బీజేపీకి ఇక్కడ అధికారం అప్పుడేనట…?

ఏపీలో బీజేపీ దూకుడు చూస్తే కధ మామూలుగా లేదు. రేపో మాపో ఎన్నికలు అన్నట్లుగా కమలనాధులు తొందరపడుతున్నారు. నిన్న తెలంగాణా నేడు ఏపీ అంటూ గట్టి స్లోగన్లు [more]

Update: 2021-02-08 03:30 GMT

ఏపీలో బీజేపీ దూకుడు చూస్తే కధ మామూలుగా లేదు. రేపో మాపో ఎన్నికలు అన్నట్లుగా కమలనాధులు తొందరపడుతున్నారు. నిన్న తెలంగాణా నేడు ఏపీ అంటూ గట్టి స్లోగన్లు ఇస్తున్నారు. అక్కడ కేసీయార్ పని అయిపోయింది, ఇక తిరుపతి ఉప ఎన్నికతో జగన్ లెక్క కూడా తేలిపోతుంది అని ఒక్కటే హల్ చల్ చేస్తున్నారు. మరి నిజానికి బీజేపీకి ఏపీలో అంత సత్తా ఉందా అంటే సగటు జనం పెదవి విరుస్తారు. బీజేపీ అంటే తెలియని పల్లెలు ఏపీలో వేలల్లో ఉన్నాయి. మరి ఎందుకో బీజేపీకి మాత్రం ధీమా ఒక్కసారిగా పెరిగిపోతోంది.

అది దురాశేనా …?

ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి బలమైన క్యాడర్ అండగా ఉంది. ఇక నాలుగు దశాబ్దాలుగా పాతుకుపోయిన టీడీపీ బలాన్ని ఎవరు తక్కువ అంచనా వేసినా కూడా పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే బూత్ లెవెల్ దాకా క్యాడర్ ఉన్న ఒకే ఒక పార్టీ ఏపీలో టీడీపీ మాత్రమే. పైగా రాజకీయ వ్యూహకర్త చంద్రబాబు నాయకత్వం ఆ పార్టీకి రక్షణ కవచం. మరి ఇన్ని తెలిసి కూడా ఏపీలో పాగా వేద్దామని బీజేపీ అనుకుంటోంది అంటే అది వట్టి దురాశ మాత్రమేనని అంతా అంటారు. కానీ బీజేపీకి తిరుపతి లో గెలుపు గుర్రం కనిపిస్తోంది. దాంతో తాను రెడీ అంటూ బస్తీ మే సవాల్ చేస్తోంది.

మూడు దశాబ్దాలేనా…?

ఏపీలో బీజేపీ హడావుడి రధయాత్రల మీద వైసీపీ మంత్రి కొడాలి నాని తాజాగా వేసిన సెటైర్లు ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. బీజేపీ రధం ఇంకా బయల్దేరలేదు కానీ అది అనుకున్న గమ్యానికి చేరడానికి మూడు దశాబ్దాల పాటు అలా పరుగులు తీయాల్సిందేనని కొడాలి నాని అంటున్నారు. దానికి ఆయన ఉదాహరణలు కూడా చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో 1990 ప్రాంతంలో బీజేపీ రధయాత్ర చేస్తే 2017 లో అధికారంలోకి వచ్చిందని కూడా గుర్తు చేస్తున్నారు. మరి ఏపీలో ఇపుడు రధం తోలితే కచ్చితంగా 2050 వరకూ అధికారం కోసం ఆశలు పెట్టుకోనవసరం లేదని కూడా లాజిక్ పాయింట్ తీసి మరీ మాట్లాడుతున్నారు.

ఇదీ జనం మాట…..

బీజేపీ ఏపీలో అధికారంలోకి రావాలంటే రధయాత్రలు హోమాలు, యాగాలు చేయాల్సిన అవసరం లేదని సగటు జనం అంటున్నారు. ఏపీ మీద కాస్తా దృష్టి పెట్టి చెప్పిన మాట మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అలాగే విభజన హామీలను నెరవేర్చి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని మంచి సలహానే ఇస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంతో పాటు ఏపీలో నెలకొన్న రాజధాని సమస్యను సాఫీగా పరిష్కరిస్తే రానున్న రోజుల్లో బీజేపీకి అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంటుందని అంటున్నారు. మరి ఈ దగ్గర దారి వదిలేసి బీజేపీ రాముడూ రధాలు అంటూ వేరే రూట్లో కలియతిరిగితే పుణ్యం దక్కుతుంది కానీ ఫలితం ఉంటుందా. చూడాలి మరి.

Tags:    

Similar News