వీలయితే పవర్.. లేకుంటే బలమైన…?

ఇటీవల బిహార్ అసెంబ్లీ , జమ్ము-కశ్మీర్ జిల్లా అభివద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి జోష్ మీదున్న భారతీయ జనతా పార్టీ ఇతర [more]

Update: 2021-02-05 16:30 GMT

ఇటీవల బిహార్ అసెంబ్లీ , జమ్ము-కశ్మీర్ జిల్లా అభివద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి జోష్ మీదున్న భారతీయ జనతా పార్టీ ఇతర రాష్రాలలో విస్తరించడానికి సరికొత్త వ్యూహానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు అధికారానికి దూరంగాఉన్న రాష్రాలలో వీలైతే అధికారాన్ని చేజిక్కించుకోవడం, లేనట్లయితే కనీసం బలమైన ప్రతిపక్షంగా అవతరించడం ఈ వ్యూహంలోని ప్రధాన అంశం. తొలుత బిహార్ లో ప్రారంభించిన ఈ వ్యూహాన్ని పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, జమ్ము-కశ్మీర్ పంజాబ్, ఢిల్లీ తదితర రాష్రాలలో అమలు చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యూహాన్ని తొలుత బిహార్ లో అమలు చేసి విజయం సాధించిన కమలం పార్టీ పైన పేర్కొన్న రాష్రాలలోనూ అమలు చేయాలని నిర్ణయించింది.

అధికారమే లక్ష్యంగా…?

తాజాగా బెంగాల్ ను ఇందుకు వేదికగా ఎంచుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ రేపటి ఎన్నికల్లో ఏకంగా అధికార సాధనే లక్ష్యంగా పావులు కదుపుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 42కు గాను 18 సీట్లు సాధించిన బీజేపీ మమతను ఇంటికి పంపేందుకు ఇంతకంటే మంచి సమయం లేదని భావిస్తోంది. అందుకనే ఇటీవల కాలంలో అధికార టీఎంసీ నుంచి వలసలను ప్రోత్సహించి ఆ పార్టీని బలహీనపరచాలని చూస్తోంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటన ల సందర్భంగా 9 మంది టీఎంసీ ఎమ్మెల్యేలకు కాషాయ కండువాలు కప్పారు. సీపీఎం, కాంగ్రెస్ బలహీనంగా ఉన్నందున అధికార సాధనకు ఇంతకు మించిన సమయం లేదని పార్టీ భావిస్తోంది. ఏ కారణం చేతయినా విజయం సాధించలేకపోతే కనీసం సీపీఎం, హస్తం పార్టీలను వెనక్కినెట్టి ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

ఒడిశాలో సక్సెస్…..

ఇదే వ్యూహాన్ని పొరుగున ఉన్న ఒడిశాలోనూ అమలుకు సిద్ధమవుతోంది. ఇక్కడ నవీన పట్నాయక్ ఇరవయ్యేళ్లుగా చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ ఇప్పటికే హస్తం పార్టీని వెనక్కునెట్టి కమలం రెండో స్థానంలోకి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147కు నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ 112 సీట్లతో తిరుగులేని విజయం సాధించింది. అంతకు ముందు మూడో స్థానంలో ఉన్న కమలం 23 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. మొత్తం 21 పార్లమెంటు సీట్లకు బిజూ జనతాదళ్ 12, బీజేపీ 8 సీట్లను గెలుచుకున్నాయి. పార్లమెంటు ఫలితాలు కమలంలో జోష్ ను నింపాయి. ఇదే స్ఫూర్తితో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యంగాముందుకు సాగాలని కమలం వ్యూహంగా కనపడుతోంది.

పంజాబ్ లోనూ అంతే……

పంజాబ్ లో ఇప్పటివరకు అకాలీదళ్ తో కలసి ముందుకు సాగింది. కొత్త రైతు చట్టాల కారణంగా అకాలీలు విడిపోయారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 13కు కాంగ్రెస్ 8, బీజేపీ 2, అకాలీదళ్ 2 సీట్లు గెలుచుకున్నాయి. అందువల్ల వచ్చే అసెంబ్లీ(2022), లోక్ సభ ఎన్నికల నాటికి వీలైతే అధికారం, లేదా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. దక్షిణాదిన తెలంగాణాలోనూ ఇదే వ్యూహంతో ముందుకు సాగుతోంది. మొత్తం 17 పార్లమెంటు సీట్లకు 4 గెలుచుకుంది. ఇటీవల దుబ్బాక అసెంబ్లీ సీటును ఉప ఎన్నికలో కైవసం చేసుకుంది. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ మొత్తం 150కి దాదాపు 50 డివిజన్లను గెలుచుకుని అధికార తెరాస కు ముచ్చెమటలు పట్టించింది. ఇదే స్ఫూర్తితో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసి విజయాన్ని అందుకునేందుక ఉవ్విళ్లూరుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (8స్థానాలు) చేదు అనుభవాలు ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం ఏడు సీట్లనూ తన ఖాతాలో వేసుకుంది బీజేపీ . అదే ఊపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నది ఆ పార్టీ వ్యూహం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News