ఇక్కడ పెత్తనం కుదిరేట్లు లేదుగా?

ప్రతి రాష్ట్రంలో బీజేపీదే పైచేయి అవుతుంది. కూటమిని శాసించే స్థాయిలో ఉంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థులను సయితం బీజేపీయే నిర్ణయిస్తుంది. కానీ తమిళనాడులో మాత్రం బీజేపీకి అది సాధ్యం [more]

Update: 2020-12-31 18:29 GMT

ప్రతి రాష్ట్రంలో బీజేపీదే పైచేయి అవుతుంది. కూటమిని శాసించే స్థాయిలో ఉంటుంది. ముఖ్యమంత్రి అభ్యర్థులను సయితం బీజేపీయే నిర్ణయిస్తుంది. కానీ తమిళనాడులో మాత్రం బీజేపీకి అది సాధ్యం కాలేదు. బీజేపీ ఎత్తుగడను ముందుగానే గమనించిన అధికార అన్నాడీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించింది. దీంతో బీజేపీ దీనిపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా ఏం చేయలేని స్థితిలో సరేననాల్సి వచ్చింది.

బలం లేకపోయినా…..

తమిళనాడులో బీజేపీకి పెద్దగా బలం లేదు. ప్రాంతీయ పార్టీల సరసన చేరి అరకొర సీట్లను సాధించడం తప్పించి బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం లేదు. జయలలిత, కరుణానిధి జీవించి ఉన్నప్పుడు బీజేపీని దగ్గరకు రానిచ్చే వారు కాదు. ఒకవేళ వచ్చినా వారు చెప్పనట్లు కమలనాధులు నడచుకోవాల్సి వచ్చేది. కానీ వీరిద్దరి మరణం తర్వాత బీజేపీ కొంత తమిళనాడులో పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంది.

తెర వెనక…?

అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ చేరిపోయింది. జయలలిత లేకుండా దాదాపు మూడున్నరేళ్ల పాటు అన్నాడీఎంకే అధికారంలో ఉందంటే అది బీజేపీయే కారణమని చెప్పక తప్పదు. శశికళను అక్రమాస్తుల కేసులో జైలుకు పంపడం దగ్గర నుంచి పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య సయోధ్యకు కూడా బీజేపీయే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఇద్దరిలో పన్నీర్ సెల్వం బీజేపీకి బాగా దగ్గరయ్యారు. అయితే సీఎం అభ్యర్థి విషయంలో ఈ ఇద్దరు బీజేపీకి అవకాశం ఇవ్వలేదు.

ముందుగానే నిర్ణయించి…..

ముందుగానే అన్నాడీఎంకే నేతలు సమావేశమై ముందుగానే పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించారు. పార్టీ అధినేతగా పన్నీర్ సెల్వం కొనసాగేలా నిశ్చయంచారు. దీంతో పెత్తనం చేద్దామనుకున్న బీజేపీకి ఇక్కడ మాత్రం సాధ్యం కాలేదు. అలాగే సీట్ల సర్దుబాటు విషయంలోనూ బీజేపీని కట్టడి చేయాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. వారికి పరిమితమైన సీట్లను మాత్రమే ఇవ్వాలని భావిస్తుంది. మొత్తం మీద తమిళనాడులో మాత్రం బీజేపీని పెత్తనం చేయకుండా నేతలు కట్టడి చేయగలిగారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News