ఆట మొదలుపెట్టారుగా

విశాఖ జిల్లాలో పట్టు పెంచుకోవాలని బీజేపీ గట్టిగానే భావిస్తోంది. ఇందుకోసం చేయని ప్రయత్నం లేదు. తిరగని నాయకుల ఇల్లు లేదు. మాజీ మంత్రుల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేలు, [more]

Update: 2019-10-05 06:30 GMT

విశాఖ జిల్లాలో పట్టు పెంచుకోవాలని బీజేపీ గట్టిగానే భావిస్తోంది. ఇందుకోసం చేయని ప్రయత్నం లేదు. తిరగని నాయకుల ఇల్లు లేదు. మాజీ మంత్రుల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఇలా ఎవరినీ విడవకుండా బీజేపీ రాయబేరాలు జోరుగా చేస్తూనే ఉంది. మొత్తానికి బీజేపీ ప్రయత్నాలు ఫలించి సీనియర్ టీడీపీ నేత ఒకరు ఆ పార్టీ గాలానికి చిక్కారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా పనిచేస్తూ 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ ఇపుడు బీజేపీలో చేరబోతున్నారు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నగేష్ ఎమ్మెల్యే స్థాయి నాయకుడుగా ఉన్నారు. ఆయన పార్టీలో చేరితే జిల్లాలో ఆయా సామాజిక వర్గాలు ఈ వైపుగా తిరుగుతాయని బీజేపీ ఆశ పెట్టుకుంటోంది.

టీడీపీలో మొండిచేయి…

అయిదేళ్ల క్రితం తోట టీడీపీలో చేరినా కూడా ఆయనకు ఆ పార్టీ నుంచి దక్కింది ఏమీ లేదు. పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన తోట అక్కడ సీటు రిజర్వ్ కావడంతో ఎలమంచిలి అయినా ఇవ్వమని కోరారు. ఇక నామినేటెడ్ పదవులు అయినా ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. తోట రాకతో రూరల్ జిల్లాలో కొన్ని సీట్లను గెలుచుకున్న టీడీపీ ఆయనని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈ నేపధ్యంలో తోట పార్టీ మారాలనుకున్నారు. ఆయన వైసీపీలో చేరుతారని వినిపించింది. దానికి తగినట్లుగా ఆయన్ని తమవైపు తిప్పుకుందేందుకు ఆ పార్టీ నాయకులు యత్నించారు. సరిగ్గా ఈ విషయం తెలుసుకున్న కాషాయం పార్టీ వారు వెంటనే రంగంలోకి దిగిపోయారు. మరి ఏ తాయిలాలు ఇచ్చారో కానీ సీనియర్ నేతను తమ బుట్టలో వేసుకున్నారు.

ఆట మొదలైందా…

ఇప్పటివరకూ విశాఖ జిల్లాలో బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోలేకపోయిన బీజేపీ తోటతో తొలి బోణీ కొడుతోంది. దీంతో ఇక తమ ఆట మొదలైందని అంటోంది. ఇప్పటికే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబాన్ని, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబున్ని దువ్వినా ప్రయోజనం లేకపోవడంతో నిరాశపడిన బీజేపీకి తోట మళ్ళీ ఆశలు కల్పించారు. ఇక టీడీపీ అసంత్రుప్తులకు గాలం వేయడం ద్వారా పార్టీ పట్టుని పెంచుకుంటామని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా తోటకు ప్రాముఖ్యత కలిగిన నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోటరీలో ఉన్న తోట బీజేపీలో చేరడం అంటే ఆ బ్యాచ్ చూపు ఇటువైపు మళ్ళిందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. చూడాలి బీజేపీ హామీలు నెరవేరేదాన్ని బట్టే మరింతమంది ఆ పార్టీ వైపు చూస్తారన్నది వాస్తవం.

Tags:    

Similar News