బీజేపీకి ఉక్రోషం పెరిగిపోతోందే ?

బ్యాంకుల్లో రాని బాకీలని చెడ్డ పద్దుల జాబితాలో చేరుస్తారు. వాటి ఊసు కలలో కూడా అసలు తలవరు. అలాగే రాజకీయాల్లో కొన్ని పాకెట్లలో ఓట్లు ఈ జన్మలో [more]

Update: 2021-04-03 12:30 GMT

బ్యాంకుల్లో రాని బాకీలని చెడ్డ పద్దుల జాబితాలో చేరుస్తారు. వాటి ఊసు కలలో కూడా అసలు తలవరు. అలాగే రాజకీయాల్లో కొన్ని పాకెట్లలో ఓట్లు ఈ జన్మలో రాలవు అనుకుంటే వాటిని కూడా అలాగే చెల్లని ఖాతాలో వేసి దండం పెట్టేస్తారు. బీజేపీకి అలా ఏపీకి పక్కన పడేసింది అన్న విశ్లేషణ ఒకటి ఉంది. వాజ్ పేయ్ లాంటి మేటి నాయకుడి ఆరున్నరేళ్ల ప్రధాని ఏలుబడిలో కూడా ఏపీలో బీజేపీ ఏ మాత్రం లేవలేదు. ఇక దేశంలో మూడు దశాబ్దాల తరువాత కేంద్రంలో ఫుల్ మెజారిటీతో బీజేపీని రెండు సార్లు తెచ్చి అజేయుడు అన్న పేరు సంపాదించుకున్న మోడీ హయాంలో కూడా ఏపీ బీజేపీ అసలు వెలగలేదు సరికదా ఇంకా దిగనారింది.

ప్రయోగశాలగా …?

దీంతో ఏపీని తమ ప్రయోగాలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రతిపాదనతో దూకుడుగా ముందుకు వెళ్తున్న బీజేపీ ఫస్ట్ ఓటు ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కి వేసింది. అలాగే ప్రత్యేక హోదా లాంటి హామీలు ఇవ్వకపోతే ఏమీ జరగదు అని ఏపీ రాజకీయాల్లో లోతులు చూసి మరీ తెలుసుకుంది. ఇపుడు పోలవరం విషయంలో కూడా తన అసలు రంగు బయటపెట్టుకుంటోంది. లేటెస్ట్ గా కేంద్రం నుంచి వచ్చిన శ్రీముఖాన్ని చూస్తే 2014 నాటి అంచనాలకు మించి ఒక్క పైసా కూడా ఏపీకి ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీని అర్ధమేంటి మహానుభావా అంటే ఏపీ అంటే తమకు ఏ రకమైన ప్రాధాన్యత లేదని చెప్పడమే.

అదే కారణమా…?

ఏపీలోని రాజకీయం కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది. తాను సీన్ లో లేను అన్న లోటు తప్ప అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీకే సలాం చేస్తారు. ఇది స్థిరపడిపోయిన అంశం. ఇక మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీని కొట్టామని, జగన్ ది ఏముంది ఉఫ్ అని ఊదేస్తే ఒక్క ఎన్నికతో ఇంటికి వెళ్ళిపోతాడు అని బీజేపీ 2019 కి ముందు వేసుకున్న అంచనాలు పూర్తిగా తప్పు అయిపోయాయి. చంద్రబాబు కూడా జగన్ వయసులో సీఎం అయి ఏకంగా మూడు దశాబ్దాల పాటు చక్రం తిప్పారు. ఇపుడు జగన్ కూడా మరో మూడు దశాబ్దాల పాటు కుర్చీ పట్టుకుని పాతుకుపోతే బీజేపీకి ఏపీలో ఏం దక్కుతుంది నోటా తో పోటీ పడడం తప్ప. మరి ఈ రకమైన ఉక్రోషంతో కూడిన ఆవేదనతోనే ఏపీ పట్ల బీజేపీ వివక్షకు రెడీ అయిపోయింది అంటున్నారు.

ఎదురు తిరగడమే …

ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీకి ఏపీ నుంచి కనీస మద్దతు కూడా దక్కదు అని చేతలలో చెప్పడం ద్వారానే ఇక్కడి పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పొరాడాలి. కానీ ఏపీ రాజకీయం చూస్తే అలా చంద్రబాబు కానీ జగన్ కానీ చేయగలరా అన్నదే చర్చ. అలా జరగని నాడు బీజేపీ ఇస్తే నిధులు లేకపోతే లేదు అన్నట్లుగానే రాష్ట్ర ప్రగతి సాగుతుంది. అలా చూసుకున్నా దీర్ఘకాలం పాటు రాజకీయాలు చేద్దామనుకుంటున్న జగన్ కానీ, తన వారసుడిని పీఠం మీద కూర్చోబెట్టా లను కుంటున్న బాబుకు కానీ మేలు కాదనే చెబుతున్నారు. బీజేపీ మీద దండెత్తకపోతే మాత్రం చివరికి వారి మెడకే ఈ ప్రగతి నిరోధక పాపం చుట్టుకుంటుంది. బీజేపీతో ఇక జాగ్రత్తగానే ఉండాలి మరి.

Tags:    

Similar News