మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?

తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీలకు కనువిప్పు. పార్టీకి సర్వం సహా తామై పోయిన మోడీ, అమిత్ షా ద్వయానికి ఓటర్లు మొట్టికాయ వేశారు. సైద్దాంతిక [more]

Update: 2021-05-03 16:30 GMT

తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీలకు కనువిప్పు. పార్టీకి సర్వం సహా తామై పోయిన మోడీ, అమిత్ షా ద్వయానికి ఓటర్లు మొట్టికాయ వేశారు. సైద్దాంతిక నిబద్ధతకు నీళ్లొదిలి ఎంతకైనా దిగజారిన కాంగ్రెసు, కమ్యూనిస్టులకు కన్నీళ్లు మిగిల్చారు. అసోం, పుదుచ్చేరి వంటి చోట్ల ఎన్డీఏ గెలిచినా అది కంటి తుడుపే. కేరళలో కమ్యూనిస్టు విజయమూ నిజానికి పార్టీ సక్సెస్ కాదు. ఉక్కు మనిషి విజయన్ సంకల్పమే దానికి కారణం. ఏతావాతా ఎన్నికల ఫలితాలు ముందుగా అనుకున్నట్లుగానే వచ్చినా బెంగాల్ ఫలితం మాత్రం జాతీయ పార్టీలకు ఒక చక్కటి గుణపాఠం. సమాఖ్య వ్యవస్థలో ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుట్టుకుని వస్తున్నాయి. వాటికి జనాదరణ ఎందుకు లబిస్తోందనే దానికి సమాధానంగా ఈ ఎన్నికలను చూడాలి. రాష్ట్రస్థాయిలో బలమైన నాయకులను ఎదగనీయకుండా , చక్రం తిప్పాలనుకుంటే జాతీయ పార్టీలు మట్టిగొట్టుకుపోవడం తథ్యం.

అంతా మీరే అయితే ఇంతే….?

పశ్చిమ బెంగాల్ పరాజయం మోడీ, అమిత్ షా లదే. అందులో ఎవరికీ సందేహం లేదు. సంశయాలు కూడా లేవు. మీడియా వార్తలు, సర్వేలు, ఎన్నికల కమిషన్ కఠిన వైఖరుల రూపంలో పోటాపోటీ వాతావరణాన్ని బీజేపీ అగ్రనాయకద్వయం సృష్టించగలిగింది. కానీ ఓటర్ల మనసును గెలుచుకోలేకపోయారు. అందులోనూ అనూహ్యంగా మూడింట రెండువంతుల ఆధిక్యంతో మమత బెనర్జీ గెలవడం మోడీ, షా లకు తలకొట్టేసినట్లే. జాతీయ వాద బావనను బీజేపీ బెంగాల్ లో బాగానే ప్రేరేపించగలిగింది. కానీ అదే సమయంలో బీజేపీ మరిచిపోయిన మరో ముఖ్య అంశం ఉంది. జాతీయ వాదాన్ని ఎంతగా అక్కున చేర్చుకుంటారో అంతగానూ విభజన వాదాన్ని బెంగాల్ ప్రజలు వ్యతిరేకిస్తారు. 20 వశతాబ్దం తొలినాళ్లలో బెంగాల్ ను బ్రిటిష్ పాలకులు విభజించినప్పుడు అందుకు వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమం పురుడు పోసుకున్నది ఆ గడ్డపైనే. స్వాభిమానం ఎక్కువగా కనిపిస్తుంది. తమ మూలాలపట్ల గౌరవం కూడా అక్కడి ప్రజల్లో అధికం. మోడీ, అమిత్ షాలు అంతా తామే కాకుండా ప్రత్యామ్నాయం ఆలోచించి జాతీయ వాదానికి , ప్రాంతీయ నేతలను జోడించి ఉండాల్సింది. స్థానికంగా ఒక బలమైన నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టి ఉంటే బాగుండేది. తమను చూసే ప్రజలు ఓట్లు వేయాలని వారిద్ధరూ భావించారు. పట్టం గడతారని భ్రమించారు. వారి ఆలోచనలను బెంగాలీ ఓటరు తిప్పికొట్టారు. ఆ మట్టిపైనే పుట్టి పెరిగిన మమతను మరోసారి ఆశీర్వదించారు. శషభిషలకు తావు లేకుండా, బేరసారాలకు , సందిగ్ధానికి ఆస్కారం ఇవ్వకుండా బంపర్ మెజార్టీతో గెలిపించారు.

కామ్రేడ్, కాంగ్రెసుకు చెంప దెబ్బ…

కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు దివాలాకోరు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. బెంగాల్ లో తమకెలాగూ గెలుపు దక్కదని తెలుసు. బీజేపీ, తృణమూల్ మధ్య పోటాపోటీ వాతావరణం ఉంది. అటువంటప్పుడు వచ్చేదీ , పోయేదీ లేదు. రాష్ట్రానికొక విధానంతో గందరగోళ పడుతున్నారు. బెంగాల్ లో చేతులు కలిపి పోరాడుతున్నారు. కేరళలో కాంగ్రెసు, కమ్యూనిస్టుల మధ్య ముఖాముఖి పోటీ. పొత్తుపై చర్చకు తావు లేకుండా లౌకిక వాదం విషయంలో రాజీ పడటం లేదని కమ్యూనిస్టు నాయకులు సర్ది చెబుతూ వచ్చారు. బీజేపీ మతవాద అజెండాను ఎదిరించడానికే ఇదంతా అంటూ చెప్పుకొచ్చారు. కానీ సిద్ధిఖి వంటి తీవ్రమైన మత బావనలున్న వ్యక్తి తో, ఆ పార్టీతో చేతులు కలిపారు. ఇకపై లౌకిక పార్టీలుగా తమను తాము క్లెయిం చేసుకునే అర్హతను కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు కోల్పోయాయి. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. పైపెచ్చు ఈ ఫలితం భవిష్యత్తులోనూ వెంటాడుతుంది.

ప్రాంతీయ నేతలను పెంచండి..

ప్రాంతీయ పార్టీల అగ్ర నాయకులని ప్రజలు తమ ఆత్మాభిమానానికి ప్రతీకగా భావిస్తున్నారు. జాతీయ పార్టీలలో సైతం స్థానిక నాయకులు బలంగా ఉన్నప్పుడు ఆదరిస్తున్నారు. జాతీయ నేతలను చూసి శాసనసభ ఎన్నికల్లోనూ ఓటు వేయమంటే తిరస్కరిస్తున్నారు. కేరళలో పినరయి విజయన్ విజయమే తప్ప సీపీఎం విజయం కాదని కార్యకర్తలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడులో ఆ మేరకైనా డీఎంకేకు ఏఐఏడీఎంకే పోటీ ఇవ్వగలిగిందంటే ఆ పార్టీకి ఉన్న నాయకత్వమే కారణం. అందువల్ల జాతీయ పార్టీలు శాసనసభ , స్థానిక ఎన్నికల్లో నిలదొక్కుకోవాలంటే ప్రాంతీయ నాయకులకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఆయా రాష్ట్రాలకు సంబంధించి సర్వం సహావారే నాయకులని చెప్పగలగాలి. తమ పార్టీలకు లోకల్ బ్రాండ్ లుగా నాయకులను తయారు చేసుకోవాలి. మోడీ గుజరాత్ లో ఆవిధంగా ఎదిగిన వ్యక్తే. శివరాజ్ సింగ్ చౌహాన్, యడియూరప్ప వంటి వారూ తమ పార్టీలకు గెలుపు సాధించి పెట్టారు. జీ హుజూర్ నేతలతోనే జాతీయ పార్టీలు రాష్ట్రాలను శాసించాలనుకుంటే ప్రజలు తిరస్కరిస్తారు. ఈ నిజాన్ని ఇప్పటికైనా గ్రహించకపోతే జాతీయ పార్టీలు పెద్ద పరిమాణంలోని ప్రాంతీయపార్టీలుగా మిగిలిపోతాయి.

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News