేస్తానని చెప్పడం విశేషం. ఉత్తర బెంగాల్ లోని డార్జిలింగ్ కొండప్రాంతాల్లో ఆయనకు పట్టుంది. అయినప్పటికీ కమలం వెనక్కు తగ్గడం లేదు. తనదైన పంథాలో ముందుకు సాగుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News