ఈసారైనా మోడీ మాయ నుంచి తప్పించుకోగలరా?

వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కీలకమైన, పెద్ద రాష్ర్టమైన యూపీపైనే అందరి చూపూ ఉంది. [more]

Update: 2021-08-01 16:30 GMT

వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిల్లో యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో కీలకమైన, పెద్ద రాష్ర్టమైన యూపీపైనే అందరి చూపూ ఉంది. తరవాత పంజాబ్ పై ఆసక్తి నెలకొంది. ఇక్కడ హస్తం పార్టీ పాలన సాగుతోంది. ఈశాన్య భారతం లోని మణిపూర్, పశ్చిమ భారతంలోని గోవా పేరుకు చిన్న రాష్రాలైనప్పటికీ రాజకీయంగా ప్రాధాన్యం కలిగినవి. ఈ రెండు చోట్లా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లదే కీలక పాత్ర. చిన్న పార్టీలు ఉన్నప్పటికీ వాటి పాత్ర పరిమితమే. దీంతో ఈ రెండు రాష్రాల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ అనివార్య కారణాల వల్ల అధికారాన్ని అందుకోలేకపోయిన హస్తం పార్టీ ఈసారి పకడ్బందీ వ్యూహరచనతో ముందుకు సాగుతోంది.

మణిపూర్ లో…..

అరవై సీట్లు గల మణిపూర్ ఈశాన్య భారతంలోని కీలక రాష్రాల్లో ఒకటి. 2017 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పటికే ఆ పార్టీకి చెందిన ఒక్రమ్ ఇబోబీ సింగ్ మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా 15ఏళ్ల నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. అప్పటివరకు రాష్ర్టంలో ఉనికే లేని భారతీయ జనతా పార్టీ నాటి ఎన్నికల్లో 21 సీట్లు సాధించింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ 4, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ 4 సీట్లు సాధించి కీలకంగా మారాయి. లోక్ జనశక్తి పార్టీ ఒకచోట, మరోచోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజేతగా నిలిచారు. నిబంధనల మేరకు అతిపెద్ద పార్టీ అయిన హస్తం అధికారాన్ని అందుకోవాలి. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దల లాబీయింగ్, గవర్నర్ తమ పార్టీ వారు కావడంతో బీజేపీ ఇంఫాల్ పీఠాన్ని అధిష్టించింది. హింగాంగ్ నుంచి గెలిచిన ఆ పార్టీ నాయకుడు ఎన్. బిరెన్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. మణిపూర్ లో అధికారాన్ని అందుకోవడం కమలానికి అదే తొలిసారి. ఈసారి బీజేపీక అంత తేలిక కాదన్నది విశ్లేషకుల అంచనా.

మాయోపాయాలతో…?

పశ్చిమ రాష్ర్టమైన గోవాలోనూ బీజేపీ మాయోపాయాలతో పనాజీ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 40 సీట్లకు ఆ పార్టీకి వచ్చినవి 13. అప్పటి వరకు అధికారంలో ఉన్న హస్తం పార్టీ 17 సీట్లు సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. మహారాష్ర్ట వాది గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, స్వతంత్ర శాసనసభ్యులు, గవర్నర్ అండతో బీజేపీ అధికారాన్ని అందుకుంది. నైతిక విలువలకు మారుపేరైన, ఐఐటీలో విద్యనభ్యసిం చిన మనోహర్ పారికర్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. వాస్తవానికి అధికారానికి దూరంగా ఉండాలని పారికర్ అనుకున్నారని, కానీ పార్టీ పెద్దల ఒత్తిడితో పగ్గాలు చేపట్టారన్న అభిప్రాయం అప్పట్లో రాజకీయ వర్గాల్లో ఉంది.

పారికర్ మరణంతో….

రెండేళ్ల అనంతరం పారికర్ మరణంతో 2019లో ప్రమోద్ సావంత్ సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లనుంది. ఈసారి సకల శక్తులను కూడగట్టుకుని ఎన్నికలకు వెళతామని పీసీసీ చీఫ్ గిరీష్ బోడంకర్ చెబుతున్నారు. రాష్ర్ట పార్టీ పరిశీలకుడైన కర్ణాటకకు చెందిన దినేష్ గూండూరావు పార్టీలోని వివిధ వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దినేష్ గూండూరావు ఒకప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఆర్. గూండూరావు కుమారుడు. 2019లో పార్లమెంటు ఎన్నికల్లో రాష్ర్టంలోని రెండు సీట్లలో తమ పార్టీ ఒకటి గెలుచుకుందని, ప్రజలు ఏకపక్షంగా బీజేపీ వైపు లేరనడానికి ఇది నిదర్శనమని దినేష్ గూండూరావు తెలిపారు. మోదీ గాలిలోనూ ఉన్న రెండు సీట్లలో ఒకటి మాత్రమే బీజేపీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు. అందువల్ల ఈసారి బీజేపీని నిలువరించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News