కరెన్సీ ముందు క్యాడర్ గెలిచింది

డబ్బులున్నంత మాత్రాన ప్రజలు నెత్తిన పెట్టుకోరు. కరెన్సీ కట్టలే అన్ని చోట్ల ఓట్ల వర్షం కురిపించవు. విలువలు, నైతికత, విశ్వసనీయతకు కూడా ప్రజలు అప్పడప్పడూ పట్టం కడతారనడానికి [more]

Update: 2019-12-11 17:30 GMT

డబ్బులున్నంత మాత్రాన ప్రజలు నెత్తిన పెట్టుకోరు. కరెన్సీ కట్టలే అన్ని చోట్ల ఓట్ల వర్షం కురిపించవు. విలువలు, నైతికత, విశ్వసనీయతకు కూడా ప్రజలు అప్పడప్పడూ పట్టం కడతారనడానికి కర్ణాటకలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. కర్ణాటక ఉప ఎన్నికలు 15 అసెంబ్లీ స్థానాల్లో జరిగితే అందులో అనర్హత ఎమ్మెల్యేలు టిక్కెట్లు పొంది ఇద్దరు తప్ప అందరూ గెలిచారు. యడ్యూరప్ప గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తామని చెప్పడంతో కొన్ని చోట్ల వారికి ఓట్లు వేసి గెలిపించుకున్నారు.

కోట్లకు అధిపతి అయినా….

కానీ హోస్ కోటె లో భిన్నమైన పరిస్థితి. ఇక్కడ సంకీర్ణ సర్కార్ పై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీనియర్ నేత ఎంటీబీ నాగరాజు. బలమైన నేత. ఓట్ల పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఎంటీబీ నాగరాజును ఢీకొట్టాలంటే ఎవరికైనా కష్టమే. దాదాపు వెయ్యి కోట్ల ఆస్తిపై మాటే. కర్ణాటకలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నేతగా ఎంటీబీ నాగరాజును చెప్పుకోవచ్చు. అలాంటి ఎంటీబీ నాగరాజును హోస్ కోటె ప్రజలు ఓడించారు.

యువనేతను ఎన్నుకుని….

పార్టీ మారినందుకా? విలువలు లేనందుకా? అన్నది పక్కన పెడితే ఆయనను ఓడించింది మాత్రం ఒక యువనేత కావడం విశేషం. భారతీయ జనతా పార్టీలోనే ఉండి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన శరత్ బచ్చే గౌడ ఎంటీబీ నాగరాజును చిత్తు చిత్తుగా ఓడించారు. హోస్ కోటె లోని భారతీయ జనతా పార్టీలో నిజానికి బచ్చేగౌడ కుటుంబానికి మంచిపేరుంది. తొలినుంచి పార్టీలోనే ఉన్నా ఆ కుటుంబానికి తిరిగి టిక్కెట్ ఇవ్వమని కోరినా యడ్యూరప్ప మాత్రం ఎంటీబీ నాగరాజు వైపు మొగ్గు చూపారు.

స్వతంత్ర అభ్యర్థిగా….

శరత్ బచ్చేగౌడ తండ్రి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నారు. శరత్ బచ్చేగౌడకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీజేపీ క్యాడర్ మొత్తం ఎదురుతిరిగింది. ఎంటీబీ నాగరాజును పక్కన పెట్టింది. రెబల్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శరత్ బచ్చేగౌడకు క్యాడర్ జై కొట్టింది. దీంతో కోట్లకు అధిపతి అయిన ఎంటీబీ నాగరాజు ఓటమి పాలయ్యరు. క్యాడర్ బలం ఉన్న శరత్ గెలుపొందారు. బీజేపీ రెబల్ అభ్యర్థి కావడంతో ఆయన కూడా యడ్యూరప్ప ఖాతాలోకే రానున్న కాలంలో వచ్చినా డబ్బు అన్ని చోట్లా పనిచేయదని హోస్ కోటె లో తేలిపోయింది.

Tags:    

Similar News