ఇక బీజేపీ వంతు...!!

Update: 2018-10-25 16:30 GMT

తానెప్పుడూ ఒంటరే. అప్పుడప్పుడు కొందరు కలుస్తుంటారు. అవసరం తీరిపోయాక వెళ్లిపోతుంటారు. తెలంగాణలో బీజేపీ ప్రస్తుత పరిస్థితి ఇదే. 1997లోనే ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో రాష్ట్రవిభజనకు ఎలుగెత్తిన బీజేపీ ఇంతవరకూ ఇక్కడ పట్టు సాధించలేకపోయింది. వాజపేయి నాయకత్వ ఆకర్షణతో పట్టు సాధిస్తున్న తరుణంలో 1999లో తెలుగుదేశంతో చేతులు కలిపింది. 2004లోనూ దానితోనే కలిసి నడిచింది. సైద్ధాంతిక పునాదిని, సొంతబలాన్నికోల్పోయింది. స్వతంత్రంగా తనను తాను నిరూపించుకునే అపురూప అవకాశాన్ని కోల్పోయింది. 2009లో టీడీపీ దూరం పెట్టేసింది. కమలానికి ఒంటరి పయనం తప్పలేదు. 2014 నాటికి మళ్లీ తెలుగుదేశం స్నేహహస్తం చాచింది. సరే అంటూ బీజేపీ చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా నరేంద్రమోడీకి సానుకూల ఓటింగు ఉన్న పరిస్థితుల్లో దానిని పార్టీకి పెట్టుబడిగా మార్చుకోవడంలో విఫలమైంది. టీడీపీకి తోడి పెళ్లి కూతురు పాత్రకు పరిమితమైపోయింది. రాష్ట్ర నాయకులు ఒంటరిగా వెళ్లాలని సూచించినప్పటికీ అధిష్టానం పడనివ్వలేదు. ఇప్పుడు మళ్లీ టీడీపీ లేదు. సొంతంగా వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. కానీ గడచిన పదిహేనేళ్లలో తన బలాన్ని చాలావరకూ కోల్పోయింది. ఇప్పుడు అటో ఇటో తేల్చుకోవాల్సిన తరుణంలో ఎన్నికల రణరంగంలోకి దిగుతోంది.

కారుతో డేంజర్...

భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రసమితి మధ్య అనధికార అవగాహన కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి అధిష్టానం స్థాయిలో ఏంజరుగుతోందన్న విషయంపై రాష్ట్రస్థాయి నాయకత్వానికి సరైన సమాచారం లేదు. కేసీఆర్ రెండునెలల వ్యవధిలో మూడుసార్లు ప్రధానిని కలవడం వాస్తవం. చివరిగా ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత అసెంబ్లీ రద్దుకు సంబంధించి పరిణామాలు వేగం పుంజుకున్నదీ నిజమే. కేంద్రప్రభుత్వం నుంచి ముందస్తు ఎన్నికలకు భరోసా లభించిన తర్వాతనే కేసీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారనేది రాజకీయ వర్గాల అంచనా. లోక్ సభతోపాటే అసెంబ్లీకి ఎన్నికలకు వెళితే జాతీయంగా చోటు చేసుకునే పరిణామాలతో టీఆర్ఎస్ ఇబ్బంది పడవచ్చనేది కేసీఆర్ అంచనా. అవసరమైతే బీజేపీకి భవిష్యత్తులో సహకరిస్తాననే హామీతో ఈ ముందస్తు ఎన్నికలకు సాంకేతికంగా అవసరమైన మాట సాయాన్ని పొందగలిగారనేది రాజకీయ వర్గాల భావన. పైకి చూస్తే ఇదంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ప్రజల్లోకి ఈరెండు పార్టీలు సహకరించుకుంటున్నాయన్న సమాచారం వెళితే మైనారిటీ వర్గాల పరంగా టీఆర్ఎస్ కు చేటు వాటిల్లుతుంది. హిందూ వర్గాలు సంఘటితం కాకుండా బీజేపీకి నష్టం తప్పదు. అందువల్ల టీఆర్ఎస్ తో చెలిమి చేటు తెస్తుందనేది స్థానిక కమలనాథుల వాదన.

బలం ఉన్నట్టా..? లేనట్టా?...

నిజంగానే భారతీయ జనతాపార్టీ సంశయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణలో మతపరమైన సమీకరణకు ఆస్కారం ఉంది. గతంలో ఉన్న చారిత్రక పరిణామాలు అందుకు వీలు కల్పిస్తాయి. అయితే వామపక్ష భావజాలం బలంగా ఉండటంతో అనేక జిల్లాల్లో బీజేపీ బలపడలేకపోయింది. సంప్రదాయ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీలే హవా చెలాయించాయి. ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో వామపక్షాలు సైతం రాజకీయంగా సీట్లు తెచ్చుకుంటూ ఉండేవి. హైదరాబాదు జిల్లా పరిధిలోనే బీజేపీకి బలం ఉండేది. మతపరంగా కొంతమేరకు భావోద్వేగాలు కనిపించే నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ప్రభావం ఉండేది. వామపక్షాలు బలహీనపడుతూ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం వ్యాప్తి చెందింది. టీఆర్ఎస్ సహజంగానే ఆ భావనకు ప్రతీకగా ఎదుగుతూ వచ్చింది. మతపరమైన సమీకరణకు బీజేపీకి చాన్సు లేకుండా పోయింది. రాష్ట్రవిభజన తర్వాత తొలిసారిగా సొంతంగా తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకంగా భావోద్వేగాలు లేవు. కేసీఆర్ సైతం యజ్ణాలు, యాగాలు చేయడంలో దిట్ట. మత పరమైన సంప్రదాయాలు పాటిస్తారు. అందువల్ల ఆయనపట్ల ప్రత్యేకంగా హిందూ వర్గాల ఓటర్లలో వ్యతిరేకత లేదు. హిందూ ఓటు బ్యాంకు పోలరైజేషన్ అవకాశాలు అంతంతమాత్రంగా కనిపిస్తున్నాయి. అందుకే బలాన్ని నిరూపించుకోగలమా? లేదా? అన్న అనుమానాలు బీజేపీని వెన్నాడుతున్నాయి.

ద్వయంపైనే భారం...

తెలంగాణలో బీజేపీ బలపడితే దక్షిణాదిన పట్టుచిక్కించుకోవచ్చని చాలాకాలంగా బీజేపీ ఎదురుచూస్తోంది. నిజానికి కర్ణాటక కంటే ముందుగానే తెలంగాణలో బీజేపీ బలపడుతుందని భావించారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్నప్పుడు తెలంగాణలో విడిగా బలపడటం కమలం పార్టీకి సాధ్యపడలేదు. చిన్నరాష్ట్రాల నినాదం బీజేపీదే. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయంగా పరిస్థితులను అనుకూలంగా మలచుకోవచ్చని బీజేపీ నాయకులు భావించారు. కానీ బలమైన ప్రాంతీయపార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. రాష్ట్ర విభజనలో ప్రధానపాత్ర పోషించిన కాంగ్రెసు సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమై పోయింది. తెలుగుదేశం వంటి పార్టీలు ప్రాబల్యం కోల్పోయాయి. బీజేపీకి ఏరకంగానూ బలపడే చాన్సులు కనిపించడం లేదు. భారీ సంఖ్యలో కాంగ్రెసు, టీడీపీ, టీఆర్ఎస్ నాయకులను ఆకర్షించి బలపడాలనే ప్రయత్నాలూ చేశారు. కేంద్రం దన్ను ఉన్నప్పటికీ పార్టీ పుంజుకోలేదు. టీఆర్ఎస్ తో పరోక్ష మైత్రి నెరపడం ద్వారా కొన్ని స్థానాలు గెలిచి అసెంబ్లీలో ఉనికిని చాటుకోవాల్సిన దురవస్థ. ఇదంత గౌరవప్రదమైన డీల్ కాదు. టీఆర్ఎస్ తో సంబంధం లేకుండా కొన్ని స్థానాల్లో అయినా సొంతబలాన్ని చాటుకోవాలనేది ఉద్దేశం. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాల ఇమేజ్ ను ఆధారం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కమలం అదృష్టం వీరిద్దరి ప్రచారంపైనే ఆధారపడి ఉంది. రాష్ట్రంలో ఎనిమిది సభలను ఏర్పాటు చేసేందుకు బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News