చెప్పుకోవడానికి…తిరగడానికైనా ఉండక్కర్లే?

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదు. వెనకబడిన ప్రాంతాలకు నిధులు విడుదల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలలో కొర్రీలు. విభజన హామీల అమలు చేసింది [more]

Update: 2021-01-30 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లేదు. వెనకబడిన ప్రాంతాలకు నిధులు విడుదల ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలలో కొర్రీలు. విభజన హామీల అమలు చేసింది లేదు. అయినా నవ్వి పోదురు గాక నాకేమిటి సిగ్గు అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని సమస్యలుంటే గుడులతో బురిడీ కొట్టించాలని చూస్తుంది. రధయాత్ర పేరుతో జిమ్మిక్కులు చేసినా ఏపీలో బీజేపీకి ఏమైనా ఒరిగేదేమైనా ఉంటుందా? అంటే శూన్యమనే చెప్పాలి.

అనేక ఇబ్బందుల్లో….

నిజానికి విభజన తర్వాత రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉంది. ఏడేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీని ప్రత్యేకంగా పట్టించుకున్నదేమీ లేదు. కనీసం రెవెన్యూలోటును కూడా భర్తీ చేయడం లేదు. ఏడేళ్ల నుంచి ఎవరు అధికారంలో ఉన్నా ఏడిపించి చంపుతూనే ఉన్నారు. అన్ని రాష్ట్రాలకు వచ్చినట్లే నిధులు వస్తున్నాయి తప్పించి ప్రత్యేకించి రాష్ట్రానికి బీజేపీ ఒరగబెట్టిందేమీ లేదన్నది వాస్తవం. ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశారు.

అంతా అన్యాయమే…..

పూర్తి స్థాయి బలం ఉండటంతోనే బీజేపీ ఏపీకి అన్యాయం చేస్తుందని చెప్పకతప్పదు. వీటన్నింటిని పక్కన పెట్టి ఏపీలో ఆలయాలపై జరిగిన దాడులకు నిరసనగా నిస్సిగ్గుగా రధయాత్రకు బయలుదేరుతున్నారు. కేవలం సెంటిమెంట్ అనే ఆయింట్ మెంట్ పూయడానికే బీజేపీ ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీ ఓటర్లు అంత అమాయకులు కారు. అసలు రామతీర్థం అనేది ఎప్పుడు గుర్తొచ్చింది. రాజకీయ నేతలు ఎవరైనా ఇన్నేళ్లలో ఆ గుడిని దర్శించారా? ఎవడో చేసిన ఆకతాయి పనికి మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

జనసేన కూడా ….

రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడతానని, ప్రశ్నిస్తానని వచ్చిన జనసేన సయితం బీజేపీ చేతిలో పావుగా మారిపోయింది. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహాకారాన్ని తీసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలు ఏవీ జనసేన చేయడం లేదు. ఢిల్లీ వెళ్లినా పార్టీ విషయాలు తప్ప బీజేపీ నేతలతో అభివృద్ధి విషయాలపై చర్చించడం లేదు. ఇన్ని సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని, తమ పార్టీని ప్రశ్నించాల్సిన బీజేపీ రథయాత్ర అంటూ బయలుదేరడం చూసి నవ్వుకుంటున్నారు. ఇలాగే వ్యవహరిస్తే రానున్న కాలంలో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కంటే మరింత దుర్గతి పడుతుందనడంలో అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News