Bjp : ఇక చేరికలపైనే.. ఆ పార్టీని దెబ్బతీసేందుకు?

తెలంగాణలో మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పటి నుంచే తెలంగాణలో ఎన్నికల వేడి అలుముకుంది. ఇక చేరికలపై [more]

Update: 2021-09-25 09:30 GMT

తెలంగాణలో మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పటి నుంచే తెలంగాణలో ఎన్నికల వేడి అలుముకుంది. ఇక చేరికలపై ప్రధానంగా అన్ని పార్టీలూ దృష్టి సారించాయి. ప్రత్యర్థి పార్టీలు బలహీనం చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెట్టాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 119 నియోజకవర్గాల్లో బలోపేతం కావాలంటే చేరికలు ఉండాలని భావిస్తుంది.

షా హితబోధతో….

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా చేరికలపై దృష్టి సారించాలని పార్టీ నేతలకు హితబోధ చేసినట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థుల ఎంపిక ఇప్పటి నుంచే జరగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాలుగా బలమున్న నేతలను, సామాజికవర్గాల వారీగా గుర్తించి వారిని పార్టీలో చేరేలా ప్రోత్సహించాలని బీజేపీ నేతలకు అమిత్ షా సూచించారు.

70 నియోజకవర్గాల్లో….

119 నియోజకవర్గాలలో బీజేపీకి బలమైన నేతలు లేరు. దాదాపు 70 నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉన్నట్లు పార్టీ గుర్తించింది. గత ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. 119 నియోజకవర్గాల్లో గత శాసనసభ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక స్థానం నుంచి బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకోవడంతో కొంత పట్టు సాధించుకుంది.

రెండు నెలల్లో…

ఇప్పుడు బలహీనమైన నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో బీజేపీ నేతలు నాయకత్వం కోసం అన్వేషణ సాగిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహిస్తే ఆ పార్టీ మరింత బలహీనమవుతుందని భావిస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. బండి సంజయ్ పాదయాత్ర పూర్తయిన అనంతరం చేరికల కార్యక్రమం ఎక్కువగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News