తొందరగానే కథ ముగించేయాలనేనా?

కౌంట్ డౌన్ దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో కమల్ నాధ్ ప్రభుత్వం కుప్పకూలనుంది. ఈ నెల 16వ తేదీన బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ పట్టుబట్టేందుకు సిద్ధమయింది. [more]

Update: 2020-03-13 16:30 GMT

కౌంట్ డౌన్ దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో కమల్ నాధ్ ప్రభుత్వం కుప్పకూలనుంది. ఈ నెల 16వ తేదీన బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ పట్టుబట్టేందుకు సిద్ధమయింది. గవర్నర్ వద్దకు ఇప్పటికే బీజేపీ కమల్ నాధ్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిన విషయాన్ని తీసుకు వెళ్లారు. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జ్యోతిరాదిత్య సింధియా వెంట వెళ్లడంతో కమల్ నాధ్ ప్రభుత్వం మైనారిటీలో పడిన విషయం తెలిసిందే.

క్యాంపుల్లో సేద తీరుతున్న…..

కాంగ్రెస్, బీజేపీలు ఎమ్మెల్యేలను క్యాంపులకు చేర్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజస్థాన్ కు తరలించగా, బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో సేద తీరుతున్నారు. వీరందరినీ ఏకంగా ఈ నెల 16వ తేదీన మధ్యప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ నెల 16వ తేదీ నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభంలోనే కమల్ నాధ్ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ కోరుతోంది.

స్పీకర్ నోటీసులు….

ఇప్పటికే మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్ ప్రజాపతి పార్టీని వీడి రాజీనామాలు చేసిన 22 మందికి నోటీసులు జారీ చేశారు. వీరు తన ఎదుట హాజరై రాజీనామాలకు గల కారణాలను వివరించాలని కోరారు. వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా కమల్ నాధ్ ప్రభుత్వం కుప్పకూలుతుంది. అలాగే విశ్వాస పరీక్ష నిర్వహిస్తే వీరు గైర్హాజరయినా ప్రభుత్వ పతనం తప్పదు. ఎటు చూసినా కమల్ నాధ్ ప్రభుత్వం కుప్పకూలి పోక తప్పదన్నది విశ్లేషకుల అంచనా.

ఈ నెల 16వ తేదీన…..

జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో మకాం వేసి బీజేపీ పెద్దలతో వరస సమావేశాలు జరుపుతున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో కలసి ఆయన చర్చలు జరిపారు. మధ్యప్రదేశ్ లో వీలయినంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తుంది. రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో తొందరగానే కథ ముగించేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. గవర్నర్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నెల 16వ తేదీన బలపరీక్ష జరిపితీరాల్సిందేనని కమలనాధులు గట్టిగా పట్టుబడుతున్నారు.

Tags:    

Similar News