ఏపీ బీజేపీకి ఆయనే దిక్కా… ?

ఏపీ బీజేపీ అన్నది ఉనికి కోసం పోరాడుతోంది. జనాల సమస్యలు ఒక వైపు ఉంటే పార్టీ పోరాటాలు మరో వైపు అన్న మాట కూడా ఉంది. జనాలు [more]

Update: 2021-09-02 15:30 GMT

ఏపీ బీజేపీ అన్నది ఉనికి కోసం పోరాడుతోంది. జనాల సమస్యలు ఒక వైపు ఉంటే పార్టీ పోరాటాలు మరో వైపు అన్న మాట కూడా ఉంది. జనాలు పెట్రోల్ వాతలతో తిప్పలు పడుతూంటే బీజేపీ నేతలు తాపీగా టిప్పు సుల్తాన్ చరిత్రను వల్లెవేసి ఆయన దేశ ద్రోహి అని నినదిస్తారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద అంతా గుర్రుమీద ఉంటే గోవధ నిషేధాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తారు. ఇలా రైమింగ్, టైమింగ్ మిస్ అవుతూ ఏపీ బీజేపీ తన రూట్ సెపరేట్ అంటోంది.

గ్రూపులెన్నో …?

ఇక ఏపీ బీజేపీలో నాయకులు ఎక్కువ. క్యాడర్ తక్కువ అన్న సెటైర్ కూడా ఉంది. ఈ ఉన్న నాయకులలో కూడా ముప్పై మూడు గ్రూపులు ఉన్నాయని చెప్పాలి. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి ఒక వైపు ఉంటే సుజనా చౌదరి, మాజీ టీడీపీ బ్యాచ్ మరో వైపు ఉంటారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మరో విధంగా రెస్పాండ్ అవుతూంటే ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉండే ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్టైల్ వేరుగా ఉంటుంది. ఇక ఆరెస్సెస్ నుంచి పార్టీలో ఉన్న సోము వీర్రాజు దూకుడే వేరు అని చెప్పాల్సిన పని లేదు. మరి వీరంతా కలుస్తారా, ఒకే మాట మీద ఉంటారా అన్నది కమలం పార్టీ కార్యకర్తలకే అర్ధం కాదు.

ఈయన చేతికేనా…?

ఇక ఉమ్మడి ఏపీలో బీజేపీకి ప్రెసిడెంట్ గా చాలా కాలం పనిచేసిన జి కిషన్ రెడ్డి ఏపీలో పార్టీ మంచీ చెడ్డా బాగా తెలుసు. ఆయనకు నాయకులు అందరూ పరిచయమే. యువజన నాయకుడిగా బీజేపీలో పనిచేసిన ఆయన ఇపుడు ఏపీ బాధ్యతలను కూడా చూడబోతున్నారు అంటున్నారు. తెలంగాణా నుంచి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఏపీకి తొలిసారి వస్తున్నారు. ఆయన ఆగస్ట్ నెలలో ఏపీలో పర్యటిస్తారు అంటున్నారు. ఆయన తన పర్యటనలో విశాఖకు కూడా వెళ్తారని చెబుతున్నారు. ఆయన ఏపీ బీజేపీ నాయకులు అందరితోనూ సమావేశమై పార్టీ భవిష్యత్తు గురించి చర్చిస్తారు అంటున్నారు.

మేలు జరిగేనా…?

బీజేపీ నేతగా కిషన్ రెడ్డి మీద ఏపీ జనాలకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన వ్యవహారశైలి కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. పరుష పదజాలంతో విమర్శలు చేయడం ఆయన నైజం కాదు. వెంకయ్యనాయుడు తరహాలోనే ఆయన సుతిమెత్తగా కామెంట్స్ చేస్తారు. ఆయన ఇప్పటిదాకా జగన్ సర్కార్ మీద విమర్శలు చేయడం కంటే సలహాలు సూచనలే ఇస్తూ వచ్చారు. ఇక ఆయన టూరిజం మినిస్టర్ గా ఉన్నారు. ఏపీలో విశాఖ సహా చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి. గతంలో ప్రతిపాదించి ఆచరణకు నోచుకోని ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో కొన్ని అయినా కిషన్ రెడ్డి తన హయాంలో పట్టాలెక్కిస్తే ఏపీ జనాలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆయన ఫేస్ వాల్యూ ఏపీ బీజేపీకి ఇపుడు అవసరంగా ఉంది. సామాజికవర్గం పరంగా చూసుకున్నా ఏపీ రాజకీయాల్లో కిషన్ రెడ్డి కొంత కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News