కాషాయం జండా ఎగరేయడమే టార్గెట్ అట

గత ఎన్నికల్లో బీజేపీ కి నోటా కన్నా తక్కువ ఓట్లే ఎపి లో వచ్చాయి. అయినా కానీ ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో తమ జెండా ఎగురవేయడానికి [more]

Update: 2020-05-27 09:30 GMT

గత ఎన్నికల్లో బీజేపీ కి నోటా కన్నా తక్కువ ఓట్లే ఎపి లో వచ్చాయి. అయినా కానీ ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో తమ జెండా ఎగురవేయడానికి చేయని ప్రయత్నం లేదు. కాస్తో కూస్తో తెలంగాణాలో కొన్ని స్థానాలు దక్కుతున్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైసిపి, టిడిపి లను తట్టుకుని కమలం వికసించడం ఇప్పట్లో అయ్యేపనే కాదు. అయితే ప్రయత్నం చేస్తే పోయేదేముందన్నది కమలనాధుల వ్యూహం గా ఉంది. అందుకే టార్గెట్ వైసిపి, టిడిపి అనే రాజకీయ వ్యూహాన్నే మొదలు పెట్టింది బీజేపీ. రెండు పార్టీలతో విసిగిన ప్రజలు ఎంతో కొంత తమవైపు చూడకపోతారా అన్న స్ట్రేటజీ లోనే గత కొద్ది నెలలుగా ఆ పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి.

విపక్ష పాత్ర కోసం …

రాజధాని తరలింపు నుంచి విద్యుత్ బిల్లుల వరకు బీజేపీ టిడిపి తో పోటా పోటీగా సొంత నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అటు అధికారపార్టీని ఇటు ప్రధాన ప్రతిపక్షం టిడిపి ని ఏ మాత్రం ఉపేక్షించకుండా తూర్పారపట్టడమే పనిగా పెట్టుకున్నట్లు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తెలియచేస్తున్నాయి. అయితే కమలం లో ఉన్న గ్రూప్ ల కారణంగా ఒకటి చంద్రబాబు బీజేపీ మరొకటి జగన్ బిజెపి వర్గాలుగా నిన్న మొన్నటివరకు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండు గ్రూప్ లను ఒక్కటిగా చేయడం ఇప్పట్లో కుదిరే పని కాదని ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. అయితే అందివచ్చే ప్రతి సమస్యను అవకాశంగా తీసుకుని ఉద్యమించాలన్న ఆలోచననే అధిష్టానం అమల్లో పెట్టాలని ఆదేశించింది.

పంథా మార్చారు …

దాంతో లాక్ డౌన్ మొదలైన నాటినుంచి కమల వికాసానికి రాష్ట్ర నేతలు నడుం కట్టారు. మోడీ రాష్ట్రాలకు చేసిందేమి లేదన్న విమర్శలకు సమాధానం ఎక్కడికక్కడ ఇవ్వడంతో బాటు ఏ నిధులను కేంద్రం ఎలా ఎంత ఇచ్చింది ప్రతి నేత చెప్పాలని సూచనలు రావడంతో ఇప్పుడు ఆ పార్టీ వర్గాలన్నీ అదే పనిలో పడ్డాయి. ఈ లెక్కలతో పాటు లాక్ డౌన్ అనంతరం ఎక్కడి సమస్యలకు అక్కడే ఉద్యమాలు చేపట్టాలన్న ఆలోచన బీజేపీ చేస్తుంది. అధికారపార్టీ తప్పులు ఎత్తిచూపుతునే ప్రధాన విపక్షం గతంలో చేసే తప్పులు గుర్తు చేస్తూ ముందుకు సాగే వ్యూహంతోనే ముందుకు పోతున్నారు. ఇది ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News