రంగంలోకి దిగినా….?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనల మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో [more]

Update: 2019-08-17 11:00 GMT

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనల మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు జాతీయ నేతలు రామ్ మాధవ్, మురళీధర్ రావులు తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనెల 18వ తేదీన భారీ ఎత్తున చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల్లో అసంతృప్త నేతలతో వీరు టచ్ లోకి వెళ్లారు. ఈ నెల 18వ తేదీన అమిత్ షా సమక్షంలో చేరాలని నిర్ణయించుకున్న నేతల జాబితాను కూడా ఇప్పటికే రాష్ట్ర నేతలు సిద్ధం చేశారు. అయితే అమిత్ షా రాకపోవడంతో ఆయన స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వస్తున్నారు.

లోక్ సభ ఫలితాలతో….

తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు పార్టీకి బలాన్ని ఇచ్చాయి. నాలుగు లోక్ సభ స్థానాలను గెలుచుకోవడంతో తెలంగాణాలో సులువుగా పాగా వేయవచ్చన్నది ఆలోచన. దక్షిణాదిన కొద్దోగొప్పో చేతికందే అవకాశమున్న రాష్ట్రం కర్ణాటక తర్వాత తెలంగాణ మాత్రమే కావడంతో ఇప్పుడు ఇక్కడ హడావిడి ఎక్కువ చేస్తున్నారు. గతంలో పార్టీని విడిచిన నేతలను కూడా చేర్చుకునేందుకు ఘర్ వాపసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఘర్ వాపసీని…..

ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగానే సినీనటి, కాంగ్రెస్ నేత విజయశాంతిని తిరిగి కమలం గూటికి రప్పించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, యన్నం శ్రీనివాసరెడ్డి లను తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకోసం కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు నేరుగా వారి ఇళ్లకు వెళుతుండగా రామ్ మాధవ్ వారితో ఫోన్లో మాట్లాడుతున్నారు. తిరిగి పార్టీలో చేరినా ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదని రామ్ మాధవ్ వారికి హామీ ఇస్తుండటంతో త్వరలోనే వీరంతా కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం ఉంది.

టీడీపీయే ప్రధాన టార్గెట్….

ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దాదాపుగా ఖాళీ చేసే ప్రయత్నంలో ఉంది బీజేపీ. ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నేతలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు పార్టీ ప్రాధమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరంతా బీజేపీలో చేరనున్నారు. ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ నేతలే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. మరి ఈ నెల 18వ తేదీన జెపి నడ్డా సమక్షంలో ఎంతమంది కండువా కప్పుకోనున్నారో చూడాలి.

Tags:    

Similar News