సాగర్ లో బీజేపీ ఎత్తుగడ ఫలిస్తుందా? అయినా… కాకపోయినా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ సరైన ఎత్తుగడను ఎంచుకుంది. బలమైన సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపింది. బీజేపీ తన అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ [more]

Update: 2021-04-12 09:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ సరైన ఎత్తుగడను ఎంచుకుంది. బలమైన సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపింది. బీజేపీ తన అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ ను బరిలోకి దింపింది. రాజకీయ పార్టీలు సయితం ఆశ్చర్యపోయేలా ఈ ఎంపిక ఉందని భావిస్తున్నారు. ఇక్కడ సామాజికవర్గాల సమీకరణల ఆధారంగానే బీజేపీ రవికుమార్ ను ఎంపిక చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

బలమైన అభ్యర్థులు ఉండటంతో….

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా బలమైన సామాజికవర్గాల అభ్యర్థులనే బరిలోకి దింపాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి బరిలో ఉన్నారు. ఈయనకు రెడ్డి సామాజికవర్గం అండగా ఉంటుంది. ఇక టీఆర్ఎస్ ఎంపిక చేసిన నోముల భగత్ సయితం యాదవ సామాజికవర్గం. ఇక్కడ వీరి ఓటు బ్యాంకు కూడా ఎక్కువే. దీంతో బంజారాలు అధికంగా ఉన్న సాగర్ లో రవికుమార్ ఎంపిక సరైనదేనని విశ్లేషకులు సయితం భావిస్తున్నారు.

డిపాజిట్ దక్కుతుందా అన్న పరిస్థితి నుంచి….

నిజానికి బీజేపీకి నాగార్జున సాగర్ లో అవకాశాలు చాలా తక్కువ. కనీసం రెండో స్థానానికి పోటీ పడే పరిస్థితి లేదు. కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందా? లేదా? అన్న సందేహం కూడా కలిగింది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న బీజేపీకి సాగర్ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రారంభంలోనే జానారెడ్డి కుటుంబాన్ని పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నించింది. అది వర్క్ అవుట్ కాలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఒక దశలో విన్పించింది.

బంజారా వైద్యుడు రాకతో…..

అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన కంకణాళ నివేదితకు టిక్కెట్ ఖాయమనుకున్నారు. కానీ ఆమెకు టిక్కెట్ ఇస్తే సామాజికవర్గాల పరంగా ఇబ్బందవుతుంది. కనీస ఓట్లు కూడా రావడం కష్టమే. అందుకే బంజారా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో డాక్టర్ రవికుమార్ ను ఎంపిక చేసింది. డాక్టర్ గా ఆయన నియోజకవర్గంలో సుపరిచితులు. నిర్మల ఫౌండేషన్ పేరుతో సేవలను కూడా అందిస్తున్నారు. దీంతో బీజేపీ ఇక్కడ గెలవలేకపోయినా అనుకోని రీతిలో ఓట్లను సాధించే అవకాశముంది.

Tags:    

Similar News