ఎంత గింజుకున్నా వచ్చేవి అవేనటగా

ఆరేళ్ళుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నప్పటీకీ భారతీయ జనతాపార్టీకి ఇబ‌్బందులు తప్పడంలేదు. దిగువసభలో (లోక్ సభ) లో తిరుగులేని ఆధిక్యత ఉన్నప్పటికీ పెద్దలసభలో (రాజ్యసభ) ఇప్పటికీ మెజారిటీకి ఆమడదూరంలో [more]

Update: 2020-03-19 16:30 GMT

ఆరేళ్ళుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నప్పటీకీ భారతీయ జనతాపార్టీకి ఇబ‌్బందులు తప్పడంలేదు. దిగువసభలో (లోక్ సభ) లో తిరుగులేని ఆధిక్యత ఉన్నప్పటికీ పెద్దలసభలో (రాజ్యసభ) ఇప్పటికీ మెజారిటీకి ఆమడదూరంలో ఉంది. ఫలితంగా ఎగువసభలో (రాజ్యసభ) బిల్లుల ఆమోదానికి నానా పాట్లుపడాల్సి వస్తోంది. ముఖ్యంగా కీలక బిల్లుల ఆమోదానికి ప్రాంతీయ పార్టీల మద్దతు పొందిల్సి వస్తోంది. లోక్ సభకు మాదిరిగా రాజ్యసభకు ఎన్నికలు జరగవు. ప్రజలు నేరుగా ఈ చట్టసభ సభ్యులను ఎన్నుకోరు. ప్రతి రెండే‌ళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రాధమికంగా రాజ్యసభ రాష్ట్రాల మండలి (Council of States). అందువల్ల ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఈ చట్టసభ సభ్యులను ఎన్నుకుంటారు. కేవలం కేంద్రంలో అధికారం సాధించినంత మాత్రాన ఎగువసభలో అధికార పార్టీ మెజార్టీ సాధించలేదు. ఆయా రాష్ట్రాల్లో మెజారిటీ సాధించినపుడు మాత్రమే అధికార పార్టీకి ఇక్కడ సం‌ఖ్యాబలం సమకూరుతుంది. అందువల్ల అధికారపార్టీకి ఎగువసభలో కొంతవరకు ఇబ్బందులు తప్పవు.

మరో రెండేళ్ల వరకూ…..

గత ఆరేళ్లుగా అధికార బీజేపీ ఈ కోణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఎప్పటికప్పుడు సమస్యలను అధిగమించింది. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే రాజ్యసభ ఎన్నికలకు ప్రస్తుతం తెరలేచింది. 17 రాష్ట్రాల్లోని 55 స్ధానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల అనంతరం కూడా బీజేపీ కూటమికి మెజారిటీ సమకూరడం అసాధ్యం. రాజ్యసభలోని మెుత్తం 245 స్ధానాలకుగాను ప్రస్తుతం 7 ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 238 స్ధానాల్లో కనీస మెజారిటీ 119 స్ధానాలు అవసరం. ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 82 ఉన్నాయి. ఎన్డీఏ కుాటమికి 97 స్ధానాలు ఉన్నాయి. విపక్ష కాంగ్రెస్ కు 46 స్ధానాలున్నాయి. ఎన్నికల అనంతరం ఎన్డీఏ మెజారిటీ 110 స్ధానాలకు పెరిగే అవకాశం ఉంది. అంటే సాధారణ మెజారిటీకి ఇంకా 10 స్ధానాలు దుారంలో ఉంటుంది. అంటే మరో రెండే‌ళ్ల వరకు ఎగువసభలో అధికారపార్టీకి ఇబ్బందులు అనివార్యం కానున్నాయి.

యూపీఏ కూడా అంతే…

2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు పాలించిన యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంది. అప్పట్లో యూపీఏ కు కూడా పూర్తి సం‌ఖ్యా బలం లేదు. ప్రాంతీయ పార్టీల మద్దతు, ఆ యా పార్టీల సభ్యులకు తాయిలాలు ఎర చూపడం, కొన్ని సందర్భాల్లో సీబీఐ, ఈడీ కేసులను చూపి బెదిరించడం ద్వారా పెద్దల సభలో నెగ్గుకొచ్చే ప్రయత్నం చేసింది సోనియా సారధ్యంలోని యూపీఏ కూటమి. ఇపుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పలేం. కారణాలు ఏమైనప్పటికీ పెద్దలసభలో ఎన్డీఏ కు తగినంత బలం లేనప్పటికి ట్రిపుల్ తలాక్, పౌరసత్వ చట్టం, ఆర్టికల్ 370 అధికరణ రద్దు వంటి అంశాల్లో సభ ఆమెాదం పొందగలిగింది. అన్నాడిఎంకే, వైసీపీ, బిజుా జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు పరోక్షంగా కమలం పార్టీకి వివిధ సంధర్బాల్లో పెద్దల సభలో సహకరిస్తూనే వచ్చాయి. అందువల్లే బిల్లులను ఆమెాదించకోగలుగుతుంది.

అదనంగా వచ్చేది ఏడు మాత్రమే….

ఇక ప్రస్తుత ఎన్నికలకు వస్తే నామినేషన్ల దాఖలుకు ఆఖరితేదీ ఈ నెల 13వ తేదీ. ఎన్నికలు ఈనెల 26న జరుగుతాయి. అంటే దాదాపు 13వ తేదీకి ఎవరెవరు ఎన్నికవుతారో తేలిపోతుంది. ఖా‌ళీ అయ్యే 55 స్ధానాల్లో ఎన్డీఏకు 23 వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఖాతాలో 18 స్థానాలు జమయ్యే అవకాశం ఉంది. ఇతర పార్టీలు 14 స్ధానాలు కైవసం చేసుకోగలవు. గతంలో కన్నా బీజేపీకి 7 స్థానాలు అదనంగా వస్తాయి. కాంగ్రెస్ నాలుగు స్ధానాలు కోల్పోయే అవకాశం ఉంది. తెలుగు రాష్ర్టాలకు సంబందించి వైసీపీ బాగా లబ్దిపొందనుంది. ప్రస్తుతం ఆ పార్టీకి ఇద్దరు సభ్యులు (వి.విజయసాయిరెడ్టి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి) ఉన్నారు. ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందినవారే కావడం విశేషం. రేపటి ఎన్నికల్లో కనీసం మరో నలుగురు గెలిచే అవకాశం ఉంది. దీంతో పార్టీ బలం ఆరుకు చేరుతుంది. టి.ఆర్.యస్ తరఫున ఇద్దరు గెలిచే అవకాశం ఉంది. దీంతో ఆపార్టీ బలం 8 కి పెరుగుతుంది. బాగా నష్టపోయే పార్టీ టీడీపీనే. ఆ పార్టీకి ఒకే సభ్యుడు (కనమేడల రవీంద్ర కుమార్) మాత్రమే మిగులుతారు. 2018 లో బి.జె.పి మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ గడ్, ఈఏడాది జార్ఖాండ్ లో ఓడిపోవడం, హర్యానా, మహారాష్ట్రలో పూర్తిస్ధాయి మెజారిటీ లభించకపోవడం రాజ్యసభ ఎన్నికలపై ప్రభావం చుాపింది. లేనట్లయితే కనీస మెజారిటీ సాధించగలిగేది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News