త్యాగరాజుల సంగతేంటి…?

కర్ణాటకలో కుమారస్వామి కుప్ప కూలిపోవడానికి, బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి కారకులైన 17 మంది ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి? వారిపై అనర్హత వేటు పడటంతో కోర్టు తీర్పు అనంతరమే [more]

Update: 2019-08-31 17:30 GMT

కర్ణాటకలో కుమారస్వామి కుప్ప కూలిపోవడానికి, బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి కారకులైన 17 మంది ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి? వారిపై అనర్హత వేటు పడటంతో కోర్టు తీర్పు అనంతరమే ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. ఉప ఎన్నికలు వచ్చినా, కోర్టులో అనర్హత వేటుపై తీర్పు వస్తే తప్ప వీరి భవిష్యత్ ఏంటో తెలీకుండా ఉంది. ఎమ్మెల్యేలకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీరిలో కొందరు నేరుగా మంత్రివర్గంలో చేరే అవకాశముంది.

ఉప ఎన్నికలు జరిగితే…..

అయితే ఉప ఎన్నికలు జరిగితేనే కొంత ఇబ్బందులు తప్పవు. పార్టీ మారడంతో సహజకంగా నియోజకవర్గాల్లో వారిపై వ్యతిరేకత ఉంది. అనర్హత వేటు పడితే వీరు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. వీరి కుటుంబసభ్యుల నుంచి ఎవరినో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశముంది. అయితే ఇది ఎప్పటికి తేలేను అన్నదే ప్రశ్న. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పట్ల సానుకూలంగానే ఉన్నట్లు కన్పిస్తుంది.

విస్తరణ చేయకుండా…..

అందుకోసమే మంత్రి వర్గాన్ని కేవలం 17 మందితో మాత్రమే చేశారు. మిగిలిన పదవులను ఖాళీగానే ఉంచారు. సుప్రీంకోర్టు తీర్పు వీరికి అనుకూలంగా వస్తే కొంతమందికి ఖచ్చితంగా బెర్త్ దొరకుతుంది. అందుకే మంత్రి వర్గ విస్తరణ జరగాల్సి ఉన్నా వీరి కోసమే బీజేపీ కేంద్ర పార్టీ నాయకత్వం వాయిదా వేసినట్లు చెబుతున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంత వరకూ ఇక మంత్రి వర్గ విస్తరణ లేనట్టేనన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

తీర్పు వచ్చేంతవరకూ…..

కానీ కోర్టు కేసు ఎప్పటికి తేలుతుందో చెప్పలేమని కొందరు బీజేపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేసి, తర్వాత మరోసారి చేయవచ్చని కూడా కొందరు సీనియర్ నేతలు బీజేపీ అధినాయకత్వానికి సూచించారు. అయితే ఈ ప్రతిపాదనకు బీజేపీ నాయకత్వం నోచెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉండదని తేల్చిచెప్పడంతో మంత్రి పదవులు దక్కని సీనియర్ నేతలు డీలా పడిపోయారు. మరి 17 మంది ఎమ్మెల్యేల భవిష‌్యత్ తేలేంత వరకూ వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News