అందినట్లే అంది చేజారుతుందా?

2019 పార్లమెంటు ఎన్నికల అనంతరం జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దగా విజయాలు సాధించలేకపోతోంది. హర్యానాలో అతి కష్టం మీద ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నా మహారాష్ట్రలో అతిపెద్ద [more]

Update: 2019-12-22 16:30 GMT

2019 పార్లమెంటు ఎన్నికల అనంతరం జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దగా విజయాలు సాధించలేకపోతోంది. హర్యానాలో అతి కష్టం మీద ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నా మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దక్షిణాదిని కర్ణాటకలో ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కొంతలో కొంత ఊరట. అయితే తాజాగా జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయినా పెద్దగా ఫలితం కన్పించే అవకాశం లేదంటున్నారు.

మ్యాజిక్ ఫిగర్ కు….

జార్ఖండ్ లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 41 స్థానాలు అవసరం. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీకి అది పెద్ద ఫిగర్ అవతుందన్నది విశ్లేషకుల అంచనా. అయిదు దశల్లో జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి కూడా విజయం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీజేపీ పెద్ద పార్టీగా అవతరించి నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యకు చేరుకోలేక పోవచ్చన్నది అంచనా.

గత ఎన్నికల్లో…..

అదే జార‌్ఖండ్ లో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. మొత్తం 14 లోక్ సభ స్థానాలకు గాను 11 సీట్లను బీజేపీ చేజిక్కించుకుంది. దీన్ని బట్టి బీజేపీకి 60కి పైగానే సీట్లు రావాల్సి ఉంటుంది. కానీ అంత సీన్ ఉంటుందా? అన్నదే ప్రశ్న. ప్రస్తుతం మోదీ గాలి కూడా బలంగా లేకపోవడం, పౌరసత్వ బిల్లు వంటివి బీజేపీ విజయానికి అడ్డంకిగా మారా యంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ 37 సీట్లు సాధించి పెద్దపార్టీగా ఆవిర్భవించినా చచ్చీ చెడీ మిత్రులతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. బీజేపీ కూటమిలో తలెత్తిన విభేదాలు కూడా ఇబ్బందిని కల్గిస్తాయంటున్నారు.

ఎగ్జిట్ పోల్స్ మాత్రం….

మరోవైపు ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. జార్ఖండ్ లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అనేక సంస్థలు తమ సర్వేల్లో తేల్చాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని తేల్చాయి. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమి ఇక్కడ బలంగా కన్పిస్తుందని సర్వేల ద్వారా వెల్లడించాయి. బీజేపీ అతి పెద్ద పార్టీగా ఏర్పడినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యకు చేరుకోలేదన్నది ఎగ్జిట్ పోల్స్ అంచనా. మరి రేపు జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News