ఐదింటిలో ఈసారి ఎన్ని?

కరోనా, కశ్మీర్ సమస్యలు కుదుటపడుతున్న తరుణంలో అన్ని పార్టీల చూపు అసెంబ్లీ ఎన్నికలపై పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న అయిదు రాష్రాల అసెంబ్లీ [more]

Update: 2021-07-10 16:30 GMT

కరోనా, కశ్మీర్ సమస్యలు కుదుటపడుతున్న తరుణంలో అన్ని పార్టీల చూపు అసెంబ్లీ ఎన్నికలపై పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న అయిదు రాష్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్టీలకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. కీలకమైన యూపీ, దాని పక్కనే గల ఉత్తరాఖండ్, పంజాబ్, పశ్చిమాన గల గోవా, ఈశాన్య భారతంలోని మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలను మినీ సార్వత్రిక ఎన్నికలుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈఅయిదు రాష్టాల్లో జాతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో భాజపా, పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతోంది, ఈ ఎన్నికలు (2023 మార్చి) జరిగిన మరో ఏడాదిలో అంటే 2024లో కీలకమైన పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో రెండు జాతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి.

యూపీపైనే ఆశలు…

అధికారాన్ని కాపాడుకునేందుకు ఎత్తులు పైయెత్తులు, వ్యూహరచన దిశగా పావులు కదుపుతున్నాయి. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని జారవిడుచుకునేందుకు జాతీయ పార్టీలు సిద్ధంగా లేవు. అయిదు రాష్టాల్లో అన్నింటికన్నా కీలకమైనది యూపీ. ఇది దేశానికి గుండెకాయ వంటిది. 80 పార్లమెంటు సీట్లు, 403 అసెంబ్లీ సీట్లు గల యూపీ పైనే అందరి చూపూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ యోగీ ఆదిత్య నాథ్ నాయకత్వంలోని భాజపా సర్కారు అధికారంలో ఉంది. గత అయిదేళ్లుగా అధికారంలో ఉన్న యోగి తీరుపై పార్టీ శ్రేణుల్లోనే అసమ్మతి స్వరాలు వినపడుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇటీవల యోగిని హస్తినకు పిలిపించి తలంటారన్న వార్తలు పార్టీలో పరిస్థితి అనుకున్నంత సవ్యంగా లేదన్న అభిప్రాయం కలిగించింది. ఇక మోదీకి ఇష్టుడైన గుజరాత్ క్యాడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఎ.కె.శర్మను రాష్ర్ట పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించడం యోగి అభీష్టానికి అనుగుణంగా జరిగిందని చెప్పలేం. 2017 ఎన్నికల్లో 312 సీట్లతో తిరుగులేని మెజార్టీని సాధించిన కమలం పార్టీకి ఇప్పుడు ఎదురుగాలులు వీస్తున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ మొదటి స్థానంలో నిలవగా కమలం పార్టీ రెండో స్థానానికి పరిమితమవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కమలనాథుల్లో కలవరపాటు కనపడుతోంది.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ….

ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ర్టం ఉత్తరాఖండ్. యూపీని విడగొట్టి 2000 సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేశారు. 2017 ఎన్నికల్లో 70 సీట్లకు కమలం పార్టీ 57, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకున్నాయి. అంతర్గత కలహాల కారణంగా 2019 మార్చిలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ను మార్చి తీర్థ సింగ్ రావత్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టినప్పటికీ కుమ్ములాటలు కొలిక్కి రాలేదు. మరోసారి ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చింది. గోవాలో తగిన బలం లేనప్పటికీ గవర్నర్ అండదండలతో 2017లో భాజపాకు చెందిన మనోహర్ పారికర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2019 మార్చిలో పారికర్ మరణంతో ప్రమోద్ సావంత్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. 60 సీట్లు గల గోవాలో 2017లో కాంగ్రెస్ 17 సీట్లు గెలిచింది. కేవలం 13 సీట్లే కైవశం చేసుకున్న బీజేపీ మాయోపాయాలతో అధికారాన్ని చేజిక్కించుకుంది.

మణిపూర్ లోనూ….

మణిపూర్ లోనూ ఇదే పరిస్థితి. మొత్తం 60 సీట్లకుగాను 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు సాధించింది. కేవలం 21 సీట్లు సాధించిన కమలం పార్టీ అధికార మాయోపాయాలతో బిరేన్ సింగ్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. 117 సీట్లు గల పంజాబ్ లో కమలం ఉనికి దాదాపు శూన్యం. గత ఎన్నికల్లో అకాలీదళ్ తో పొత్తు పెట్టుకుని సాధించిన సీట్లు కేవలం మూడంటే మూడు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల కారణంగా రెండు పార్టీల మధ్య గల దశాబ్దాల బంధం తెగిపోయింది. రేపటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే కమలం ఉన్న సీట్లను నిలుపుకుంటే గొప్పే. మొత్తంమీద అయిదు రాష్టాల్లోనూ భాజపాకు అంతగా సానుకూల సంకేతాలు కనపడటం లేదన్నది రాజకీయ పండితుల అంచనా.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News