క్యాస్ట్ పాలిటిక్స్ తోనే కొల్లగొట్టాలనుకుంటున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అధికారంలోకి రాలేకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా మారాలన్నదే బీజేపీ తాపత్రయం. 2024లో అధికారంలోకి రాకున్న పరవాలేదు కాని [more]

Update: 2021-02-15 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అధికారంలోకి రాలేకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా మారాలన్నదే బీజేపీ తాపత్రయం. 2024లో అధికారంలోకి రాకున్న పరవాలేదు కాని టీడీపీని పూర్తిగా బలహీనం చేయాలన్న లక్ష్యంతోనే బీజేపీ అడుగులు వేస్తుంది. ఇందుకోసం ఎక్కువగా టీడీపీ నేతలనే పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల మాజీ మంత్రి పడాల అరుణ బీజేపీ లో చేరడంతో విజయనగరం జిల్లాలో బీజేపీకి ఒక పట్టు చిక్కినట్లయింది.

అసంతృప్త నేతలను….

అలాగే ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లోనూ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తుంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో పాటు కొత్త నాయకత్వాన్ని రూపొందించుకోవాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ఏపీలో బలం లేకపోవడంతో బీజేపీ లో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. జనసేన కలవడంతో చేరే వారికి కొంత ధైర్యం వచ్చింది. టీడీపీ, వైసీపీలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని నేతలు ఇప్పుడు బీజేపీ వైపు చూసే అవకాశముందంటున్నారు.

కాపు ఓటు బ్యాంకును….

ఇప్పటికే కాపు ఓటు బ్యాంకును పటిష్టం చేసే పనిలో పడింది బీజేపీ. అందుకే రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజును నియమించింది. గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అదే సామాజికవర్గం కావడం, ఇప్పుడు జనసేన తమతో కలవడంతో కాపు ఓట్లు సాలిడ్ గా తమ ఖాతాలో పడతాయని ఈ కూటమి భావిస్తుంది. కేవలం కాపులు మద్దతిస్తే సరిపోదు. బీసీలు, ఇతర కులాల వారి అండ ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కే అవకాశముంది.

బీసీలు దరిచేరతారా?

అందుకే ఏపీలో అధికంగా ఉన్న బీసీలపై కూడా బీజేపీ కన్నేసింది. తాము అధికారంలోకి వస్తే బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని సోము వీర్రాజు చెప్పారు. ఆ ధైర్యం చంద్రబాబు, జగన్ లకు ఉందా? అని ప్రశ్నించారు. అయితే కేవలం ప్రకటనతో బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపరని వారికి తెలియంది కాదు. అందుకే బీసీ నేతలను ఎక్కువగా పార్టీలోకి చేర్చుకోవాలని ప్రణాళిక రచిస్తుంది. అయితే రాష్టాభివృద్ధి కోసం బీజేపీ కేంద్రనాయకత్వం సహకరించడం లేదన్న బాధ ఏపీ ప్రజల్లో ఉంది. విభజన హామీలను నెరవేరిస్తే మరికొన్ని వర్గాలు బీజేపీకి దగ్గరయ్యే అవకాశముంది.

Tags:    

Similar News