బీజేపీకి బ్రేకులు పడినట్లేనా?

తెలంగాణలో బీజేపీ నానాటికీ తీసికట్టు అన్న పరిస్థితికి వచ్చింది. ఇక చేరికలకు కూడా బ్రేక్ పడింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ [more]

Update: 2020-02-14 18:29 GMT

తెలంగాణలో బీజేపీ నానాటికీ తీసికట్టు అన్న పరిస్థితికి వచ్చింది. ఇక చేరికలకు కూడా బ్రేక్ పడింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ తిరుగుతున్న బీజేపీ నేతలకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. దీంతో బీజేపీ లో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రధానంగా నాయకత్వ లోపంతో తెలంగాణ బీజేపీలో కండువా కప్పుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

పార్లమెంటు ఎన్నికలకు ముందు…..

పార్లమెంటు ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీని చూస్తే అందరికీ ఆశ్చర్యం వేసింది. తెలంగాణలో కాంగ్రెస్ గ్రూపు తగాదాలతో క్షేత్రస్థాయిలో దెబ్బతినడం బీజేపీకి కలసి వస్తుందనుకున్నారు. కాంగ్రెస్ జవసత్వాలు కోలుపోవడం, కేంద్రంలో అధికారంలో ఉండటమే ఇందుకు కారణమని చెప్పి తీరాలి. బీజేపీలో చేరితే భవిష్యత్తు ఉంటుందని అనేక మంది కాంగ్రెస్ కీలక నేతలు కూడా బీజేపీలో చేరిపోయారు.

అగ్రనేతలు చేరడంతో…..

పార్లమెంటు ఎన్నికలకు ముందు సీనియర్ నేతలు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సోమారపు సత్యనారాయణ వంటి నేతలు చేరారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని కూడా బీజేపీ అగ్రనేతలు చెప్పారు. దీంతో ఇక బీజేపీలో చేరికలు కొనసాగుతాయని అందరూ భావించారు.

మున్సిపల్ ఎన్నికల తర్వాత…..

పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలను గెలుచుకోవడంతో బీజేపీకి ఇక తిరుగులేదని అనిపించింది. మాజీ ఐఏఎస్ చంద్రవదన్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావులు కూడా బీజేపీ కండువా కప్పేసుకున్నారు. వీరితో పాటు రాజ్యసభ సభ్యుడు గరికపాటితో పాటు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు కూడా చేరారు. కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీకి క్షేత్ర స్థాయిలో అసలు బలం ఏంటో తెలిసింది. దీంతో చేరికలకు ఇక బ్రేకులు పడినట్లేనని తెలుస్తోంది.

Tags:    

Similar News