ఏపీ బీజేపీ నేత‌లు చేతులెత్తేశారు… వారు మాత్రం పిడికిలి బిగించారు

రాజ‌కీయ ప్రయోజ‌నాల సుడిలో ఏపీ బీజేపీ నేత‌లు ఇరుక్కుపోయారా ? రాష్ట్ర ప్రజ‌ల ప్రయోజ‌నాల క‌న్నా ..కూడా త‌మ‌కు రాజ‌కీయ‌ప్రయోజ‌నాలే కీల‌క‌మా ? అనే వ్యాఖ్యలు ఇప్పుడు [more]

Update: 2020-05-23 00:30 GMT

రాజ‌కీయ ప్రయోజ‌నాల సుడిలో ఏపీ బీజేపీ నేత‌లు ఇరుక్కుపోయారా ? రాష్ట్ర ప్రజ‌ల ప్రయోజ‌నాల క‌న్నా ..కూడా త‌మ‌కు రాజ‌కీయ‌ప్రయోజ‌నాలే కీల‌క‌మా ? అనే వ్యాఖ్యలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచ‌డం అనే విష‌యం రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇది రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీల విష‌య‌మే కాదు.. రెండు రాష్ట్రాల్లోని రైతుల ప్రయోజ‌నాల‌కు సంబంధించిన విష‌యం. ఈ విష‌యంలో ఏ రాష్ట్ర ప్రయోజ‌నాలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి. ఏపీలో పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచ‌డం ద్వారా సీమ జిల్లాలు స‌స్యశ్యామ‌ల‌మై..రైతుల క‌ళ్లలో క‌న్నీరు ఇంకి.. ప‌సిడి పండుతుంది.

తెలంగాణ బీజేపీ…

అదే స‌మ‌యంలో తెలంగాణలో కొంత మేర‌కు రైతుల‌కు ఇబ్బంది ఏర్పడే అవ‌కాశం ఉంద‌ని అక్కడి నిపుణులు చెబుతున్నారు. దీంతో అక్కడి విప‌క్షం ప్రధానంగా బీజేపీ నేత‌లు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ క‌న్నా కూడా బీజేపీ నేత‌లు ఈ విష‌యంలో ఎక్కువ‌గానే స్పందిస్తున్నారు. చివ‌ర‌కు బీజేపీ విమ‌ర్శల‌తో ఏం చేయాలో తెలియ‌క డైల‌మాలో ప‌డ్డ టీఆర్ఎస్ మంత్రులు సైతం మీకు ద‌మ్ముంటే కేంద్రం ద్వారా దీనిని అడ్డుకోవాల‌ని స‌వాళ్లు రువ్విస్తోంది. చివ‌ర‌కు టీ బీజేపీ నేతలు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి షెకావ‌త్‌కు ఫిర్యాదులు చేశారు.

జగన్ కు మద్దతేదీ?

ఏపీని నిలువ‌రించాల‌ని, పోతిరెడ్డిపాడును అడ్డుకోవాల‌ని కోరుతున్నారు. దీనికి ఆయ‌న సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే ఏపీని నిలువ‌రించేలా ఆదేశాలు ఇస్తాన‌ని కూడా చెప్పారు. మ‌రి అదే బీజేపీకి చెందిన ఏపీ నేత‌లు.. మ‌రి ఈ విష‌యంలో ఏం చేస్తున్నారు? అనేది కీల‌క ప్రశ్న. తెలంగాణ బీజేపీ నేత‌లు పార్టీతో సంబంధం లేకుండా అక్కడి కేసీఆర్‌ ప్రభుత్వానికి అండ‌గా నిలిచారు. కానీ, ఏపీలో మాత్రం బీజేపీ నేత‌లు పోతిరెడ్డిపాడును స‌మ‌ర్ధించ‌డంలో కానీ, జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయానికి జై కొట్టడంలో కానీ, రాజ‌కీయాల‌కు అతీతంగా వ్యవ‌హ‌రించ‌లేక పోతున్నారు.

కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయకుండా…?

కేవ‌లం రాజ‌కీయాలే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగుతున్నార‌నే వాద‌న ప్రబ‌లంగా వినిపిస్తోంది. పోతిరెడ్డిపాడు విష‌యంలో కేంద్ర మంత్రికి తెలంగాణ నేత‌లు.. ఫిర్యాదులు చేసిన స‌మ‌యంలోనే ఏపీ నేత‌లు కూడా ఆయ‌న‌ను క‌లిసి.. ఇక్కడి స‌మ‌స్యలు వివ‌రించి ఉండాల్సింది. కానీ, ఏపీ బీజేపీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాత్రం.. నువ్వేం చేస్తావో తెలియ‌దు.. సీమకు మాత్రం నీళ్లివ్వు..! అంటూ.. జ‌గ‌న్‌పై రాజ‌కీయంగా వ్యాఖ్యలు చేస్తున్నాడే త‌ప్ప.. కేంద్రంతో ముడిప‌డిన ఈ వ్యవ‌హారంలో జోక్యం చేసుకునేందుకు ఎక్కడా ఆస‌క్తి చూపించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ కీల‌క అంశంలో అన్ని పార్టీలు రెండు రాష్ట్రాల‌కు వేర్వేరుగా స్పందిస్తున్నా ఏపీ బీజేపీ మాత్రం చీమ కుట్టిన‌ట్టుగా కూడా లేకుండా వ్యవ‌హ‌రిస్తోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ అంటేనే జ‌నాలు పార్టీ పేరు కూడా గుర్తుంచుకునే ప‌రిస్థితి… ఇక ఆ పార్టీ మ‌రి ఏ స్థాయికి ప‌డిపోతుందో ? ఊహించ‌ని ప‌రిస్థితి.

Tags:    

Similar News