ఇక చేరికలు షూరూ… చాలా మంది ఉన్నారట

బీజేపీలోకి ఇక చేరికలు షురూ కానున్నాయి. పెద్దయెత్తున వలసలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ బీజేపీ లోకి వద్దామా? లేదా? అన్న మీమాంసలో ఉన్న వారు [more]

Update: 2020-12-13 11:00 GMT

బీజేపీలోకి ఇక చేరికలు షురూ కానున్నాయి. పెద్దయెత్తున వలసలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ బీజేపీ లోకి వద్దామా? లేదా? అన్న మీమాంసలో ఉన్న వారు సయితం బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. చేరికలకు కూడా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనపడుతుంది. ఇప్పటికే విజయశాంతి బీజేపీలో చేరిపోయారు. విజయశాంతితో పాటు మరికొందరు మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రులు కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారన్న టాక్ వినపడుతుంది.

వరస విజయాలతో…..

దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో బీజేపీపై నమ్మకం పెరిగింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే కనపడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దయెత్తున వలసలు ఉండే అవకాశముంది. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలపడంతో ఆ పార్టీ అప్రమత్తమయింది.

కాంగ్రెస్ లో ఉండి……

అయినా సరే ఇక కాంగ్రెస్ లో ఉండి సాధించేదేమీ లేదని భావించిన కొందరు నేతలు బీజేపీ సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దశల వారీగా వీరికి పార్టీ కండువాలను కప్పేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. అధికార టీఆర్ఎస్ పై ఇటీవల జరిగిన ఎన్నికలలో పెద్దయెత్తున అసంతృప్తి బయటపడటంతో బీజేపీ కి అవకాశాలున్నాయని భావించిన ఒక మాజీ ఎంపీ ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సంకేతాలను కూడా పంపారు.

మాజీలందరూ బీజేపీ వైపు….

మాజీ ఎంపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మాజీ మంత్రులు సయితం కమలం బాట పట్టే అవకాశముంది. వచ్చే ఎన్నికల నాటికి కనీసం వంద స్థానాల్లో బలపడాలన్నది బీజేపీ నిర్ణయం. అందుకోసమే వంద స్థానాల్లో బలమైన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకోవాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించిందనితెలుస్తోంది. ఇటీవల అమిత్ షా, నడ్డాలతో బండి సంజయ్ జరిపిన సమావేశంలో కూడా ప్రధానంగా చేరికలపై చర్చించినట్లు తెలిసింది.

Tags:    

Similar News