సాగర్ దిగులు మామూలుగా లేదుగా?

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. సరైన అభ్యర్థి లేకపోవడం, గెలుపుపై ఆశలు లేకపోవడంతో బీజేపీ అగ్రనాయకత్వం దీనిపై మదన పడుతోంది. ఇప్పటి వరకూ దుబ్బాక [more]

Update: 2021-01-25 09:30 GMT

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. సరైన అభ్యర్థి లేకపోవడం, గెలుపుపై ఆశలు లేకపోవడంతో బీజేపీ అగ్రనాయకత్వం దీనిపై మదన పడుతోంది. ఇప్పటి వరకూ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక వార్డులను గెలుచుకోవడంతో భవిష్యత్ తమదేనంటూ బీజేపీ ఆర్భాటంగా ప్రకటించుకుంది. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురుతుందని కూడా బీరాలు పలికారు. 2023 ఎన్నికల్లో అధికారం తమదేనంటూ పదే పదే ప్రకటించుకుంటున్నారు.

చాలా తేడా….?

కానీ క్షేత్రస్థాయిలో చూస్తే దుబ్బాకకు, నాగార్జున సాగర్ కు చాలా తేడా ఉంది. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. అంతేకాకుండా బలమైన, సమర్థవంతమైన నేతలు ఉన్నారు. జానారెడ్డి కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగుతున్నారు. ఆయనపై ఇప్పటికే గత ఎన్నికల్లో ఓటమి పాలయి సానుభూతిని సంపాదించుకున్నారు. ఇప్పటికే జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ గెలుపు అవకాశాలను మెరుగుపర్చుకుంటున్నారు.

బలమైన అభ్యర్థులు…

ఇక టీఆర్ఎస్ కూడా అధికారంలో ఉండటంతో దాని అడ్వాంటేజీలు దానికి ఉన్నాయి. ఇక్కడ మొదటి, రెండు స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఉంటాయన్నది వాస్తవం. అయితే ఇప్పటి వరకూ సంపాదించుకున్న క్రేజ్ సాగర్ ఉప ఎన్నికలతో కనుమరుగవుతుందేమోనన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇక్కడ బలమైన అభ్యర్థులు కూడా బీజేపీకి లేరు. ఏదో నామ్ కే వాస్తేగా పోటీలోకి దింపడమే అవుతుంది.

ప్రభావం అంతంత మాత్రమే….

బీజేపీ అభ్యర్థిత్వం కోసం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన నివేదిత రెడ్డి, 2014 ఎన్నికల్లో పోటీ చేసిన అంజయ్యయాదవ్ లు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ బలహీనమైన అభ్యర్థులేనన్నది వాస్తవం. కొత్త అభ్యర్థి కోసం వెదుకులాట ప్రారంభమయింది. సర్వేలను కూడా బీజేపీ నిర్వహిస్తుంది. జానారెడ్డి కుటుంబాన్ని బీజేపీలోకి తీసుకురావాలన్న ప్రయత్నం ఫెయిల్ కావడంతో ఇప్పుడు సాగర్ దిగులు బీజేపీనేతలకు పట్టుకున్నట్లే కన్పిస్తుంది. ఇక్కడ హిందుత్వ అజెండా కూడా పెద్దగా పనిచేసే అవకాశం లేదంటున్నారు.

Tags:    

Similar News