సోముకు అసలైన విలన్లు వీరేనట…?

విలన్ అంటే ఎక్కడో ఉండరు. బుగ్గ మీసాలు పెట్టుకుని గళ్ల లుంగీ కట్టుకుని కోర చూపులతో భయంకరంగా కనిపించరు. చాలా పొలైట్ గానే ఉంటూ సరైన సమయంలో [more]

Update: 2021-02-16 13:30 GMT

విలన్ అంటే ఎక్కడో ఉండరు. బుగ్గ మీసాలు పెట్టుకుని గళ్ల లుంగీ కట్టుకుని కోర చూపులతో భయంకరంగా కనిపించరు. చాలా పొలైట్ గానే ఉంటూ సరైన సమయంలో పక్కన ఉన్న వారినే పోటు పొడుస్తున్నారు. రాజకీయాల్లో ఉండే విలన్లు అంతా అలాంటి వారే. అయితే కొన్ని పార్టీలకు సొంత వారే విలన్లుగా మారుతారు. అలా ఏపీ బీజేపీ నేతలకు కేంద్రంలోని పెద్దలే ఎపుడూ పాపంగా శాపంగా మారుతున్నారు. అందువల్లనే అన్నీ ఉన్నా కమల వికాసం ఏపీలో జరగ‌డం లేదని నేతాశ్రీలు తాపీగా చింతిస్తూ ఉంటారు.

అలా మొదలైంది…..

కేంద్రంలో మూడు దశాబ్దాల‌ తరువాత పూర్తి మెజారిటీతో మోడీ సర్కార్ 2014 ఎన్నికల్లో ఏర్పడినపుడు ఏపీ నుంచి కూడా చాలా మంది ఆశగా ఆ పార్టీ వైపు చూశారు. నాడు టీడీపీ కాంగ్రెస్, వైసీపీ నుంచి క్యూ కట్టారు కూడా. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో మడత పేచీ పెట్టడమే కాదు విభజన హామీలు తుంగలోకి తొక్కడంతో ఆ పార్టీ మీద ఏపీ జనాలకు ఆగ్రహం పెల్లుబికింది. ఈ పరిణామాలను చూసిన నాయకులు అంతా బీజేపీ లో చేరకపోవడమే బెటర్ అని వెనక్కుతగ్గారు.

మళ్లీ మిస్….

ఇక 2019 తరువాత ఏపీలో టీడీపీ చిత్తు అయింది. ఒక బలమైన ప్రాంతీయ పార్టీ నామ రూపాలు లేకుండా పోతే ఆ ప్లేస్ లోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేయాలి కదా. అలా అని ఊరికే టీడీపీ ప్లేస్ లోకి రావడం సాధ్యపడుతుందా. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. బీజేపీకి ఆయనతో వెంటనే ఇబ్బంది కూడా లేదు, అందువల్ల ఏపీ జనాలు కోరినట్లుగా ప్రత్యేక హోదాను ఇచ్చి విభజన హామీలు అమలు చేస్తే కనుక కచ్చితంగా జనాలు టీడీపీ ని మరచిపోయి బీజేపీ వైపే చూసే వారు. ఆలా వైసీపీకి ధీటుగా ఎదిగే చాన్స్ ఉండేది. కానీ బీజేపీ మాత్రం ఏపీకి ఏమీ చేయం అంటూనే బలపడాలని చూడడం రాజకీయ గడుసుతనమే. దాన్ని జనం కూడా గ్రహించారు, వారి కంటే ముందు నాయకులు కూడా అర్ధం చేసుకోబట్టే కమలానికి దూరం అంటున్నారు.

బలమైన చోటనే బలి …..

ఇక విశాఖలో నాలుగు దశాబ్దాలుగా బీజేపీకి కాస్తో కూస్తో బలం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా అక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. అటువంటి చోట విశాఖ ఉక్కుని ప్రైవేట్ చేయడమే బీజేపీ పెద్దలు చేస్తున్న అతి పెద్ద తప్పు అంటున్నారు. ఓవైపు కేంద్ర బడ్జెట్ లో కనీసంగా కూడా ఏపీకి సాయం ఉండదు, పోలవరానికి నిధులు ఇవ్వడానికి కొర్రీలు పెడతారు. మరో వైపు చూస్తే బంగారం లాంటి విశాఖ ఉక్కుని ఏమీ కాకుండా చేయాలని చూస్తారు. మరి ఎందుకు బీజేపీని ఏపీ జనం ఆదరించాలి, నాయకులు అయినా ఎందుకు చేరాలి. ఈ ప్రశ్నలు సొంత పార్టీ వారే వేసుకుంటే అసలైన విలన్ ఎవరో అర్ధమవుతోంది కదా. అవును కేంద్ర పెద్దలకు ఏపీలో బీజేపీ ఎదగడం ఇష్టం ఉన్నట్లుగా లేదు, ఉంటే ఏడేళ్ల తమ ఏలుబడిలో ఏపీకి ఇన్ని తలనొప్పులు తెచ్చిపెడతారా.

Tags:    

Similar News