గ్రేటర్ విశాఖలో బీజేపీ మ్యాజిక్ రిపీట్ ?

గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలను అంతా చూశారు. బలమైన టీఆర్ఎస్ పార్టీని పక్కకు నెట్టి అర్ధ శతకం కొట్టి బీజేపీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక తరువాత చూసుకుంటే [more]

Update: 2020-12-12 13:30 GMT

గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలను అంతా చూశారు. బలమైన టీఆర్ఎస్ పార్టీని పక్కకు నెట్టి అర్ధ శతకం కొట్టి బీజేపీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక తరువాత చూసుకుంటే ఏపీవే మా టార్గెట్ అంటోంది. హైదరాబాద్ తో పోల్చదగిన సిటీ ఏపీలో ఏదైనా ఉంటే అది గ్రేటర్ విశాఖే అని చెప్పాలి. ఇక్కడ కూడా నానా జాతి సమితిగా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మేధావులు, విద్యావంతులు ఉన్నారు. ఇక సహజంగానే బీజేపీకి మొదటి నుంచి ఇక్కడ కొంత పట్టుంది.

తొలి మేయర్ రికార్డ్ …

ఒక సాధారణ మునిసిపాలిటీగా ఉన్న విశాఖ 1979లో కార్పోరేషన్ అయింది. ఆనాడు తొలి మేయర్ గా కుర్చీ ఎక్కింది బీజేపీకి చెందిన మనిషే. అలా బీజీపీ దిగ్గజ నేత‌ ఎన్ ఎస్ ఎన్ రెడ్డి బీజేపీ తొలి మేయర్ గా చరిత్రకు ఎక్కారు. ఆయన విజయం కోసం నాటి బీజేపీ తొలి జాతీయ ప్రెసిడెంట్ వాజ్ పేయి విశాఖ వచ్చి మరీ కొన్ని రోజులు మకాం వేశారు. వెంకయ్యనాయుడు, పీవీ చలపతిరావు సహా అతిరధ మహారధులు అంతా రంగంలోకి దిగి బీజేపీని గెలిపించుకున్నారు. ఆ తరువాత అదే ఎన్ ఎస్ ఎన్ రెడ్డి విశాఖ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి మరో రికార్డు సృష్టించారు.

విజయాలున్న చోటు..

ఇక బీజేపీకి విశాఖతో చాలా అనుబంధం ఉంది. ఆ పార్టీ జెండా ఏంటో ఏపీలో ఎవరికీ తెలియని రోజుల్లో విశాఖవాసులు ఆదరించారు. ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, అనేక సార్లు ఎమ్మెల్సీగా బీజేపే వారిని గెలిపించి ఆదరించారు. ఇక 2007లో తొలిసారి జరిగిన గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో టీడీపీ వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసి కూడా నాలుగు డివిజన్లను బీజేపీ గెలుచుకుంది అంటే బాగానే పట్టు ఉన్నట్లే లెక్క అనుకోవాలి.

వారే బలం….

విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అలాగే ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ఉత్తరాది నుంచి వచ్చిన వారు ఉద్యోగాలు, వ్యాపారాలూ చేసుకున్న వారంతా బీజేపీ వైపే ఉంటారు. వారి మద్దతే శ్రీరామరక్షగా బీజేపీ ప్రతీ ఎన్నికలో పోటీ చేస్తూ వస్తోంది. మరి కొత్త ఏడాది జరిగే గ్రేటర్ విశాఖ‌ ఎన్నికల్లో బీజేపీ ఏ మాదిరి విజయాలను నమోదు చేస్తుందన్నది ఇపుడు చర్చగా ఉంది. బీజేపీకి ఇపుడు లోకల్ గా జనసేన మద్దతు ఉంటుంది. మేధావులు, విద్యావంతులు మొగ్గు అటే ఉంటుంది. దానికి తోడు వైసీపీకి సిటీలో పట్టు తక్కువ. ఇవన్నీ చూసుకున్నపుడు బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ తరువాత విశాఖలో మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్న మాట అయితే ఉంది. చూడాలి మరి.

Tags:    

Similar News