ఆశలు పెట్టుకున్నా “ఫలితం” లేనట్లుందిగా?

మహారాష్ట్రలో బీజేపీ పెట్టుకున్న ఆశలు ఫలించేలా లేవు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. తమకు అధిక స్థానాలువచ్చినా, తమతో ఎన్నికల వరకూ కలిసి [more]

Update: 2020-12-18 16:30 GMT

మహారాష్ట్రలో బీజేపీ పెట్టుకున్న ఆశలు ఫలించేలా లేవు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. తమకు అధిక స్థానాలువచ్చినా, తమతో ఎన్నికల వరకూ కలిసి ఉన్న శివసేన పక్కకు తప్పుకోవడంతో అధికారాన్ని కోల్పోయింది. పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది. బీజేపీ నేతలే సంకీర్ణ సర్కార్ త్వరలో కూలిపోతుందని డేట్స్ తో సహా చెబుతుండటం విశేషం.

సంకీర్ణ ప్రభుత్వాన్ని…..

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కలసి మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ఇటీవలే ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. బీజేపీ సంగతి తెలిసిన శివసేన తన మిత్రపక్షాలతో సయోధ్యతో మెలుగుతుంది. వారి సూచనల మేరకే నిర్ణయాలను తీసుకుంటుంది. ప్రధానంగా కీలక నేత అయిన శరద్ పవార్ ను ఏమాత్రం శివసేన నిర్లక్ష్యం చేయడం లేదు.

మండలి ఎన్నికల్లో…..

దీంతో పాటు ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికలు కూడా శివసేనకు కలసి వచ్చాయనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి పోటీ చేశాయి. మొత్తం ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికలలో నాలుగు స్థానాలను మహా వికాస్ అఘాడీ గెలుచుకోవడం విశేషం. మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ఒకటి స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలు జరగ్గా బీజేపీకి ఒక్క స్థానం మాత్రమే దక్కింది.

బీజేపీకి ఎదురుదెబ్బే…..

మహా వికాస్ అఘాడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించడంతో కొత్త ఉత్సాహం నెలకొంది. బీజేపీకి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. నాగపూర్ బీజేపీకి కంచుకోట. అలాంటిది అరవై ఏళ్ల తర్వాత నాగపూర్ లో బీజేపీ పరాజయం పాలయింది. ఇక్కడ శివసేన సహకారంతో కాంగ్రెస్ గెలుచుకుంది. మొత్తంమీద మహారాష్ట్రపై బీజేపీ పెట్టుకున్న ఆశలు ఇప్పట్లో ఫలించేలా కన్పించడం లేదు. ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని నమ్మి వచ్చే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు.

Tags:    

Similar News