బీజేపీ యాగీ… కారణమిదేగా?

భారతీయ జనతా పార్టీకి జగడాల పార్టీ అని ముద్దు పేరు కూడా ఉంది. గుడులూ గోపురాల పేరు మీద గొడవలు పెట్టే పార్టీగా ప్రత్యర్ధులు ఆడిపోసుకుంటారు. ఇక [more]

Update: 2020-10-29 09:30 GMT

భారతీయ జనతా పార్టీకి జగడాల పార్టీ అని ముద్దు పేరు కూడా ఉంది. గుడులూ గోపురాల పేరు మీద గొడవలు పెట్టే పార్టీగా ప్రత్యర్ధులు ఆడిపోసుకుంటారు. ఇక పెద్ద గొంతు చేసుకుని రెచ్చిపోవడంలో బీజేపీ తరువాతే ఎవరైనా. ఆ మధ్యన ఏపీలో జగన్ ప్రభుత్వం మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయాలన్న ఆరాటంలో బీజేపీ నేతలు చేసిన రగడ అంతా ఇంతా కాదు. ఇక బీజేపీకి తెలంగాణాలో అంతో ఇంతో ఉనికి ఉంది. దానికి మించి ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ డిసెంబర్ కి రెండవ టెర్మ్ రెండేళ్ళు పూర్తి చేసుకోనున్న కేసీఆర్ సర్కార్ మీద జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని బీజేపీకి గట్టి ఫీలింగ్ వచ్చినట్లుంది. దాంతో దుబ్బాక ఉప ఎన్నిక వేళ రచ్చ రచ్చ చేస్తోందంటున్నారు.

అక్కడ బలముందా…?

దుబ్బాక ఉప ఎన్నిక ఏ పరిస్థితుల్లో వచ్చిందో తెలుసుకుంటే బీజేపీ యాగీకి అర్ధం ఎంత ఉందో తెలుస్తుంది. రామలింగారెడ్డి దుబ్బాక టీయారెస్ సిటింగ్ ఎమ్మెల్యే. ఆయన బలమైన నాయకుడు. పైగా కేసీఆర్, కేటీయార్ ఇమేజ్, హరీష్ రావు చాణక్యం అన్నీ కలసి చాలా సులువుగా దుబ్బాకను అధికార పార్టీ గెలుచుకుంటుంది. ఒకవేళ గెలుచుకోకపోతే ఇక కేసీఆర్ సర్కార్ రాజీనామా చేయడమే ఉత్తమం. అధికారంలో ఉండి పూర్తి అనుకూలమైన చోట ఉప ఎన్నిక టీయారెస్ గెలవదు అని బీజేపీ అయినా ఎందుకు అనుకుంటుంది. ఇక్కడే ఆ పార్టీ రాజకీయ వ్యూహం ఉంది.

హడావుడి చేస్తేనే…..

దుబ్బాకలో పోటీలో ఉన్నబీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఒకప్పుడు టీయారెస్ లో ఉన్న నాయకుడే. కేసీఆర్ తో ఉద్యమ వేళ భుజం కలిపిన వారే. నాడు కేసీఆర్ రె పల్లెత్తు మాట అంటే టీవీ డిబేట్లలో అవతల వారి మీద పడి గొడవ చేసేవారు. స్వతహాగా న్యాయవాది. లాజిక్కులు మాటల మ్యాజిక్కులు టీయారెస్ నుంచి నేర్చుకున్న నేత. ఆయన ఇపుడు బీజేపీకి దొరికారు. దాంతో అగ్నికి వాయువు తోడు అయినట్లుగా కధ అక్కడ నడిపిస్తున్నారు. బీజేపీకి ఒక్కసారిగా బలం పెరిగిపోయిందని, టీయారెస్ కి పూర్తి వ్యతిరేకత వచ్చిందని కూడా కలరింగ్ ఇస్తున్నారు. మరో మూడేళ్ళకు పైగా అధికారం టీయారెస్ చేతిలో ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేని గెలిపించుకునే ఓటర్లు అక్కడ ఉంటారా అన్న చిన్న లాజిక్ కూడా మిస్ అయి ప్రచార పటాటోపానికి తెర తీసింది బీజేపీ.

అదే ఎత్తుగడ….

దుబ్బాకలో టీయారెస్ విజయం ఖాయం. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ ఆ విజయం జన విజయం కాదని, అధికారం తెచ్చిన గెలుపు బలుపు అని చెప్పాలన్నదే బీజేపీ ఎత్తుగడ. అందుకే ఏకంగా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ నుంచి అంతా ఒక్కటిగా చేరి వీర గర్జనలే చేస్తున్నారు అంటున్నారు. మరో పార్టీ కాంగ్రెస్ కూడా దుబ్బాకలో ఉంది. ఆ పార్టీకి బీజేపీ కంటే కూడా బలం ఉంది. కానీ తెలంగాణాలో బోలెడు మంది లీడర్లు దానికి ఉంటే ఢిల్లీ డైరెక్షన్ అసలు లేదు. దాంతో అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయలేని స్థితిలో ఆ పార్టీ ఉండిపోతోంది. దాంతో బీజేపీ ఇపుడు యాగీ మొదలెట్టింది. ఇలా గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాక భారీ మెజారిటీతో టీయరెస్ కి దుబ్బాక చేతిలో పడినా మనశ్శాంతి ఉంటుందా అన్నదే ఇక్కడ ప్రశ్న. అలా టీయారెస్ విజయాన్ని అనుమానస్పదంగా జనంలో చేయాలన్న మాస్టర్ ప్లాన్ ని మాత్రం సక్సెస్ ఫుల్ గా బీజేపీ అమలుచేస్తోంది. అదే మరి కాషాయం పార్టీ అంటే.

Tags:    

Similar News