మోదీ మరింత బలపడాలంటే?

రెండు రాష్ట్రాల శాసనసభలు, ఉత్తరప్రదేశ్ లో పది పైచిలుకు అసెంబ్లీ స్థానాలకు వెలువడే ఫలితాలు మరోసారి దేశరాజకీయాలను ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల [more]

Update: 2019-10-23 15:30 GMT

రెండు రాష్ట్రాల శాసనసభలు, ఉత్తరప్రదేశ్ లో పది పైచిలుకు అసెంబ్లీ స్థానాలకు వెలువడే ఫలితాలు మరోసారి దేశరాజకీయాలను ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారపార్టీ అయిన బీజేపీకి ఇదే తొలిపరీక్ష. అత్యంత కీలకమైనది కూడా. ఇప్పటివరకూ వెలువడిన ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏకపక్షంగా కమలానికే అధికారం ఖాయమని తేల్చేశాయి. నల్లేరుపై బండి నడకగా విజయాన్ని కట్టబెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ ఫలితంగా రూపుదాలిస్తే వచ్చే పరిణామాలు, పర్యవసానాలపై దేశ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రం ఆధారపడి ఉంది. ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉన్న స్థితిలోనూ గతాన్ని మించి విజయం సాధిస్తే కచ్చితంగా బీజేపీని విశ్వసించే వాతావరణం దేశంలో నానాటికీ బలపడుతున్నట్లే లెక్క.

హర్యానా లో హవా కొనసాగితే…

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నికా ముఖ్యమైనదే. అందుకే ఉప ఎన్నికను సైతం పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. దేశంలో రెండో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రతో పాటు దేశరాజధానిని చేర్చి ఉన్న హర్యానాలో ఎన్నికలంటే మాటలు కాదు. రెండు చోట్లా అధికారంలో ఉన్న బీజేపీ పట్ల ఎంతో కొంత వ్యతిరేకత రావడం సహజం. అందులోనూ కేంద్రంలోనూ అదే పార్టీ అధికారంలో కొనసాగుతూ వస్తోంది. హర్యానాపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇవన్నీ ప్రతికూలాంశాలుగా మనకు కనిపిస్తాయి. నేషనల్ కేపిటల్ రీజియన్ ను చేర్చి ఉండటం వల్ల ఆటోమొబైల్ పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ రంగం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లోనూ హర్యానాది రికార్డు. తలసరి ఆదాయంలో ఎంతోముందున్న ఈ రాష్ట్రం తాజాగా కొంత ఒడిదొడుకులకు లోనవుతోంది. హర్యానా ప్రభావం దేశరాజధానిపై కూడా ఉంటుంది. ఆమ్ ఆద్మీని కంట్రోల్ చేసి హస్తినను తన పాలనలోకి తెచ్చుకోవాలనేది బీజేపీ ప్రణాళిక. అందుకు హర్యానా విజయం జోష్ నిస్తుంది. 2014 నాటి ఫలితాలను మించి హర్యానాలో కమలం పార్టీ విజయం సాధించబోతున్నట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ వంటి ప్రాంతీయ పార్టీలు పూర్తిగా చితికిపోయి ఆ మేరకు బీజేపీ భారీగా లబ్ధిపొందుతోందంటున్నారు. అదే జరిగితే భవిష్యత్తులో ప్రాంతీయపార్టీలను నిర్వీర్యం చేసేందుకు బీజేపీకి ప్రాతిపదిక దొరికినట్లే. ఆప్ వంటి పార్టీలకూ హర్యానా ఫలితం హెచ్చరిక పంపడం ఖాయం.

మహారాష్ట్ర మేలిమలుపు…

శివసేన, బీజేపీల నాయకత్వాలకు పడటం లేదు. 2014 నుంచి విభేదాలున్నాయి. అప్పట్లో విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ తానే రాష్ట్రంలో అతి పెద్ద రాజకీయ శక్తిగా నిరూపించుకుంది. తన అస్తిత్వం కోసం ఎన్నికల తర్వాత శివసేన జట్టుకట్టక తప్పలేదు. ఎన్సీపీ, కాంగ్రెసులు విడివిడిగా పోటీ చేసి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తప్పును తెలుసుకుని ఇప్పుడు తిరిగి జట్టుకట్టాయి. అధికార బీజేపీ, శివసేనలు సైతం రాజకీయ అనివార్యతతో కలిసే పోటీ చేశాయి. మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత సజావుగా లేదు. దేశ ఆర్థిక రాజధానిగా పేర్కొనే ఈ రాష్ట్రంలో రుణ సంక్షోభం నెలకొంది. పరిపాలన పట్ల ప్రజలు పూర్తి సంత్రుప్తిని వ్యక్తం చేయడం లేదు. అయినప్పటికీ ఇక్కడ బీజేపీ, శివసేన కూటమి ఏకపక్ష విజయాన్ని సాధిస్తుందని సర్వేలు ప్రకటిస్తున్నాయి. రాష్ట్రాన్ని ముంబై, కొంకణ్, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ రీజియన్లుగా రాజకీయంగా విభజించి చూస్తుంటారు. ఒక్క మరాఠ్వాడా రీజియన్ లో మినహాయించి వేరెక్కడా కాంగ్రెసు, ఎన్సీపీ కూటమి అధికారపక్షానికి బలమైన పోటీ ఇవ్వలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దేశంలో సీనియర్ రాజకీయవేత్త , అపర చాణుక్యునిగా పేరున్న శరద్ పవార్ సైతం కాంగ్రెసు, ఎన్సీపీ కూటమిని రూలింగ్ పార్టీకి పోటీ నిచ్చే స్థాయికి చేర్చలేకపోయారంటే ప్రతిపక్షాల భవిష్యత్ చిత్రం అర్థమవుతుంది. ఎన్సీపీ వంటి బలమైన పార్టీ కుదేలవ్వడమంటే బీజేపీ తన జాతీయ అజెండాకు మరింత మద్దతు కూడగట్టుకోగలుగుతుంది.

జబర్దస్త్ గా జమిలీ….

దేశాన్ని రాజకీయంగా ఏకోన్ముఖం చేయాలనేది బీజేపీ యోచన. చైనా తరహాలో ఒకే పార్టీ అనకపోయినప్పటికీ ఒకే దేశం..ఒకే అజెండా అన్నది కమలం పార్టీ సిద్ధాంతం. అందుకు అవసరమైన రాజ్యాంగ నిర్మాణాన్ని సాధించాలంటే ప్రజాస్వామ్య విజయాలను ఎక్కువగా సాధించాలి. జమిలీ ఎన్నికలు కూడా అందులో భాగమే. ఈఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రాల శాసనసభలు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనపై కసరత్తు మొదలు కావచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. వరస విజయాలు బీజేపీకి అవసరమైన రాజకీయ,నైతిక, రాజ్యాంగ మద్దతు సమీకరించి పెడుతున్నాయి. అయితే దేశ రాజకీయ ముఖచిత్రం ఇంకా పూర్తిగా ఏకపక్షం కాలేదు. దక్షిణాదిన బీజేపీ ఒక రాష్ట్రానికే పరిమితమైంది. మిగిలిన చోట్ల చేస్తున్న ప్రయత్నాలు పాక్షిక ఫలితాన్ని మాత్రమే ఇస్తున్నాయి. అదీ సందర్బాన్ని బట్టి మాత్రమే కమలానికి దక్షిణభారత ప్రజలు ఎంతోకొంత మద్దతిస్తున్నారు. రాజకీయంగా ఆ పార్టీ ఇక్కడ పూర్తిగా ఆధిక్యత సాధించడం సాధ్యపడటం లేదు. కానీ ఇప్పుడు చకచకా పావులు కదుపుతోంది. తమిళనాడులో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. తెలంగాణలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి ఆ స్థానాన్ని ఆక్రమించే దిశలో పావులు కదుపుతోంది. మహారాష్ట్ర, హర్యానా ఫలితాల తర్వాత ఈ ప్రయత్నం మరింత ఊపందుకుంటుంది. టార్గెట్ సౌత్ ఇండియాకు ఈ ఎన్నికల ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని చెప్పవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News