ఆశలు లేని చోట?

తమిళనాడులో బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందన్న సూచనలు కన్పించడం లేదు. డీఎంకే బలంగా ఉండటం, రజనీకాంత్ సొంత పార్టీతో [more]

Update: 2020-02-21 18:29 GMT

తమిళనాడులో బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందన్న సూచనలు కన్పించడం లేదు. డీఎంకే బలంగా ఉండటం, రజనీకాంత్ సొంత పార్టీతో తమిళనాడు రాజకీయాల్లోకి వస్తుండటంతో బీజేపీ తమిళనాడులో ఆశలు వదిలేసుకుందనే చెప్పాలి. పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే తో పాత్తు పెట్టుకున్న బీజేపీ భంగపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అన్నాడీఎంకే సత్తా చూపించినా శాసనసభ ఎన్నికల నాటికి అది తేలిపోతుందన్న అంచనాలో బీజేపీ నేతలు ఉన్నారు.

అన్నాడీఎంకేతో…..

ముఖ్యంగా తమిళనాడు అధికార అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్లు కనపడుతుంది. గత కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి పళనిస్వామి పాలన సజావుగానే జరుగుతున్నప్పటికీ ఎన్నికల సమయానికి ప్రజలు అన్నాడీఎంకే వైపు చూస్తారన్న గ్యారంటీ లేదు. అందుకే ఇతర పార్టీలతో పొత్తుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందంటున్నారు. పీఎంకే, రజనీకాంత్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తుంది.

వీలయితే… కుదిరితే…..

అయితే రజనీకాంత్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నారు. వీలుంటే కమల్ హాసన్, పీఎంకేతో పొత్తుకు రజనీకాంత్ సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కూటమిలో చేరాలని బీజేపీ భావిస్తుంది. అన్నాడీఎంకేను కలుపుకుని ఎన్నికలకు వెళితే ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే కేంద్రనాయకత్వానికి నివేదికలు అందజేసినట్లు చెబుతున్నారు. పొత్తుల విషయంలో కేంద్ర నాయకత్వం పూర్తిగా రాష్ట్ర నాయకత్వానికే బాధ్యత అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

లేకుంటే ఒంటరిగా…..

చివరి నిమిషం వరకూ రజనీకాంత్ తో పొత్తు కోసం ప్రయత్నించాలని, అందుకు అవసరమైన సాయాన్ని కేంద్రనాయకత్వం కూడా అందిస్తుందని పార్టీ పెద్దలు రాష్ట్ర నేతలకు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. రజనీకాంత్ అంగీకరించకుంటే ఒంటరిగా పోట ీచేసేందుకు కూడా సిద్ధమవ్వాలని బీజేపీ నేతల అభిప్రాయంగా ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని కూడా ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News