ఊ.. అంటే పొత్తుకు రెడీ అయిపోవడమే

తెలంగాణలో మళ్లీ ఈసారి ఎన్నికలకు అనేక మార్పులు రాజకీయంగా చోటు చేసుకుంటాయంటున్నారు. బీజేపీ ఈసారి ఎన్నికలకు ప్రత్యేక వ్యూహంలో వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ ను [more]

Update: 2020-09-18 11:00 GMT

తెలంగాణలో మళ్లీ ఈసారి ఎన్నికలకు అనేక మార్పులు రాజకీయంగా చోటు చేసుకుంటాయంటున్నారు. బీజేపీ ఈసారి ఎన్నికలకు ప్రత్యేక వ్యూహంలో వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ ను పక్కకు నెట్టి తాను రెండో స్థానంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అయితే అది సాధ్యం కావడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉండటంతో దాన్ని తమ వైపునకు తిప్పుకునే అవకాశాలు కన్పించడం లేదు.

జనసేనతో పొత్తుతో….

దీంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో కూడా జనసేన కు క్యాడర్ ఉండటం, పవన్ కల్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉండటంతో జనసేనతో ఇక్కడ కూడా కలసి వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పవన్ కల్యాణ‌్ తో సమావేశమయ్యారు. మరోసారి కలవాలని బండి సంజయ్ భావిస్తున్నారు. జనసేనకు కొన్ని ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉండటం కలసి వచ్చే అవకాశమని బీజేపీ భావిస్తుంది.

తెలంగాణలో టీడీపీతో…..

ఇక ఆంధ్రప్రదేశ్ లో కాకపోయినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగా భావిస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన క్యాడర్ పాటు అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఓటు బ్యాంకు ఉండటంతో టీడీపీతో పొత్తుకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు గరికపాటి మోహనరావుతో బండి సంజయ్ టీడీపీతో పొత్తుపై ముచ్చటించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర నాయకత్వం మాత్రం…..

అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు మాత్రం అక్కడ టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 2018 ఎన్నికలకు ముందు అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తాము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు. దీన్ని బట్టి కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తుకు అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారు. చంద్రబాబు కూడా పొత్తుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేసి కనీసం రెండో స్థానంలోకి రావాలని తెలంగాణ బీజేపీ ప్రయత్నిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News