వాయిస్ తేడా వస్తే.. వేటు తప్పదట

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక స్టాండ్ తీసుకున్నట్లే కనపడుతుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు సమాన దూరం పాటించాలని నిర్ణయించింది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే [more]

Update: 2020-06-14 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక స్టాండ్ తీసుకున్నట్లే కనపడుతుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు సమాన దూరం పాటించాలని నిర్ణయించింది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. 2024 ఎన్నికలలో స్వంతంగా పార్టీ అధికారంలోకి రావాలంటే రెండు పార్టీలకూ దూరంగా ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.

ఎప్పటి నుంచో రెండు వర్గాలు….

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎప్పటి నుంచో రెండు వర్గాలుగా విడిపోయి ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీలో అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. అధికారాన్ని బీజేపీ, టీడీపీ పంచుకున్న సమయంలో అంటే సరే, చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బీజేపీలో బాబు అనుకూల వర్గం బాగానే చెలయించింది. అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చంద్రబాబు మనిషిగా ముద్రపడ్డారు. అందుకే ఆయనను పార్టీ పక్కన పెట్టిందంటారు.

ఇప్పుడు కూడా….

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీకి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీలో నేతలు తయారయ్యారు. అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక కామెంట్ చేస్తే దానికి వ్యతిరేకంగా చేసే వారు కూడా ఉన్నారు. ఇప్పటికీ టీడీపీని సమర్థించే వారు బీజేపీలో ఉన్నారు. దీంతో పార్టీ క్యాడర్ అయోమయంలోకి వెళ్లింది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నది కమలనాధుల ఆలోచన. అయితే దీనికి నేతలే గండికొడుతున్నారు.

వేటుకు సిద్ధమయిన హైకమాండ్….

తాజాగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయనను బీజేపీ నేత కిలారు దిలీప్ సమర్థించారు. దీంతో బీజేపీ అధిష్టానం కిలారు దిలీప్ కు నోటీసులు ఇచ్చింది. అవినీతి పరులను ఎలా సమర్థిస్తారని ప్రశ్నించింది. అలాగే పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మరో బీజేపీ నేత లక్ష్మీపతి రాజాను సస్పెండ్ చేసింది. మరో నేత రామకోటయ్యను మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించింది. మొత్తం మీద అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల్లో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ బీజేపీ మాత్రం నేతలపై వేటు వేయడంలో ముందు ఉన్నట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News