మరి మా సంగతేంటి?

కర్ణాటకలో ఉప ఎన్నికలు భారతీయ జనతా పార్టీలో మరోసారి అసంతృప్తిని రేకెత్తించేలా కన్పిస్తున్నాయి. పదిహేను నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉన్నాయి. ఈ ఉప [more]

Update: 2019-09-26 17:30 GMT

కర్ణాటకలో ఉప ఎన్నికలు భారతీయ జనతా పార్టీలో మరోసారి అసంతృప్తిని రేకెత్తించేలా కన్పిస్తున్నాయి. పదిహేను నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక స్థానాలను బీజేపీ గెలవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రభుత్వం దిగిపోక తప్పదు. అయితే అభ్యర్థుల ఎంపిక బీజేపీకి కత్తి మీద సామే అయింది. ఎందుకంటే ఈ పదిహేను నియోజకవర్గాల్లో ఇప్పటికే బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు.

గత ఎన్నికల్లో పోటీ చేసి…..

అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలులేదు. దీంతో ఎమ్మెల్యేల వారసులకు టిక్కెట్లు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమయింది. అయితే అప్పటికే ఆ నియోజకవర్గాల్లో ఉన్న, గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయిన అభ్యర్థులు ఇప్పటికే బీజేపీ అధిష్టానం వద్దకు చేరుకున్నారు. తమకే టిక్కెట్లు కేటాయించాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యామని, ఈసారి తమకు టిక్కెట్లు కేటాయిస్తే గెలిచి చూపిస్తామని వారు చెబుతున్నారు.

న్యాయం చేయాల్సిందేనంటూ…

మరోవైపు ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని గట్టిగా చెబుతున్నారు. వారికి న్యాయం చేయకుంటే భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని చెబుతున్నారు. దాదాపు పది నియోజకవర్గాల్లో ఇదేరకమైన సమస్య ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తుంది. తమకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడుతున్నారు.

క్యాడర్ సహకరించనంటూ…..

త్వరలో జరగనున్న ఉప ఎన్నికల స్థానాల్లో బీజేపీ క్యాడర్ కూడా గుర్రుగా ఉంది. కాంగ్రెస్ వారికి టిక్కెట్లు ఇస్తే తాము సహకరించేది లేదు పొమ్మంటుంది. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు తమపై చేయించిన దాడుల విషయాన్ని బీజేపీ క్యాడర్ పదే పదే గుర్తు చేస్తోంది. దీంతో అధిష్టానానికి ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కష్టసాధ్యంగా మారింది. అందరినీ సంప్రదించి, ఒప్పించే బాధ్యతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై బీజేపీ అధినాయకత్వం ఉంచింది. మొత్తం మీద ఉప ఎన్నికల వేళ బీజేపీలో రేగుతున్న అసంతృప్తి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారనుంది.అయితే ఉప ఎన్నికలు వాయిదా పడటంతో బీజేపీ ఊపిరి పీల్చుకుంది. కొంత సమయం దక్కడంతో అభ్యర్థుల ఎంపిక సులువుగా మారుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే కొంత వెసులుబాటు దొరుకుతుందని యడ్యూరప్ప భావిస్తున్నారు.

Tags:    

Similar News