చావుదెబ్బతిన్నారుగా

జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బతినింది. కాశ్మీర్ ను మూడు ప్రాంతాలుగా విభజించడం, పౌరసత్వ విభజన అంశాలేవీ భారతీయ జనతా పార్టీకి సానుకూలం కాలేదు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో [more]

Update: 2019-12-23 17:30 GMT

జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బతినింది. కాశ్మీర్ ను మూడు ప్రాంతాలుగా విభజించడం, పౌరసత్వ విభజన అంశాలేవీ భారతీయ జనతా పార్టీకి సానుకూలం కాలేదు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల కంటే దారుణంగా దెబ్బతినింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులు అందరూ ప్రచారం చేసినా ఫలితాలివ్వలేదు. హర్యానాలో చచ్చీ చెడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి జార్ఖండ్ లో మాత్రం కాంగ్రెస్ ఆ ఛాన్స్ ఇవ్వలేదనే చెప్పాలి.

గత ఎన్నికల్లో…..

జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 82 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో కాంగ్రెస్ కూటమికి దాదాపు 42 స్థానాలు లభించాయి. మ్యాజిక్ ఫిగర్ 41 కావడంతో ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ నే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీ 37 స్థానాలు సాధించి మిత్రపక్షమైన ఏజేఎస్ యూతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే ఈసారి మిత్రపక్షాలను ఎవరిని కలుపుకోకుండానే ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది.

ఒంటరిగా పోటీ చేసినందునేనా?

గత ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలుచుకున్న బీజీపీ మిత్రపక్షమై ఏజెఎస్ యూ ఈసారి మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో జార్ఖండ్ రాష్ట్రం బీజేపీ అండగా నిలిచింది. మొత్తం 14 లోక్ సభ స్థానాలకు గాను 11 స్థానాలను గెలుచుకున్న బీజేపీ జార్ఖండ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల మాదిరిగానే రాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని భావించారు. అందుకే మిషన్ 61గా టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగింది.

జార్ఖండ్ ఎఫెక్ట్…..

ఈ ఎన్నికల్లో దాదాపు పది అసెంబ్లీ స్థానాలను బీజేపీ కోల్పోవాల్సి వచ్చింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ తో పాత్తు పెట్టుకోకపోవడం, ఎల్జీపీ ఒంటరిగా పోటి చేయడం వంటి అంశాలు బీజేపీ విజయానికి అడ్డంకిగా మారాయంటున్నారు. సీట్ల పంపకంలో అంగీకారం కుదరకపోవడంతో విడివిడిగానే పోటీ చేయాల్సి వచ్చింది. ఇటు మహారాష్ట్రలో పరాభావం తర్వాత మళ్లీ జార్ఖండ్ దెబ్బకొట్టడంతో కమలనాధుల్లో కలవరం మొదలయింది. ఈ ఎఫెక్ట్ పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పడే అవకాశం ఉంటుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News